|

Andhravilas.net – Breaking News & Movie Buzz Since 2002

సోదరుడితో సినిమా తీస్తుంటే…నాన్న గుర్తుకొచ్చారు! నిహారిక ఎమోషనల్ కామెంట్స్!

Published: 28-03-2026, 8:05 AM
సోదరుడితో సినిమా తీస్తుంటే...నాన్న గుర్తుకొచ్చారు! నిహారిక ఎమోషనల్ కామెంట్స్!
  • నిర్మాతగా నిహారిక సక్సెస్, ‘కమిటీ కుర్రోళ్లు’ చిత్రానికి అవార్డులు
  • ఏప్రిల్ 3న విడుదల కానున్న నిహారిక నిర్మించిన ‘రాకాస’
  • వరుణ్ తేజ్ హీరోగా నిహారిక నిర్మాణంలో ‘బరి’ చిత్రం ప్రారంభం
  • వచ్చే ఏడాది సంక్రాంతికి ‘బరి’ విడుదల కానుందని ప్రకటన

నిహారిక కొణిదెల నిర్మాతగా మారి తన సోదరుడు వరుణ్ తేజ్‌తో కలిసి ‘బరి’ అనే సినిమాను ప్రారంభించారు. ఈ చిత్ర ప్రారంభోత్సవానికి పవన్ కళ్యాణ్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఫ్యామిలీతో సినిమా తీయడం గురించి నిహారిక ఎమోషనల్ కామెంట్స్ చేశారు.

నిర్మాతగా నిహారిక సక్సెస్

Niharika Konidela: ఆ ఫీలింగ్ ఎలా ఉంటుందో నాకిప్పుడు తెలుస్తుంది.. అని అనగానే, ఒంటరిగా ఉండటంపై నిహారిక ఈ కామెంట్స్ చేసిందని అనుకుంటారేమో. అలా ఏం లేదు. ప్రస్తుతం నిహారిక నిర్మాతగా మారి సక్సెస్ ఫుల్ చిత్రాలను నిర్మిస్తున్న విషయం తెలిసిందే. ‘కమిటీ కుర్రోళ్లు’ చిత్రంతో సక్సెస్, అవార్డులను అందుకున్న నిహారిక (Niharika Konidela).. తన బ్యానర్‌లో రెండో ప్రాజెక్ట్‌గా ‘రాకాస’ చేస్తోంది. ఈ మూవీ ఏప్రిల్ 3న రిలీజ్ కాబోతోంది. ఈ సినిమా ఇంకా విడుదల కాకుండానే, మూడో ప్రాజెక్ట్‌కు సంబంధించిన పూజా కార్యక్రమాలను కూడా పూర్తి చేసింది. తన అన్న మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ హీరోగా పింక్ ఎలిఫెంట్ పిక్చర్స్ (Pink Elephant Pictures) బ్యానర్ పై నిహారిక కొణిదెల నిర్మిస్తున్న చిత్రం ‘బరి’ (Bhari). ‘కమిటీ కుర్రోళ్లు’ దర్శకుడు యదు వంశీ దర్శకత్వంలో రూపుదిద్దుకోనున్న ఈ చిత్ర పూజా కార్యక్రమాలను శనివారం గ్రాండ్‌గా నిర్వహించారు. ఈ సినిమా ప్రారంభోత్సవానికి ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ (Deputy CM Pawan Kalyan) ముఖ్య అతిథిగా హాజరయ్యారు.

‘రాకాస’ విడుదలకి సిద్ధం

ముహూర్తపు సన్నివేశానికి పవన్ కళ్యాణ్ క్లాప్ కొట్టగా.. మైత్రీ మూవీస్ నిర్మాత నవీన్ యెర్నేని కెమెరా స్విచ్ ఆన్ చేశారు. దర్శకుడు మేర్లపాక గాంధీ, నిర్మాత రాజీవ్ రెడ్డి స్క్రిప్ట్ అందజేశారు. పూజా కార్యక్రమాల అనంతరం యూనిట్ చిత్రానికి సంబంధించిన విశేషాల్ని పంచుకున్నారు. ఈ కార్యక్రమంలో నిహారిక కొణిదెల మాట్లాడుతూ.. ‘‘మా నాన్న అప్పట్లో ఫ్యామిలీ మెంబర్స్‌తో సినిమాలు తీశారు. వాళ్ల అన్నయ్య, తమ్ముడితో సినిమాలు తీశారు. అలా ఫ్యామిలీ మెంబర్లతో చిత్రాలు నిర్మిస్తుంటే ఆ ఫీలింగ్ ఎలా ఉంటుందో నాకిప్పుడు తెలుస్తుంది. మా అన్న వరుణ్‌తో మూవీని ఈ రోజు ప్రారంభించడం నాకు చాలా చాలా స్పెషల్‌గా అనిపిస్తుంది. మా మూవీ ప్రారంభోత్సవానికి మా బాబాయ్ పవన్ కళ్యాణ్ రావడం ఆనందంగా ఉంది. ఈ సినిమాని వచ్చే ఏడాది సంక్రాంతికి రిలీజ్ చేయబోతున్నాం. విలేజ్ డ్రామాగా, స్పోర్ట్స్ బ్యాక్ డ్రాప్‌లో వంశీ ఈ సారి మరో అద్భుతమైన స్టోరీని ప్రేక్షకులకు చెప్పబోతున్నారు. ‘కమిటీ కుర్రోళ్లు’ టీంతో మళ్లీ ఇలా సినిమా చేస్తుండటం ఆనందంగా ఉంది’’ అని తెలిపారు.

వరుణ్ తేజ్‌తో ‘బరి’ మూవీ ప్రారంభం

దర్శకుడు యదు వంశీ (Director Yadu Vamsi) మాట్లాడుతూ.. ‘కమిటీ కుర్రోళ్లు’ తర్వాత ఓ కథను పట్టుకుని ఏడాది పాటు తిరిగా. అది వర్కౌట్ కాలేదు. మధ్యలో నాకు వాలీబాల్ బ్యాక్ డ్రాప్‌తో ఓ ఐడియా వచ్చింది. కొంత కథ రెడీ చేసుకున్నాను. వాలీబాల్ అని అనుకోవడంతోనే నాకు వరుణ్ తేజ్ మైండ్‌లోకి వచ్చారు. అలా కొంత కథ అయ్యాక మళ్లీ తిరిగి నిహారిక వద్దకే వెళ్లాను. ఆమెకు ఈ కథ చెప్పి, వరుణ్ తేజ్ కావాలని అడిగాను. పూర్తి కథ సిద్ధం చేసిన తరువాత వరుణ్ అన్న దగ్గరకు వెళ్దామని ఆమె అన్నారు. అలా మూడు నెలల్లో పూర్తి కథను రెడీ చేసి వినిపించాం. ఆయనకి కథ చాలా నచ్చింది. ప్రీ ప్రొడక్షన్ పనులు పూర్తి చేశాం. షూటింగ్ కూడా త్వరగా ఫినిష్ చేసి వచ్చే సంక్రాంతికి మా ‘బరి’ మూవీని బరిలోకి దించాలని ప్లాన్ చేస్తున్నామని చెప్పుకొచ్చారు.

నిహారిక తన తండ్రి తరహాలోనే కుటుంబ సభ్యులతో సినిమా నిర్మిస్తుండటం విశేషం. ‘బరి’ మూవీతో వరుణ్ తేజ్ కి ఎలాంటి విజయాన్ని అందిస్తుందో చూడాలి. ఈ సినిమా వచ్చే ఏడాది సంక్రాంతికి విడుదల కానుంది.

Related News

Plugin developed by ProSEOBlogger
Plugin developed by ProSEOBlogger. Get free Ypl themes.