
📌 Key Points
- పవన్ కళ్యాణ్ గతంలో రాజకీయ బాధ్యతలు చేపట్టిన తర్వాత ‘హరిహర వీరమల్లు’ సినిమా చేశారు.
- సుజీత్ దర్శకత్వంలో ‘ఓజీ’ సినిమాతో పవన్ ఈజ్ బ్యాక్ అని నిరూపించుకున్నారు.
- హరీష్ శంకర్‌తో కలిసి ‘ఉస్తాద్ భగత్ సింగ్’ సినిమా మార్చి 26న విడుదల కానుంది.
- ముందుగా ఈ సినిమాకి ‘భవదీయుడు భగత్ సింగ్’ అనే టైటిల్ అనుకున్నారు, తర్వాత మార్చారు.
పవన్ కళ్యాణ్ ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రిగా బాధ్యతలు నిర్వర్తిస్తూనే, సినిమాల్లోనూ రాణిస్తున్నారు. ఆయన హరీష్ శంకర్‌తో కలిసి చేస్తున్న ‘ఉస్తాద్ భగత్ సింగ్’ సినిమా టైటిల్ మార్పుకు సంబంధించిన ఆసక్తికర విషయాలు ఇప్పుడు చూద్దాం.
పవన్ కళ్యాణ్ సినీ ప్రయాణం
Pawan Kalyan:టాలీవుడ్ సినీ ఇండస్ట్రీలో పవర్ స్టార్ అనే బిరుదును సొంతం చేసుకొని.. వరుస సినిమాలు చేస్తూ ప్రేక్షకులను ఆకట్టుకుంటున్నారు పవన్ కళ్యాణ్ (Pawan Kalyan). ఒకవైపు ప్రేక్షకులను ఎంటర్టైన్ చేయడానికి సినిమాలు చేస్తూనే.. మరొకవైపు రాష్ట్ర ప్రజలను అభివృద్ధి పథం వైపు అడుగులు వేయిస్తూ.. ఆంధ్ర ప్రదేశ్ ఉప ముఖ్యమంత్రిగా మంచి పేరు సొంతం చేసుకుంటున్నారు. అలాంటి ఈయన గతంలో రాజకీయ బాధ్యతలు చేపట్టిన తర్వాత చేసిన తొలి చిత్రం ‘హరిహర వీరమల్లు’. ఈ సినిమాతో పరవాలేదనిపించుకున్న పవన్ కళ్యాణ్.. ఆ తర్వాత సుజీత్ దర్శకత్వంలో ‘ఓజీ’ సినిమా చేసి పవన్ ఈజ్ బ్యాక్ అని నిరూపించాడు. ఇక ఇప్పుడు మళ్లీ 15 ఏళ్ల తర్వాత తన కెరీర్ లో బ్లాక్ బస్టర్ హిట్ ను అందించిన హరీష్ శంకర్ (Harish Shankar) తో మరోసారి సినిమా ప్రకటించారు.
ఇదివరకే వీరిద్దరి కాంబినేషన్లో ‘గబ్బర్ సింగ్’ సినిమా వచ్చి భారీ విజయాన్ని సొంతం చేసుకుంది. మళ్లీ ఇన్నేళ్ల తర్వాత ‘ఉస్తాద్ భగత్ సింగ్’ అంటూ మార్చి 26వ తేదీన ప్రేక్షకుల ముందుకు రాబోతున్నారు. ఈ క్రమంలోనే ఇప్పటికే ఈ సినిమా ప్రమోషన్స్ మొదలుపెట్టిన డైరెక్టర్ హరీష్ శంకర్.. ఈ సినిమాకి మొదట ‘భవదీయుడు భగత్ సింగ్’ అనే టైటిల్ ని పెట్టామని..కాకపోతే దానిని మార్చేసి ఉస్తాద్ భగత్ సింగ్ గా మార్చామని చెప్పుకొచ్చారు.
‘ఉస్తాద్ భగత్ సింగ్’ టైటిల్ మార్పు
ఇక అందులో భాగంగానే హరీష్ శంకర్ మాట్లాడుతూ.. “పవన్ కళ్యాణ్ తో గబ్బర్ సింగ్ అనే మాస్ సినిమా చేశాను. కానీ ఎక్కడో అర్బన్ తాలూకు ఔట్ ఫిట్స్ , ఆయన వేసుకునే హుడీస్ అన్నింటిని నేను గబ్బర్ సింగ్ లో మిస్ అయ్యాననే ఫీలింగ్ కలిగింది. అక్కడక్కడ పాటల్లో ఆ లుక్ చూపించినా.. సినిమా మొత్తంలో దాదాపు 80% పోలీస్ గెటప్ లోనే పవన్ కళ్యాణ్ కనిపిస్తారు. ఈసారి పోలీస్ డ్రెస్ కాకుండా ఆ క్యారెక్టర్ కు మించిన ఎనర్జీని ఇవ్వాలని ప్లాన్ చేస్తూ.. కాలేజ్ బ్యాక్ డ్రాప్ లో కథ రాసుకున్నాము. అలా వర్క్ చేస్తున్న సమయంలో సోషల్ మీడియాలో అంతా గబ్బర్ సింగ్ అంటున్నారు.. దీనికి ‘భవదీయుడు భగత్ సింగ్’ అనే టైటిల్ పెడితే జెన్ జీ మాత్రం నన్ను భవదీయుడు అంటే ఏంటి? అని ప్రశ్నించారు. అందుకే టైటిల్ అర్థం కాకపోతే ఎలా అనుకొని ఏం చెప్పాలో అర్థం కాక ఉస్తాద్ భగత్ సింగ్ అని టైటిల్ పెట్టాను” అంటూ ఆయన తెలిపారు.
హరీష్ శంకర్ మాటల్లో సినిమా విశేషాలు
ఇకపోతే ఉస్తాద్ అని పేరు పెట్టడానికి గల కారణాన్ని కూడా ఆయన వెల్లడించారు. “ఖుషీ సమయంలో పవన్ కళ్యాణ్ ఎక్కువగా తెలంగాణ డైలాగులు చెప్తున్నాడు అని ఓల్డ్ సిటీ వాళ్ళు ఆయనను ఉస్తాద్ అని పిలిచేవారు. ఆ రిఫరెన్స్ తోనే టైటిల్ లో ఉస్తాద్ భగత్ సింగ్ అని పెట్టాను” అంటూ హరీష్ శంకర్ క్లారిటీ ఇచ్చారు. మొత్తానికైతే ఖుషీ సినిమా ప్రభావం కూడా ఈ సినిమా టైటిల్ పై పడిందని అభిమానులు కామెంట్లు చేస్తున్నారు.
హరీష్ శంకర్ వివరణ ప్రకారం, టైటిల్ మార్పు వెనుక బలమైన కారణం ఉంది. ‘ఉస్తాద్ భగత్ సింగ్’ చిత్రం పవన్ కళ్యాణ్ కెరీర్‌లో మరో మైలురాయిగా నిలుస్తుందని ఆశిద్దాం.


