
📌 Key Points
- ప్రముఖ నిర్మాత మంతెన అర్జున రాజు కన్నుమూత, టాలీవుడ్‌లో విషాదం!
- ఎన్టీఆర్, కృష్ణ, చిరంజీవి వంటి స్టార్ హీరోలతో సంచలనాత్మక చిత్రాలు నిర్మించిన ఘనత ఆయనది.
- `వేటగాడు`, `కొండవీటి సింహం` వంటి ఇండస్ట్రీ హిట్స్ ఆయన ఖాతాలో ఉన్నాయి.
- నేడు జూబ్లీహిల్స్‌లోని మహాప్రస్థానంలో అర్జున రాజు అంత్యక్రియలు.
టాలీవుడ్ దిగ్గజ నిర్మాత మంతెన అర్జున రాజు గారు కన్నుమూశారు. ఆయన ఎన్టీఆర్, కృష్ణ, చిరంజీవి వంటి స్టార్ హీరోలతో సినిమాలు నిర్మించి టాలీవుడ్ లో తనదైన ముద్ర వేశారు. ఆయన మరణం సినీ పరిశ్రమకు తీరని లోటు.
టాలీవుడ్‌లో తీవ్ర విషాదం!
టాలీవుడ్‌లో విషాదం చోటు చేసుకుంది. ప్రముఖ నిర్మాత మంతెన అర్జున రాజు కన్నుమూశారు. ఎన్టీఆర్, కృష్ణ, కృష్ణంరాజు, శోభన్ బాబు, చిరంజీవి, నాగార్జున వంటి వారితో పలు సంచలనాత్మకమైన చిత్రాలను నిర్మించిన ఆయన శుక్రవారం మధ్యాహ్నం హైదరాబాద్‌లో కన్నుమూశారు. ఆయనకు ఇప్పుడు 80ఏళ్లు. వయోభారంతో కూడిన అనారోగ్యం కారణంగా కన్నుమూసినట్టు కుటుంబ సభ్యులు వెల్లడించారు. దీంతో చిత్ర పరిశ్రమలో విషాదఛాయలు అలుముకున్నాయి.
మంతెన అర్జున రాజుకి భార్య సీతాదేవి, కొడుకు రామలింగ రాజు, కూతురు కుమారి ఉన్నారు. ఆయన అంత్యక్రియలు నేడు(శనివారం) జూబ్లీహిల్స్ లోని మహాప్రస్థానంలో నిర్వహించనున్నట్టు కుటుంబసభ్యులు తెలిపారు. అర్జున రాజుది పశ్చిమ గోదావరి జిల్లా కోరుకొల్లు స్వస్థలం. రోజా ఆర్ట్స్ అధినేతల్లో ఒకరైన శివ రామరాజు భాగస్వామ్యంతో రోజా ఆర్ట్స్ ప్రొడక్షన్, రోజా ఎంటర్‌ప్రైజెస్ పతాకాలపై ఎన్టీఆర్‌తో `వేటగాడు`(1979), `కొండవీటి సింహం` వంటి చిత్రాలను నిర్మించారు. ఈ చిత్రాలు బాక్సాఫీసు వద్ద సంచలన విజయాలను సాధించాయి. ఇండస్ట్రీ హిట్స్ గా నిలిచాయి.
అర్జున రాజు సినీ ప్రస్థానం
ఎన్టీఆర్, శ్రీదేవి జంటగా నటించిన `వేటగాడు` చిత్రానికి కె రాఘవేంద్రరావు దర్శకత్వం వహించారు. అర్జున రాజుకిది తొలి చిత్రం. ఫస్ట్ ప్రయత్నంతోనే ఇండస్ట్రీ రికార్డులు క్రియేట్ చేయడంతో ఆయనకు ప్రొడక్షన్‌పై పట్టు పెరిగింది. ఆ తర్వాత 1981లో రాఘవేంద్రరావు దర్శకత్వంలోనే ఎన్టీఆర్, శ్రీదేవి జంటగా `కొంటవీటి సింహం` చిత్రాన్ని నిర్మించారు. ఇది కూడా భారీ విజయాన్ని సొంతం చేసుకుంది. కృష్ణ, కృష్ణంరాజు హీరోలుగా `అడవి సింహాలు`, శోభన్ బాబు హీరోగా `కోడెత్రాడు` వంటి చిత్రాలను నిర్మాణ భాగస్వామిగా నిర్మించారు. విజయాలు అందుకున్నారు.
కుటుంబ సభ్యుల వివరాలు
ఇక మెగాస్టార్ చిరంజీవితో `జేబుదొంగ`, నాగార్జునతో `బావ నచ్చాడు`, కృష్ణంరాజు, శ్రీకాంత్ హీరోలుగా `మా నాన్నకు పెళ్ళి` వంటి చిత్రాలను నిర్మించి సక్సెస్ అయ్యారు. వీరితోపాటు ఎస్వీ కృష్ణారెడ్డి దర్శకత్వంలో `జాబిలి`, అల్లరి నరేష్‌తో `మా అల్లుడు వెరీగుడ్`, `జగపతిబాబుతో చేసిన `జగపతి` వంటి చిత్రాలను నిర్మించారు. ఇవి పెద్దగా ఆడలేదు. దీంతో సినిమాలకు దూరమయ్యారు. తెలుగుతోపాటు హిందీలోనూ `నిషానా, ధర్మేంద్రతో `జానీ దోస్త్`, జితేంద్రతో `ఫర్జ్ ఔర్ కానూన్` వంటి సినిమాలను నిర్మించారు.
మంతెన అర్జున రాజు గారి మరణం టాలీవుడ్‌కు తీరని లోటు. ఆయన కుటుంబానికి మన ప్రగాఢ సానుభూతి తెలియజేద్దాం. మరిన్ని అప్‌డేట్స్ కోసం చూస్తూ ఉండండి.


