
పహల్గాం ఉగ్రదాడి కేసులో కీలక పరిణామం చోటుచేసుకుంది. లష్కరే తోయిబా అధినేత హఫీజ్ సయీద్‌పై ఎన్‌ఐఏ కోర్టు నాన్-బెయిలబుల్ వారెంట్ జారీ చేసింది. ఈ కేసులో అనుబంధ ఛార్జ్‌షీట్ దాఖలు చేసిన రెండు రోజుల్లోనే ఈ వారెంట్ జారీ కావడం గమనార్హం.
Key Points
పహల్గాం ఉగ్రదాడి కేసులో హఫీజ్ సయీద్‌పై ఎన్‌ఐఏ కోర్టు నాన్-బెయిలబుల్ వారెంట్ జారీ చేసింది.
జూలై 8న ఎన్‌ఐఏ ప్రత్యేక కోర్టు న్యాయమూర్తి ఈ వారెంట్ జారీ చేశారు.
హఫీజ్ సయీద్‌పై లష్కరే తోయిబా మరియు TRF సంస్థల రూపకర్తగా కేసులు నమోదయ్యాయి.
నిందితుడు అందుబాటులో లేకపోయినా BNSS 2023 సెక్షన్ 356 ప్రకారం విచారణ కొనసాగనుంది.
పహల్గాం ఉగ్రదాడి నేపథ్యం
భారత దేశంలో తీవ్ర విషాదం నింపిన పహెల్గాం ఉగ్రదాడి కేసులో మరో కీలక పరిణామం చోటు చేసుకుంది. ఈ కేసులో పాకిస్తాన్ కేంద్రంగా పనిచేస్తున్న నిషేధిత ఉగ్రవాద సంస్థ ‘లష్కరే తోయిబా’ (LeT) అధినేత హఫీజ్ సయీద్‌కు ఎన్ఐఏ కోర్టు నాన్-బెయిలబుల్ వారెంట్ (ఎన్‌బీడబ్ల్యూ) జారీ చేసింది. పహల్గామ్ ఉగ్రదాడి కేసులో హఫీజ్ సయీద్‌పై ఎన్‌ఐఏ జూలై 6న అనుబంధ ఛార్జ్‌షీట్ దాఖలు చేయగా.. ఆ తర్వాత రెండు రోజులకు, అంటే జూలై 8న ఎన్‌ఐఏ ప్రత్యేక కోర్టు న్యాయమూర్తి ఈ వారెంట్ జారీ చేసినట్లు అధికారులు వెల్లడించారు. అయితే ఈ విషయం ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. గత ఏడాది ఏప్రిల్ 22న దక్షిణ కాశ్మీర్‌లోని పర్యాటక ప్రాంతమైన పహల్గాంలో ఉగ్రవాదులు ఘాతుకానికి పాల్పడ్డారు. ఈ కాల్పుల్లో పర్యాటకులతో సహా మొత్తం 26 మంది ప్రాణాలు కోల్పోయారు. దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన ఈ ఉగ్రదాడి వెనుక లష్కరే తోయిబా కుట్ర ఉన్నట్లు ఎన్‌ఐఏ గుర్తించి విచారణను ముమ్మరం చేసింది.
హఫీజ్ సయీద్‌పై ఛార్జ్‌షీట్ వివరాలు
భారత్, అమెరికా దేశాలచే అంతర్జాతీయ ఉగ్రవాదిగా ప్రకటించబడిన 76 ఏళ్ల హఫీజ్ సయీద్‌పై జమ్మూలోని ప్రత్యేక ఎన్‌ఐఏ కోర్టులో ఈ అనుబంధ ఛార్జ్‌షీట్ దాఖలైంది. లష్కరే తోయిబా (LeT) అధినేతగా, అలాగే దానికి ప్రాక్సీగా వ్యవహరిస్తున్న ‘ది రెసిస్టెన్స్ ఫ్రంట్’ (TRF) రూపకర్తగా సయీద్‌పై కేసులు నమోదయ్యాయి. సయీద్ పై ఉపా చట్టంతో పాటు BNS 2023 చట్టంలోని పలు సెక్షన్ల కింద కఠినమైన సెక్షన్లను ఛార్జ్‌షీట్‌లో చేర్చారు. నింధితుడిపై మోపిన అభియోగాలకు తగిన ఆధారాలు ఉన్నాయని భావించిన న్యాయస్థానం ఈ కేసును విచారణకు స్వీకరించి నిందితుడిపై నాన్ బెయిలబుల్ వారెంట్ ను జారీ చేసింది.
నాన్-బెయిలబుల్ వారెంట్ జారీ
పాకిస్థాన్‌లోని పంజాబ్ ప్రావిన్స్ సర్గోధా నివాసి అయిన హఫీజ్ సయీద్ పహల్గామ్ ఉగ్రదాడి కేసులో ప్రధాన నిందితుడని, అతను కావాలనే అరెస్టు కాకుండా తప్పించుకు తిరుగుతున్నాడని ఎన్‌ఐఏ కోర్టుకు తెలిపింది. ఈ కేసులో నిష్పక్షపాతంగా, సమగ్రంగా, సమర్థవంతంగా దర్యాప్తు ముగించాలంటే నిందితుడైన హఫీజ్ సయీద్‌ను అరెస్ట్ చేయడం, కస్టడీలోకి తీసుకుని విచారించడం అత్యవసరం. అందువల్ల అతనిపై నాన్-బెయిలబుల్ వారెంట్ జారీ చేస్తున్నామని కోర్టు స్పష్టం చేసింది. అయితే సయీద్ ఇండియాకు రాకపోయినప్పటికీ విచారణ కొనసాగనుంది. 2024లో అమల్లోకి వచ్చిన కొత్త క్రిమినల్ చట్టం ‘భారతీయ నాగరిక్ సురక్ష సంహిత (BNSS) – 2023’లోని సెక్షన్ 356 ప్రకారం నిందితుడు అందుబాటులో లేకపోయినా అతనిపై విచారణ జరిపి శిక్ష వేయవచ్చు. దీన్నే ‘ట్రయల్ ఇన్ అబ్సెన్షియా’ అంటారు.
పహల్గాం ఉగ్రదాడి కేసులో హఫీజ్ సయీద్‌పై నాన్-బెయిలబుల్ వారెంట్ జారీ కావడం భారత న్యాయవ్యవస్థ పటిష్ఠతకు నిదర్శనం. నిందితుడు ఎక్కడున్నా విచారణ కొనసాగించే చట్టం అమల్లో ఉండటం ఉగ్రవాదానికి వ్యతిరేకంగా బలమైన సంకేతం.


