
📌 Key Points
- నెహ్రూ కాలాన్ని ‘Nation Building Era’గా అభివర్ణిస్తారు, దేశ నిర్మాణానికి పునాదులు వేశారు.
- IITలు, AIIMS, CSIR వంటి సంస్థలను స్థాపించి, సాంకేతిక, వైద్య, శాస్త్రీయ రంగాలకు దిక్సూచిగా నిలిచారు.
- ప్రజాస్వామ్య విలువలు, భావ ప్రకటన స్వేచ్ఛ, లౌకికవాదాన్ని బలంగా సమర్థించారు.
- మహిళల హక్కుల కోసం హిందూ కోడ్ బిల్ వంటి ప్రగతిశీల నిర్ణయాలు తీసుకున్నారు.
భారత రాజకీయ చరిత్రలో నెహ్రూ, మోడీ నాయకత్వాల పోలిక నిరంతరం చర్చనీయాంశం. దేశ నిర్మాణం, ప్రజాస్వామ్య బలోపేతం, భవిష్యత్ తరాలకు వారసత్వం వంటి అంశాలపై చరిత్ర ఎవరికి తీర్పు ఇస్తుంది? వారి పనితీరును లోతుగా విశ్లేషిద్దాం.
దేశ నిర్మాణంలో నెహ్రూ పాత్ర
భారతదేశ రాజకీయ చరిత్రలో నాయకుల వార సత్వాలపై చర్చలు ఎప్పుడూ కొనసాగుతూనే ఉంటాయి. అయితే నేడు దేశ రాజకీయ సంభాషణలో అత్యంత ఆసక్తికరమైన అంశం జవహర్‌లాల్ నెహ్రూ, నరేంద్ర మోడీ నాయకత్వాల మధ్య జరుగుతున్న పోలిక.. ఈ ఇద్దరు వేర్వేరు కాలాల్లో, రెండు భిన్నమైన భారతదేశాలకు నాయకత్వం వహించారు. అందువల్ల వారి పనితీరును అంచనా వేయాలంటే కేవలం ఎన్నికల విజయాలు లేదా అధికార కాలపరిమితిని మాత్రమే ప్రమాణంగా తీసుకోవడం సరిపోదు..
ఈ నాయకులు దేశానికి ఏమి అందించారు? ప్రజా స్వామ్యాన్ని ఎంత బలోపేతం చేశారు? భవిష్యత్ తరాలకు ఎలాంటి వారసత్వాన్ని వదిలి వెళ్లారు? అనే ప్రశ్నలే చరిత్ర అడిగే అసలు ప్రశ్నలు. నెహ్రూ ముందు ఉన్న ప్రధాన బాధ్యత దేశాన్ని పాలించడం కాదు. దేశాన్ని నిర్మించడం. అందుకే నెహ్రూ కాలాన్ని చాలామంది “Nation Building Era”గా అభివర్ణిస్తారు.
1947లో స్వాతంత్ర్యం వచ్చినప్పుడు భారతదేశం తీవ్ర సవాళ్ల మధ్య నిలిచింది. విభజన గాయాలు, నిరాశ్రయుల సమస్య, పేదరికం, నిరక్షరాస్యత, పారిశ్రామిక వెనుకబాటుతనం, ఆహార కొరత ఇలాంటి సంక్లిష్ట పరిస్థితుల్లో నెహ్రూ నాయకత్వం ప్రారంభమైంది. ఆయన ముందు ఉన్న ప్రధాన బాధ్యత దేశాన్ని పాలించడం కాదు. దేశాన్ని నిర్మించడం. అందుకే నెహ్రూ కాలాన్ని చాలామంది “Nation Building Era”గా అభివర్ణిస్తారు. భారతీయ సాంకేతిక విద్యకు పునాది వేసిన IITలు, వైద్య రంగానికి ప్రతిష్ఠ తీసుకొచ్చిన AIIMS, శాస్త్రీయ పరిశోధనకు దిక్సూచిగా నిలిచిన CSIR సంస్థలు, అణుశక్తి కార్యక్రమం, భారీ ఆనకట్టలు, ఉక్కు పరిశ్రమలు, ప్రభుత్వ రంగ సంస్థలు.. ఇవన్నీ భారత అభివృద్ధి పథానికి పునాదులుగా నిలిచాయి. నెహ్రూ దృష్టిలో దేశ బలం వ్యక్తుల్లో కాదు, సంస్థల్లో ఉంటుంది. నాయకులు మారవచ్చు, కానీ బలమైన సంస్థలు దేశాన్ని నిలబెడతాయని ఆయన విశ్వసించారు.
ప్రజాస్వామ్య పరిరక్షణలో నెహ్రూ విజయం
అంతేకాదు, స్వాతంత్ర్యం అనంతరం ఆసియా, ఆఫ్రికాలోని అనేక దేశాలు సైనిక లేదా నియంతృత్వ పాలనల వైపు మళ్లిన సమయంలో భారతదేశం ప్రజాస్వామ్య మార్గంలో నిలబడటం కూడా నెహ్రూ నాయకత్వానికి ఒక ముఖ్యమైన పరీక్షగా నిలిచింది. భావ ప్రకటన స్వేచ్ఛ, ప్రతిపక్ష హక్కులు, పార్లమెంటరీ వ్యవస్థ, సమాఖ్య స్ఫూర్తి, లౌకికవాదం వంటి రాజ్యాంగ విలువలను ఆయన బలంగా సమర్థించారు. మహిళల హక్కుల విషయంలో కూడా నెహ్రూ తీసుకున్న నిర్ణయాలు ప్రగతిశీలమైనవే. హిందూ కోడ్ బిల్ ద్వారా మహిళలకు వారసత్వం, ఆస్తి, వివాహ సంబంధ హక్కులను విస్తరించడానికి ఆయన చేసిన ప్రయత్నం భారత సామాజిక చరిత్రలో ఒక మైలురాయిగా నిలిచింది.
ఇక నరేంద్ర మోడీ నాయకత్వాన్ని పరిశీలిస్తే, ఆయన 2014లో బాధ్యతలు స్వీకరించిన సమయానికి భారతదేశం ఇప్పటికే ప్రపంచంలో అతిపెద్ద ప్రజాస్వామ్యంగా, బలమైన రాజ్యాంగ వ్యవస్థ కలిగిన దేశంగా ఎదిగింది. విద్య, విజ్ఞానం, అంతరిక్షం, అణుశక్తి, పారిశ్రామిక రంగాల్లో భారతదేశానికి ఒక స్థిరమైన పునాది అప్పటికే ఏర్పడింది. ఈ నేపథ్యంలో మోడీ ముందు ఉన్న ప్రధాన సవాలు దేశ నిర్మాణం కాదు. ఇప్పటికే నిర్మితమైన వ్యవస్థకు వేగం జోడించడం. డిజిటల్ ఇండియా, యూపీఐ విప్లవం, ప్రత్యక్ష లబ్ధిదారుల బదిలీ (DBT), మౌలిక వసతుల విస్తరణ, రహదారులు, రైల్వేల ఆధునికీకరణ, స్టార్టప్ ఎకోసిస్టమ్ అభివృద్ధి వంటి రంగాల్లో మోడీ ప్రభుత్వం గణనీయమైన మార్పులు తీసుకువచ్చిందని ఆయన మద్దతుదారులు వాదిస్తారు. అంతర్జాతీయ వేదికలపై భారతదేశం మరింత ఆత్మవిశ్వాసంతో ముందుకు రావడంలో కూడా ఆయన పాత్ర ఉందని భావిస్తారు.
అయితే అభివృద్ధి గణాంకాలు మాత్రమే ప్రజాస్వామ్య ఆరోగ్యాన్ని నిర్ణయించవు. పత్రికా స్వేచ్ఛ పరిస్థితి, స్వతంత్ర సంస్థల పాత్ర, ప్రతిపక్షాల పట్ల వ్యవహారం, కేంద్ర-రాష్ట్ర సంబంధాలు, సామాజిక సామరస్యం, మత ధ్రువీకరణ వంటి అంశాలపై దేశవ్యాప్తంగా చర్చ కొనసాగుతోంది. ప్రజా స్వామ్యంలో విమర్శలు దేశద్రోహం కాదు. అవి వ్యవస్థను మరింత బలోపేతం చేసే ప్రక్రియ. అందుకే నెహ్రూ, మోడీ మధ్య పోలికను కేవలం వ్యక్తుల మధ్య పోటీగా చూడటం సరైంది కాదు. ఇది రెండు దశల భారతదేశాల మధ్య పోలిక. ఒకరు దేశానికి పునాదులు వేశారు. మరొకరు ఆ పునాదులపై అభివృద్ధి వేగాన్ని పెంచే ప్రయత్నం చేశారు..
నాయకత్వాల మధ్య పోలిక: చరిత్ర ఏం చెబుతుంది?
చివరికి ఎవరు ఎక్కువ ఎన్నికలు గెలిచారు? ఎవరు ఎక్కువ కాలం అధికారంలో ఉన్నారు? అనే విషయాలను మాత్రమే చరిత్ర గుర్తుంచుకోదు. అది మరింత లోతైన ప్రశ్నలను అడుగుతుంది. ఎవరు ప్రజాస్వామ్యాన్ని బలోపేతం చేశారు? ఎవరు సంస్థలను నిర్మించారు లేదా పరిరక్షించారు? ఎవరు రాజ్యాంగ విలువలను కాపాడారు? ఎవరు భవిష్యత్ తరాలకు మరింత బలమైన భారతదేశాన్ని అందించారు? ఈ ప్రశ్నలకే చరిత్ర సమాధానం వెతుకుతుంది. నాయకులు మారిపోతారు. ప్రభుత్వాలు మారిపోతాయి. కానీ రాజ్యాంగం, ప్రజాస్వామ్యం, స్వతంత్ర సంస్థలు, ప్రజల హక్కులు మాత్రమే ఒక దేశాన్ని శాశ్వతంగా నిలబెడతాయి. అందుకే భారతదేశ భవిష్యత్తు అభివృద్ధి, రాజ్యాంగ విలువల మధ్య సమతుల్యతను ఎంత సమర్థంగా కాపాడగలదన్నదానిపైనే ఆధారపడి ఉంది. చివరికి చరిత్ర తీర్పు ఒక నాయకుడి అధికార కాలంపైన కాదు.. ఆయన దేశానికి వదిలి వెళ్లిన వారసత్వంపైనే ఆధారపడి ఉంటుంది.
తెలంగాణ ప్రదేశ్ మహిళా కాంగ్రెస్,
నెహ్రూ దేశానికి బలమైన సంస్థాగత పునాదులు వేసి, ప్రజాస్వామ్య విలువలను నిలబెట్టారు. ఆయన వారసత్వం కేవలం విజయాలకే పరిమితం కాకుండా, భవిష్యత్ భారత్ దిశానిర్దేశానికి మార్గదర్శకంగా నిలిచింది. చరిత్ర తీర్పు వారి నిజమైన కృషిని బట్టి ఉంటుంది.


