|

Andhravilas.net – Breaking News & Movie Buzz Since 2002

ప్రత్యూష మరణం: 24 ఏళ్ల తర్వాత సుప్రీంకోర్టు షాకింగ్ తీర్పు! వీడని మిస్టరీ!!

Published: 17-02-2026, 8:05 AM
ప్రత్యూష మరణం: 24 ఏళ్ల తర్వాత సుప్రీంకోర్టు షాకింగ్ తీర్పు! వీడని మిస్టరీ!!
  • 1998లో ‘రాయుడు’ సినిమాతో టాలీవుడ్ ఎంట్రీ ఇచ్చిన ప్రత్యూష.
  • కేవలం 4 ఏళ్లలో 22 సినిమాల్లో నటించిన స్టార్ హీరోయిన్.
  • 2002లో స్నేహితుడితో కలిసి ఆత్మహత్యాయత్నం.. ప్రత్యూష మృతి.
  • 24 ఏళ్ల తర్వాత సుప్రీంకోర్టు తుది తీర్పు.. మిస్టరీ వీడలేదంటున్న అభిమానులు.

టాలీవుడ్ లో విషాదం! 90s కుర్రకారు గుండెల్లో చెరగని ముద్ర వేసిన హీరోయిన్ ప్రత్యూష మరణం మిస్టరీగా మిగిలిపోయింది. 24 ఏళ్ళ తర్వాత సుప్రీంకోర్టు సంచలన తీర్పుతో మరోసారి హాట్ టాపిక్ గా మారింది.

బాలనటిగా ఎంట్రీ.. స్టార్ హీరోయిన్‌గా ఎదుగుదల

సినీ నటి ప్రత్యూష.. 90s కిడ్స్‌కి పరిచయం అక్కర్లేని పేరు. చేసింది కొన్ని సినిమాలే అయినప్పటికీ.. అందం, అభినయంతో పాటు తన సహజమైన నటనతో అప్పటి కుర్రకారుళ్ల మనసుల్లో చిరస్థాయిగా నిలిచిపోయింది. తక్కువ సమయంలోనే ఓ రేంజ్ ఫాలోయింగ్ సొంతం చేసుకున్న ఈ అమ్మడు.. 2002లో ఆత్మహత్య చేసుకుని చనిపోయింది. అప్పట్లో ఈ వార్త దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించింది. కేరీర్ పీక్ స్టేజీలో ఉండగా.. ఇలాంటి దారుణ నిర్ణయానికి కారణమేంటని నటీనటులు, అభిమానులు ఆశ్చర్యపోయారు. అయితే, ప్రత్యూషది ఆత్మహత్య కాదని, అత్యాచారం చేసి, చంపేశారని ఆమె తల్లి పోలీసులను ఆశ్రయించింది. దీంతో అది ఆత్మహత్యా? లేక హత్యా? అనే అనుమానాలు దశాబ్దాల పాటు వెంటాడిన ఈ కేసుకు 24 ఏళ్ల తర్వాత సుప్రీంకోర్టు తుది తీర్పు వెలువరించడంతో మరోసారి ప్రత్యూష మిస్టరీ డెత్ కేసు చర్చనీయాంశమైంది.

1998లో ఇండస్ట్రీ ఎంట్రీ..

తెలంగాణలోని భువనగిరికి చెందిన ప్రత్యూష చిన్న వయసులోనే సినీరంగంలోకి అడుగుపెట్టింది. బాలనటిగా ఇండస్ట్రీకి పరిచయమైన ఆమె, ఓ టీవీ రియాలిటీ షోలో పాల్గొని ‘మిస్ లవ్లీ స్మైల్’ టైటిల్ గెలుచుకోవడం ఆమె కెరీర్‌కు మలుపు తీసుకొచ్చింది. 1998లో మోహన్‌బాబు నటించిన ‘రాయుడు’ సినిమాతో టాలీవుడ్‌లో హీరోయిన్‌గా ఎంట్రీ ఇచ్చి తొలి చిత్రంతోనే మంచి గుర్తింపు పొందింది. అనంతరం తెలుగు, తమిళ భాషల్లో వరుస అవకాశాలు అందుకుంటూ కేవలం నాలుగేళ్లలోనే 22 సినిమాల్లో నటించింది. ‘రాయుడు’, ‘శ్రీరాములయ్య’, ‘స్నేహమంటే ఇదేరా’, ‘కలుసుకోవాలని’ వంటి తెలుగు చిత్రాల్లో తన నటనతో ప్రేక్షకులను మెప్పించింది. స్టార్ హీరోయిన్‌గా ఎదుగుతున్న సమయంలోనే ఆమె మరణవార్త సినీ పరిశ్రమను, అభిమానులను కుదిపేసింది. మరణించే సమయానికి ప్రత్యూష వయసు కేవలం 22 సంవత్సరాలు మాత్రమే.

కేరీర్ పీక్‌లో ఉండగా ఆత్మహత్య

ప్రేమ, ఆత్మహత్యాయత్నం.. విషాదంగా ముగిసిన జీవితం

ప్రత్యూష ఇంటర్మీడియట్ చదువుతుండగా.. తన స్నేహితుడైన సిద్ధార్థ్‌ రెడ్డి అనే యువకుడితో ప్రేమలో పడింది. ఇంటర్‌ పూర్తైన అనంతరం ప్రత్యూష సినిమాల్లోకి రాగా.. సిద్ధార్థరెడ్డి ఇంజినీరింగ్‌లో చేరాడు. అయితే, సిద్దార్థ రెడ్డి ఫ్యామిలీ వారి ప్రేమను అంగీకరించకపోవడంతో ఇద్దరూ ఫిబ్రవరి 23, 2002న సాయంత్రం 7 గంటల ప్రాంతంలో కూల్ డ్రింక్‌లో పురుగుల మందు కలుపుకుని ఆత్మహత్యయత్నానికి పాల్పడ్డారు. ఈ ఘటనలో సిద్దార్థరెడ్డి ప్రాణాలతో బయటపడగా.. ప్రత్యూష చికిత్స పొందుతూ మరుసటి రోజే మరణించింది. చికిత్స అనంతరం మార్చి 9న సిద్ధార్థ రెడ్డి డిశ్చార్జి అయ్యాడు. అయితే, ఇది ప్రేమికుల ఆత్మహత్యాయత్నం కాదని, తన కూతురిని హత్య చేసి అత్యాచారం చేశారని ప్రత్యూష తల్లి సరోజినీదేవి ఆరోపిస్తూ పోలీసులను ఆశ్రయించడం కేసును మరో మలుపు తిప్పింది.

ప్రత్యూష మరణానికి ముందు ఆమె వాంగ్మూలం నమోదు చేయకపోవడం, పోస్ట్‌మార్టమ్‌పై వచ్చిన అనుమానాలు కారణంగా.. రాష్ట్ర ప్రభుత్వం ఈ ఘటనపై దర్యాప్తునకు ఓ వైద్యుల బృందాన్ని నియమించింది. ఈ బృందం కేసును పరిశీలించి ప్రభుత్వానికి ఓ నివేదిక సమర్పించింది. ఆర్గానోఫాస్ఫేట్ విషపదార్థం కారణంగానే ఆమె మరణించిందని.. ఊపిరాడకుండా చేయడం, మరణానికి ముందు ఆమెపై లైంగిక దాడి వంటివి జరగలేదని తేల్చింది. దీని ఆధారంగా దర్యాప్తు జరిపిన సీబీఐ.. సిద్ధార్థరెడ్డిపై 306 (ఆత్మహత్యకు పురికొల్పడం), 309 (ఆత్మహత్యకు యత్నించడం) సెక్షన్ల కింద ఛార్జిషీట్‌ వేసింది. దీంతో 2004లో హైదరాబాద్‌ మెట్రోపాలిటన్‌ సెషన్స్‌ జడ్జి ఐదేళ్ల కఠిన కారాగారశిక్ష, రూ.5 వేల జరిమానా విధిస్తూ తీర్పు వెల్లడించింది.

అయితే, తీర్పును సవాల్‌ చేస్తూ సిద్ధార్థరెడ్డి హైకోర్టును ఆశ్రయించగా.. జైలుశిక్షను రెండేళ్లకు తగ్గిస్తూ, జరిమానాను రూ.50 వేలకు పెంచుతూ 2011 డిసెంబరు 28న కోర్టు తీర్పు వెలువరించింది. దీనిపై సిద్ధార్థరెడ్డి, ప్రత్యూష తల్లి సరోజినీదేవి 2012లో సుప్రీంకోర్టులో వేర్వేరుగా అప్పీళ్లు దాఖలు చేశారు. తన కూతురి మరణం వెనక కుట్ర ఉందని ఆరోపించిన ఆమె.. సుప్రీంకోర్టు వరకు వెళ్లి తన వాదనలు వినిపించారు. సుమారు 24 ఏళ్ళ పాటు ఈ కేసు విచారణ జరిగిన తర్వాత ఫిబ్రవరి 17న సుప్రీం ధర్మాసనం తుది తీర్పు వెల్లడించింది. సిద్దార్థరెడ్డి బెయిల్ పిటిషన్‌ను కొట్టేసింది. అలాగే, హైకోర్టు విధించిన రెండేళ్ల జైలు శిక్షను సమర్ధిస్తూ.. సిద్దార్థరెడ్డిని నాలుగు వారాల్లో లొంగిపోవాలని ఆదేశించింది.

సుప్రీంకోర్టు తీర్పు.. వీడని మిస్టరీ ప్రశ్నలు

ఈ తీర్పుపై ప్రత్యూష తల్లి సరోజిని దేవి మాట్లాడుతూ.. తనకు న్యాయం జరగలేదని ఇంకా ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. సాక్ష్యాధారాలు తారుమారయ్యాయని, పూర్తి నిజాలు వెలుగులోకి రాలేదని ఆమె ఆరోపిస్తున్నారు. ముని స్వామి రిపోర్టును కోర్టులు కన్ఫార్మ్ చేయలేదని, ఆ రిపోర్టు తీసుకొని ఉంటే బాగుండేదన్నారు. త్రిసభ్య కమిటిని ఏర్పాటు చేసి రిపోర్టు తెప్పించారని, ప్రత్యూష డెడ్ బాడీని వాళ్లు చూడలేదని, ఎలా చనిపోయిందో ఆ కమిటీ వాళ్ళకి తెలియదని సంచలన వ్యాఖ్యలు చేసింది.

సరోజినీదేవి తెలిపిన వివరాల ప్రకారం.. ప్రత్యూష ఆత్మహత్యాయత్నానికి పాల్పడిన రోజున కన్నడ సినిమాలో తొలి అవకాశం రావడంతో బెంగళూరుకు వెళ్లేందుకు సిద్ధమవుతోంది. 2002 ఫిబ్రవరి 23 సాయంత్రం ఫేషియల్, వ్యాక్సింగ్ చేయించుకోవడానికి తన కజిన్ శిరితో కలిసి బ్యూటీ పార్లర్‌కు వెళ్లింది. ఆమె అక్కడ ఉండగానే సిద్ధార్థ్ రెడ్డి అక్కడికి వచ్చాడు. ప్రత్యూష ఫేషియల్ పూర్తయ్యే వరకు అతను అక్కడే వేచి ఉన్నాడు. ఆ తర్వాత సిద్ధార్థ్‌తో బయటకు వెళ్లి పదిహేను నిమిషాల్లో తిరిగి వస్తానని శిరిని వేచి ఉండమని చెప్పి వెళ్లింది. కొంతసేపటికి ప్రత్యూష తన తల్లికి ఫోన్ చేసి, “జయం సినిమాలో హీరోయిన్‌గా కన్ఫర్మ్ చేసినట్లు తేజ గారి ఆఫీస్ నుంచి ఫోన్ వచ్చింది. తేజ గారి ఆఫీస్‌కు వెళ్లి వస్తాను” అని తెలిపింది. అదే ఆమె నుంచి తనకు వచ్చిన చివరి ఫోన్ కాల్ అని సరోజినీదేవి చెప్పారు. అయితే, తరువాత తెలిసింది ఏమిటంటే వారు తేజ గారి ఆఫీస్‌కు వెళ్లలేదని, బ్యూటీ పార్లర్‌లో ఉన్న శిరికి ఫోన్ చేసి విషయాన్ని తెలిపిందని, అనంతరం శిరి పలుమార్లు కాల్ చేసినప్పటికీ ప్రత్యూష ఫోన్ ఎత్తలేదని పేర్కొన్నారు. ఆ తర్వాత ఏమి జరిగిందో మిస్టరీగానే మిగిలిపోయిందని సరోజినీదేవి అన్నారు.

ప్రత్యూషకు నిమ్స్‌లో పోస్ట్‌మార్టమ్ నిర్వహించారని ఆమె తల్లి వెల్లడించారు. “సాయంత్రం ఐదు గంటలు దాటిందని ఆ రోజు పోస్ట్‌మార్టమ్ చేయలేదు. మరుసటి రోజు ఉదయం పదకొండు గంటలకు మృతదేహాన్ని అప్పగించారు. గొంతు నొక్కినట్లుగా కమిలిన గుర్తులు కనిపించాయి. ఒక వైపు నాలుగు, మరో వైపు ఒక వేలి ముద్ర ఉన్నట్లు అనిపించింది. బలవంతంగా గొంతు నొక్కి నోరు తెరిపించి విషం పోశారని నాకు అనిపించింది. కానీ ఆసుపత్రి సిబ్బంది మాత్రం ‘చికిత్స సమయంలో వాంతులు చేయించేటప్పుడు వచ్చిన గుర్తులు’ అని చెప్పారు” అని సరోజినీదేవి తెలిపారు. ప్రత్యూషను తమ సంప్రదాయం ప్రకారం దహనం చేశామని, అయితే ఖననం చేసి ఉంటే రీ-పోస్ట్‌మార్టమ్ చేయడానికి అవకాశం ఉండేదని ఇప్పటికీ బాధపడుతున్నానని ఆమె అన్నారు. “మా అమ్మాయి ఎందుకు విషం తీసుకుంది అన్న ప్రశ్నే మొదట నాకు కలిగింది. అత్యాచారం జరిగిందనే అనుమానం అప్పటివరకు నాకు రాలేదు. మా ఊరికి తీసుకెళ్లి దహనం చేసిన తర్వాత టీవీల్లో వార్తలు చూసినప్పుడు మాత్రమే ఆ ఆలోచన వచ్చింది” అని తెలిపారు. అప్పట్లో మీడియా విస్తృతి ఇప్పటిలా లేదని, ఇన్ని టీవీ చానళ్లు ఉండి ఉంటే నిజాలు త్వరగా వెలుగులోకి వచ్చేవని ఆమె అభిప్రాయపడ్డారు.

ప్రత్యూష మరణం వెనుక దాగున్న నిజాలు ఎప్పటికీ మిస్టరీగానే మిగిలిపోతాయా అనే ప్రశ్న అలాగే ఉంది. ఈ కేసుకి సంబంధించిన మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి.

Related News

Plugin developed by ProSEOBlogger
Plugin developed by ProSEOBlogger. Get free Ypl themes.