
📌 Key Points
- రామ్ చరణ్, జాన్వీ కపూర్ల పెద్ది భారీ అంచనాల మధ్య రిలీజ్.
- క్లైమాక్స్ లో చరణ్ నటనకు ప్రేక్షకులు కన్నీళ్లు పెట్టుకున్నారు.
- పెద్ది కమర్షియల్ స్పోర్ట్స్ డ్రామాగా అద్భుత విజయం సాధించింది.
- జగపతి బాబు, శివరాజ్ కుమార్ల పాత్రలు సినిమాకు మరింత బలం.
టాలీవుడ్ బాక్సాఫీస్ వద్ద ‘పెద్ది’ ప్రభంజనం మొదలైంది! రామ్ చరణ్, జాన్వీ కపూర్ నటించిన ఈ సినిమా ప్రీమియర్స్ నుంచే బ్లాక్ బస్టర్ టాక్ తో దూసుకుపోతోంది. ముఖ్యంగా చరణ్ నటన, ఆ క్లైమాక్స్ థియేటర్లలో ప్రేక్షకులను భావోద్వేగానికి గురిచేస్తోంది. ఈ సంచలన సినిమా విశేషాలు మీకోసం!
రామ్ చరణ్ నటన: అద్భుతమైన ఎమోషనల్ జర్నీ!
Peddi Review : రామ్ చరణ్, జాన్వీ కపూర్ జంటగా తెరకెక్కిన సినిమా ‘పెద్ది’. మైత్రి మూవీ మేకర్స్ సమర్పణలో వృద్ధి సినిమాస్ బ్యానర్ పై వెంకట సతీష్ కిలారు నిర్మాణంలో బుచ్చిబాబు సాన దర్శకత్వంలో ఈ సినిమా భారీ బడ్జెట్ తో తెరకెక్కింది. జగపతి బాబు, శివరాజ్ కుమార్, దివ్యేందు శర్మ.. పలువురు వివిధ పరిశ్రమల స్టార్స్ ఈ సినిమాలో కీలక పాత్రల్లో నటించారు. పెద్ది సినిమా ప్రపంచవ్యాప్తంగా జూన్ 4న రిలీజ్ అవుతుండగా ముందు రోజే రాత్రి ప్రీమియర్స్ వేశారు.
పెద్ది(రామ్ చరణ్), మరికొంతమంది జనాలు విజయనగరం పక్కన ఓ కొండ కింద ఉంటారు. ఆ ఊరి వాళ్లంతా కొండలు, అడవులు దాటి విజయనగరం వచ్చి ఓ బెల్లం ఫ్యాక్టరీలో పని చేసుకుంటారు. వీళ్లకు, వీళ్ళ ఊరికి అసలు గవర్నమెంట్ గుర్తింపు ఉండదు. అసలు వీళ్ళు జనాభా లెక్కల్లోనే ఉండరు. ఆ ఊరి మీద నుంచి ఒక ట్రైన్ రూట్ ఉంటుంది. ఆ ఊరి కోసం అక్కడ ట్రైన్ ఆగాలని అప్పలసూరి(జగపతిబాబు)ప్రయత్నాలు చేస్తూనే ఉంటాడు. పెద్ది మంచి క్రికెట్ ప్లేయర్ కావడంతో అతన్ని వేలంపాట పాడుకొని రాంబుజ్జి(దివ్యేందు శర్మ) మరికొంతమంది క్రికెట్ పందాలు వేసుకుంటారు.
అచ్చాయమ్మా(జాన్వికపూర్)ని చూడగానే ఇష్టపడతాడు పెద్ది. ఆమెని అందరిముందు బట్టలు ఊడదీసి పరువుపోగొట్టాలని ప్లాన్ చేయడంతో రాంబుజ్జి, అతని మనుషులతో గొడవపెట్టుకుంటాడు పెద్ది. దీంతో వాళ్లంతా కలిసి క్రికెట్ లో పెద్ది పరువు తీస్తారు. పెద్దిలోని ఆట స్ఫూర్తిని గమనించిన గౌరినాయుడు కుస్తీ నేర్చుకొమ్మని పిలుస్తాడు. మరి పెద్ది కుస్తీ నేర్చుకుంటాడా? పెద్ది ఊరికి, అక్కడ మనుషులకు గుర్తింపు వస్తుందా? ఆ ఊరికి రైల్వే స్టేషన్ వస్తుందా? దానికోసం పెద్ది ఏం చేసాడు? అచ్చాయమ్మా – పెద్ది ప్రేమకథ ఏమైంది? ఇవన్నీ తెలియాలంటే తెరపై చూడాల్సిందే..
పెద్ది సినిమాపై ముందు నుంచి భారీ అంచనాలు ఉన్నాయి. రిలీజ్ చేసిన గ్లింప్స్ తో హీరో ఎలివేషన్స్, కమర్షియల్, స్పోర్ట్స్ డ్రామా అనుకున్నారు. అయితే ఇది కమర్షియల్ సినిమా అనేకన్నా ఒక ఎమోషనల్ స్ఫూర్తినిచ్చే స్పోర్ట్స్ డ్రామా సినిమా అని చెప్పొచ్చు. ఈ కథ అంతా ఓ ఒలంపిక్ అసోసియేషన్ ఆఫీసర్ కి పెద్ది ఊరు అతను చెప్పడంతో ఫ్లాష్ బ్యాక్ లో సాగుతుంది.
ఫస్ట్ హాఫ్ అంతా పెద్ది, అతని ఊరు, అతని మనుషుల పరిచయం, పెద్ది క్రికెట్ ఆటలు, అచ్చాయమ్మా కథ, రాంబుజ్జి గొడవలతో, అప్పలసూరి ట్రైన్ కోసం చేసే ప్రయత్నాలతో సాగుతుంది. ఇంటర్వెల్ కి కుస్తీ నేర్చుకోడానికి సిద్దమయ్యాడు అని ఓ పవర్ ఫుల్ సీన్ తో హైప్ ఇస్తారు. ఇక సెకండ్ హాఫ్ పెద్ది కుస్తీ ఎలా ఆడాడు, తన ఊరికి స్టేషన్ ఎలా ఇచ్చాడు అని ఎమోషనల్ గా సాగుతుంది.
క్లైమాక్స్: ఊహించని ట్విస్ట్.. అభిమానుల కన్నీళ్లు!
క్రికెట్, కుస్తీ, రన్నింగ్.. అన్ని గేమ్స్ కూడా హీరో గెలుస్తాడా లేదా అనే సస్పెన్స్ అయితే బాగా మెయింటైన్ చేసారు. హీరోకి బోలెడన్ని ఎలివేషన్స్ ఉన్నాయి. ఫ్యాన్స్ కి ఈ విషయంలో పండగే. ఇక సెకండ్ హాఫ్ లో ఎమోషనల్ సీన్స్ అన్ని కూడా చాలా బాగా పండాయి. ప్రీ క్లైమాక్స్ లో ఓ సీన్, ఆ తర్వాత క్లైమాక్స్ వరకు అలాంటి సీన్స్ స్టార్ హీరో చేయడానికి ధైర్యం కావాలి. చరణ్ ఆ సీన్స్ చేయడమే కాదు చేసి ఏడిపించాడు కూడా. కచ్చితంగా మాములు ప్రేక్షకులు సెకండ్ హాఫ్ లో ఓ రెండు సీన్స్ కి కన్నీళ్లు పెడతారు. యాక్షన్ సీక్వెన్స్, కుస్తీ పోటీలు చాలా బాగా డిజైన్ చేసారు.
జాన్వీ పోర్షన్స్ కొంత చిరాకు తెపిస్తాయి. ఆమె పోర్షన్ కొంత కట్ చేసినా పర్వాలేదు అనిపిస్తుంది. ఇక ఐటెం సాంగ్ అక్కర్లేకపోయినా పెట్టారు. ఐటెం సాంగ్ తీసేస్తే బెటర్ అనిపిస్తుంది. జాన్వీ – చరణ్ లవ్ ట్రాక్ సరిగ్గా రాసుకోలేదు. సింపుల్ గా తేల్చేసారు. సెకండ్ హాఫ్ లో కుస్తీ ఎపిసోడ్స్ లో కొంత ల్యాగ్ ఉంటుంది. జగపతి బాబు పాత్ర ఇంకాసేపు ఉంటే బాగుండు అనిపిస్తుంది.
రామ్ చరణ్ మరోసారి తన పర్ఫార్మెన్స్ తో అదరగొట్టేసాడు. మూడు ఆటలకు కావలసినట్టు తన బాడీని మార్చుకోవడానికి చాలా కష్టపడ్డాడు. యాక్షన్ సీక్వెన్స్, డ్యాన్స్ లతోనే మెప్పించడమే కాదు ఎమోషనల్ సీన్స్ తో ఏడిపించేసాడు చరణ్. మరోసారి తండ్రిని మించిన తనయుడు అనిపించుకున్నాడు చరణ్. అసలు ఇలాంటి కథ, ఇలాంటి క్లైమాక్స్ ఓ తెలుగు స్టార్ హీరో చేయడం అంటే కష్టమే కానీ చరణ్ ఒప్పుకొని చాలా ధైర్యం చేసాడు.
జాన్వీ కపూర్ ఇందులో కూడా అందాల ఆరబోతకు మాత్రమే. ఒకటి రెండు ఎమోషనల్ సీన్స్ చేసినా అవి అంతగా పండలేదు. దివ్యేందు శర్మ నెగిటివ్స్ షేడ్స్ లో బాగా మెప్పించాడు. శివరాజ్ కుమార్ కుస్తీ కోచ్ గా చాలా బాగా నటించారు. జగపతి బాబు అయితే అప్పలసూరి పాత్రలో అదరగొట్టేసాడు. బట్టలు తీసేసి బురదలో పడేసే ఓ సీన్ లో అయితే జగపతి బాబు జీవించేసాడు. ఉపేంద్ర లిమియే కూడా చాలా బాగా నటించారు.
శృతిహాసన్ ఐటెం సాంగ్ లో మెరిపించింది. చరణ్ తల్లి పాత్రలో విజి చంద్రశేఖర్ అక్కడక్కడా కనిపించి పర్వాలేదనిపించింది. బొమన్ ఇరాని, సత్య, చమ్మక్ చంద్ర, తారక్ పొన్నప్ప, అర్జున్ అంబటి, శ్రీకాంత్ అయ్యంగార్, జాన్ విజయ్, రవి కిషన్, రాజత్వ దుత్త, ఆడుకాలం నరేన్, మహేష్.. మిగిలిన నటీనటులు వారి పాత్రల్లో బాగానే నటించారు.
పెద్ది: కమర్షియల్ హంగులతో స్పోర్ట్స్ డ్రామా!
ఈ సినిమా సాంకేతికంగా మాత్రం హై స్టాండర్డ్స్ మైంటైన్ చేసింది. సినిమాటోగ్రఫీ విజువల్స్ చాలా బాగున్నాయి. రత్నవేలు ఈ సినిమాకు తన విజువ్సల్ తో, సినిమాటిక్ షాట్స్ తో ప్రాణం పోసాడు. ఏఆర్ రహమాన్ బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ చాలా బాగా ఇచ్చారు. అసలు ఈ బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ రహమనే ఇచ్చాడా అనే సందేహం రాక మానదు. పాటలు సినిమా కంటే ముందే హిట్ అయిన సంగతి తెలిసిందే. విజువల్ పరంగా కూడా పాటలు చాలా బాగున్నాయి.
ఊరు, సాంగ్స్ లో లొకేషన్స్ చాలా అందంగా, అద్భుతంగా ఉన్నాయి. సెట్స్ కూడా బాగా వేశారు ఆర్ట్ డిపార్ట్మెంట్. ఎడిటింగ్ విషయంలో ఐటెం సాంగ్, అక్కడక్కడా కొంత ల్యాగ్ సీన్స్ కట్ చేయాల్సింది. పెద్ది క్రికెటర్, కుస్తీ రెండు ఆటగాడిగా ఒకేసారి కనిపించే సీన్స్, కొన్ని ఎడిటింగ్ కట్స్ మాత్రం చాలా బాగున్నాయి. ఇక దర్శకుడు తమ ఊరికి గుర్తింపు తీసుకురావాలి అనే పాత కథకు స్పోర్ట్స్ జోడించి దాని కోసం హీరో ఏం చేసాడు అని ఒక స్ఫూర్తిని ఇచ్చేవిధంగా, ఎమోషనల్ గా రాసుకొని కమర్షియల్ అంశాలను జోడించాడు. నిర్మాణ పరంగా మాత్రం సినిమాకు భారీగానే ఖర్చుపెట్టినట్టు తెరపై కనిపిస్తుంది.
మొత్తంగా ‘పెద్ది’ ఊరు, తన మనుషులకు గుర్తింపు కోసం ఒక ఆటగాడిగా ఏం చేసాడు? అందరిలో ఎలా స్ఫూర్తి నింపాడు అని కమర్షియల్ గా ఎమోషనల్ గా తెరకెక్కించారు. ఈ సినిమాకు 3.25 రేటింగ్ ఇవ్వొచ్చు.
గమనిక : ఈ సినిమా రివ్యూ & రేటింగ్ కేవలం విశ్లేషకుడి వ్యక్తిగత అభిప్రాయం మాత్రమే.
‘పెద్ది’ సినిమా బాక్సాఫీస్ వద్ద కొత్త రికార్డులు సృష్టించడం ఖాయం. రామ్ చరణ్ కెరీర్ లో మరో మైలురాయిగా నిలిచే ఈ సినిమాపై మరిన్ని అప్‌డేట్స్ కోసం వేచి చూడండి. తెలుగు సినిమా చరిత్రలో ఇది ఒక గొప్ప అధ్యాయం అవుతుంది!


