|

Andhravilas.net – Breaking News & Movie Buzz Since 2002

Puri Jagannadh: అలా జరిగి ఉంటే బిన్ లాడెన్‌ పదేళ్ల ముందే దొరికేవాడు: పూరి జగన్నాధ్

Published: 30-05-2025, 8:52 AM
Puri Jagannadh: అలా జరిగి ఉంటే బిన్ లాడెన్‌ పదేళ్ల ముందే దొరికేవాడు: పూరి జగన్నాధ్

టాలీవుడ్ దర్శకుడు పూరి జగన్నాధ్ తన తాజా పాడ్‌కాస్ట్‌లో ప్రపంచాన్ని కలవరపరిచిన ఒసామా బిన్ లాడెన్ చివరి దశాబ్దం జీవితం గురించి ఆసక్తికర విషయాలను పంచుకున్నారు. అతని అజ్ఞాత జీవితం, జాగ్రత్తలు, కుటుంబం గురించి పూరి వివరించారు.

Key Points

1

పూరి జగన్నాధ్ పాడ్‌కాస్ట్‌లో ఒసామా బిన్ లాడెన్ జీవితం గురించి ఆసక్తికర విషయాలు

2

బిన్ లాడెన్ పదేళ్ళు అజ్ఞాతంలో గడిపిన విధానం

4

బిన్ లాడెన్ సాధారణ జీవితం, కుటుంబం, భద్రత చర్యలు

పూరి జగన్నాధ్ పాడ్‌కాస్ట్‌లో బిన్ లాడెన్‌ గురించి

టాలీవుడ్ డైరెక్టర్‌ పూరి జగన్నాధ్‌ ఇటీవల రోజుకొక పాడ్‌కాస్ట్‌తో అభిమానులను అలరిస్తున్నారు. పూరి మ్యూజింగ్స్ పేరుతో ఆయన తరచుగా తన అభిప్రాయాన్ని పంచుకుంటూనే ఉన్నారు. ఏదో ఒక సబ్జెక్ట్‌పై తన పరిశోధన జరిపి ఫ్యాన్స్‌కు, సినీ ప్రేక్షకులకు అందిస్తున్నారు. అయితే రోటీన్‌గా కాకుండా ఈ సారి భిన్నమైన అంశాన్ని తీసుకొచ్చారు. ఏకంగా మోస్ట్ వాంటెడ్‌ పేరుతో ఒసామా బిన్ లాడెన్‌ చివరి పదేళ్లు ఎలా బతికాడు? అనే విషయాన్ని పంచుకున్నారు. ఎంతోమంది చావుకు కారణమైన ఒసామా బిన్ లాడెన్‌ చివరికీ భయపడుతూ బతకాల్సి వచ్చిందని అన్నారు.

పూరి మాట్లాడుతూ..’పాకిస్థాన్‌ స్వాట్‌ వ్యాలీలో స్పీడ్‌గా వెళ్తున్న కారును పోలీసులు ఆపారు. ఆ కారులో నీట్‌గా షేవ్‌ చేసుకున్న వ్యక్తి కూర్చున్నాడు. ఆ కారు డ్రైవర్‌తో ఏదో మాట్లాడిన తర్వాత పోలీసులు వారిని వదిలేశారు. కానీ ఆ కారులో ఉన్నంది ఒసామా బిన్‌ లాడెన్‌ అని పోలీసులకు తెలియదు. ఆరోజు గనుక  అతన్ని వదలకుండా ఉంటే..‌ దశాబ్దం ముందే దొరికే పోయేవాడు. అలా తప్పించుకున్న బిన్ లాడెన్ స్వాట్‌ వ్యాలీ, పెషావర్‌, హరిపూర్‌ తర్వాత చివరికీ అబోటాబాద్‌లో సెటిలయ్యాడు. అతను ఉన్న ఇంటి పేరు వజీరిస్థాన్‌ హవేలి. దాదాపు చుట్టూ 12-18 అడుగుల ఎత్తున్న గోడలతో మూడు అంతస్తుల ఇల్లు ఇది. తన ముగ్గురు పెళ్లాలు.. 8మంది పిల్లలు.. ఐదుగురు మనవళ్లతో అక్కడే ఉండేవాడు’ అని పంచుకున్నారు.

బిన్ లాడెన్ అజ్ఞాత జీవితం

ముఖ్యంగా బిన్‌ లాడెన్‌ తన చిన్న పెళ్లాంతోనే ఎక్కువగా ఉండేవాడు. ఆ ఇంటికి టెలిఫోన్‌, ఇంటర్నెట్‌ కనెక్షన్‌ ఉండేది కాదు. చెత్త కూడా ఇంట్లోనే కాల్చేసేవారు. తలుపు తీసేవారు కాదు. ఆ ఇంట్లో ఎవరు ఉంటున్నారో ఆ చుట్టుపక్కల వాళ్లకూ తెలియదు. బిన్‌ లాడెన్‌కు నాలుగు జతల బట్టలు, ఒక జాకెట్‌, రెండు స్వెటర్స్‌ మాత్రమే ఉండేవి. అలా 9ఏళ్లు అజ్ఞాతంలో కాలం వెళ్లదీశాడు. స్పై శాటిలైట్స్‌ నుంచి తప్పించుకోవడం కోసం బయటకు వచ్చినప్పుడల్లా కౌబాయ్‌ టోపీ పెట్టుకుని కాంపౌండ్‌లో తిరిగేవాడు. అతని రైట్‌ హ్యాండ్‌ అబు అహ్మద్‌ అల్‌ కువైటీ.. అతని స్నేహితుడు అబ్రార్‌ మాత్రమే లాడెన్‌తో ఇతరులకు కమ్యూనికేషన్‌. అలాగే ఇంట్లో అవసరాలు వాళ్లే చూసుకునేవారు’ అని పంచుకున్నారు.

లాడెన్‌ తన ఇంట్లోనే  కూరగాయలు పండించుకుంటూ కుందేళ్లు, కోళ్లను పెంచుకుంటూ బతికేవాడు. మనవళ్లతో మొక్కలు నాటించి.. ఎవరిది పొడుగ్గా పెరిగితే వాళ్లకు బహుమతులు ఇస్తానని పోటీలు పెట్టేవాడట. సీక్రెట్‌ శాటిలైట్‌ డిష్‌ పెట్టుకుని టీవీ చూసేవాడట. తన గురించి ఒబామా ఏం మాట్లాడుతున్నాడో అనుక్షణం తెలుసుకునేవాడు. అతడు ఎక్కువగా టామ్‌ అండ్‌ జెర్రీ యానిమేటెడ్‌ సినిమాలు చూసేవాడు. స్వీట్స్‌, చాక్లెట్లు అంటే కూడా అతనికి బాగా ఇష్టం. ఒకసారి తన భార్య డెలివరి అవుతుంటే.. తప్పనిసరి పరిస్థితుల్లో తానే స్వయంగా ఆస్పత్రికి వెళ్లాల్సి వచ్చింది. మారువేషంలో ఉన్న బిన్‌ లాడెన్‌.. డాక్టర్‌తో నా భార్య మూగ, చెవిటిది అని అబద్ధం చెప్పాడు. దాంతో ఆమెను ఒక్క ప్రశ్న కూడా వేయలేదు. ఆ రోజు అమాయకంగా ఆస్పత్రిలో కూర్చొన్న బిన్‌లాడెన్‌ను ఎవరూ గుర్తు పట్టలేకపోయారు’ అని తెలిపారు.

బిన్ లాడెన్ భద్రతా చర్యలు మరియు జీవన విధానం

‘అల్‌ఖైదా ఆపరేషన్స్‌ గురించి అతడు చెబుతుంటే.. కూతుళ్లు కాగితం మీద రాసేవారు. ఆ సమయంలో అల్‌ఖైదా బలహీనపడటంపై ఎక్కువగా బాధపడేవాడట. ఒకసారి అల్‌ఖైదా పేరు కూడా మార్చాలని ఆలోచించాడు. తన పిల్లలు, మనవళ్లు స్కూల్‌కు వెళ్లే అవకాశమే లేదు. దీంతో తానే పాఠాలు చెప్పేవాడు. ఇంటర్నెట్‌ కనెక్షన్‌ లేకుండా కంప్యూటర్‌ ఉండేది. ఏదైనా సమాచారం చేరవేయాలంటే యూఎస్‌బీ డ్రైవ్స్‌ వాడేవాడు. ఏళ్ల తరబడి అదే ఇంట్లో అనుక్షణం భయపడుతూ బతికాడు. రోజంతా ఏం చేయాలో తోచక అతని దగ్గరున్న వీడియో కెమెరాతో కోళ్లు, మొక్కలు, అప్పుడప్పుడు ఇంటిపై నుంచి వెళ్తున్న హెలికాప్టర్‌ దృశ్యాలను రికార్డు చేసేవాడు. ఎందుకంటే పక్కనే పాకిస్థాన్‌ ఆర్మీ కంటోన్మెంట్‌ ఉండేది. ఏ హెలికాప్టర్‌ వచ్చినా భయం వేసేదంట. ఆ తర్వాత సీల్‌ టీమ్‌ ఇంట్లో చొరబడి అతడిని చంపిన తర్వాత అక్కడి కంప్యూటర్‌ నుంచి 4.70 లక్షల ఫైల్స్‌ స్వాధీనం చేసుకున్నారు. అందులో పోర్న్‌ వీడియోలు కూడా దొరికాయి. నాటి అమెరికా అధ్యక్షుడు ఒబామాను ఎలా చంపాలో వేసిన ప్లాన్స్‌ అన్నీ సీల్‌ టీమ్‌కు దొరికాయి. ఎన్నో వేల మంది చావులకు, సెప్టెంబరు 11 దాడులకు కారణమైన బిన్‌లాడెన్ తన‌ చివరి పదేళ్లు కష్టాలు పడుతూ, భయపడుతూ బతికాడు. ఇవి బిన్‌ లాడెన్‌ గురించి తెలియని కొన్ని విషయాలు’ అంటూ పూరి జగన్నాథ్‌ తన మ్యూజింగ్స్‌తో వివరిచారు.

పూరి జగన్నాధ్ వివరణ ప్రకారం, ఒసామా బిన్ లాడెన్ తన అజ్ఞాత జీవితంలో చాలా జాగ్రత్తలు తీసుకున్నాడు. ఈ విషయాలు తెలుసుకోవడం చాలా ఆసక్తికరంగా ఉంది.

Related News

Plugin developed by ProSEOBlogger
Plugin developed by ProSEOBlogger. Get free Ypl themes.