
తెలుగు సినిమా ఇండస్ట్రీని పట్టి పీడిస్తున్న పైరసీ సమస్యకు ‘ఐ బొమ్మ’ సైట్ మూసివేతతో తాత్కాలిక ఉపశమనం లభించింది. అయితే ఇది కేవలం ఒక కొమ్మ మాత్రమే. పోలీసులు వందల కొద్దీ ఇతర పైరసీ సైట్‌లపై దృష్టి సారించాల్సిన అవసరం ఉంది. లేదంటే సమస్య మళ్లీ మొదటికే వస్తుంది.
Key Points
తెలుగు సినిమా పైరసీకి 'ఐ బొమ్మ' సైట్ మూసివేత తాత్కాలిక ఉపశమనం మాత్రమే.
పోలీసులు 'ఐ బొమ్మ' ప్రధాన సూత్రధారిని పట్టుకుని సైట్‌ను పూర్తిగా క్లోజ్ చేయించారు.
'ఐ బొమ్మ' లాంటి వందల పైరసీ సైట్లు ఇంకా చురుకుగా ఉన్నాయి, వాటిపై దృష్టి పెట్టాలి.
టికెట్ ధరలు తగ్గించి, నాణ్యమైన కంటెంట్ అందిస్తేనే ప్రేక్షకుడు థియేటర్‌కి వస్తాడు.
ఐ బొమ్మ మూసివేత: తాత్కాలిక ఉపశమనమేనా?
తెలుగు సినిమాని పట్టి పీడిస్తున్న అతి పెద్ద సమస్యల్లో పైరసీ ఒకటి. థియేటర్లలో కొత్త మూవీ ఇలా రిలీజైన వెంటనే అలా పైరసీ సైట్లలోకి వచ్చేంత టెక్నాలజీ పెరిగిపోయింది. దీంతో ప్రతిసారి హీరోలు, నిర్మాతలు, దర్శకులు లబోదిబోమంటూనే ఉన్నారు. చాలా ఏళ్లుగా ఉన్న ఈ సమస్యకు ఇప్పుడు చిన్న ఉపశమనం లభించింది. అదే ‘ఐ బొమ్మ’ సైట్‌ని క్లోజ్ చేయడం. తెలుగు ప్రేక్షకులకు బాగా తెలిసిన ఈ సైట్ ప్రధాన సుత్రధారిని ఈ మధ్యే పట్టుకున్న పోలీసులు.. అతడితోనే దగ్గరుండి మరీ సైట్ పూర్తి క్లోజ్ చేయించారు. ఇక్కడితో సమస్య తీరిపోయిందా అంటే అస్సలు కాదు.
పైరసీ అనేది బలమైన వేళ్లతో భూమిలో గట్టిగా పాతుకుపోయిన మహావృక్షం లాంటిది. దీనిలో ‘ఐ బొమ్మ’ అనేది కేవలం ఓ కొమ్మ మాత్రమే. ఈ సైట్ రన్ చేస్తూ తప్పించుకు తిరుగుతున్న రవిని పోలీసులు పట్టుకోవడం మెచ్చుకోదగ్గ విషయమే. కానీ ఈ ఒక్క సైట్ మూసేసినంత మాత్రాన పైరసీ ఆగుతుందా అంటే చెప్పలేని పరిస్థితి. ఎందుకంటే ఇలాంటివి బయట వందల్లో ఉన్నాయి. దీనిలానే వాటిని కూడా ఒక్కొక్కటిగా క్లోజ్ చేసుకుంటూ రావాలి. దేశంలోని పోలీస్ వ్యవస్థ, ప్రభుత్వం తలుచుకుంటే ఇదేమంత పెద్ద విషయం కాదు. కానీ ‘ఐ బొమ్మ’పై పెట్టినంత దృష్టి మిగతా వాటిపైనా రాబోయే రోజుల్లో ఏ మేరకు పెడతారో చూడాలి?
వందల పైరసీ సైట్లు: పోలీసుల ముందున్న సవాల్
పైరసీ సైట్స్ అనే కాదు గూగుల్ లాంటి వెబ్ సైట్లలో ప్లే స్టోర్స్‌లో దొరకని, వందల సంఖ్యలో ధ్రువీకరించని యాప్స్ APK ఫైల్స్ పేరిట జనాలకు అందుబాటులో ఉన్నాయి. కాస్తోకూస్తో చదువుకున్నోళ్లకు వీటి గురించి తెలుసు. చెప్పాలంటే చదువుకోని వాడు.. తనకు తెలిసిన ఒకటో రెండో సైట్లలో మాత్రమే పైరసీ సినిమాల్ని చూస్తాడు. చదువుకున్చోళ్లు మాత్రం విచ్చలవిడిగా ఇలాంటి వాటిని ఎంకరేజ్ చేస్తున్నారు. ఆయా వెబ్ సైట్లని దగ్గరుండి నడిపించేవాళ్లు మన దేశస్థులు కావొచ్చు, కాకపోవచ్చు. ఒకవేళ మన పోలీసులు ప్రయత్నించినా సరే దొరుకుతారో లేదో కూడా తెలియని పరిస్థితి.
కాబట్టి పైరసీ సమస్యతో పాటు ఇండస్ట్రీలోని మిగతా సమస్యలపై కూడా సినీ పెద్దలు కచ్చితంగా దృష్టి సారించాల్సిన అవసరం ఎంతైనా ఉంది. టికెట్ రేట్లు అందుబాటులోకి తీసుకురావడం, రొటీన్ సినిమాలు కాకుండా కాస్త కంటెంట్ ఉండే సినిమాలని తీసుకురావడం లాంటివి చేస్తే.. రాబోయే రోజుల్లో ప్రేక్షకుడే పైరసీ వద్దనుకుని థియేటర్‌కి వస్తాడు. లేదంటే మాత్రం కథ మళ్లీ మొదటికే వస్తుంది!
పైరసీ నివారణకు సినీ ఇండస్ట్రీ బాధ్యత
కేవలం ‘ఐ బొమ్మ’ మూసివేతతో పైరసీ సమస్య అంతం కాదు. పోలీసులు మిగతా సైట్లపైనా గట్టి చర్యలు తీసుకోవాలి. అదే సమయంలో, సినీ పెద్దలు టికెట్ ధరలు తగ్గించి, కంటెంట్ మెరుగుపరిస్తేనే ప్రేక్షకులు థియేటర్లకు వచ్చి పైరసీని తిరస్కరిస్తారు.


