
ఐపీఎల్ ఫైనల్ మ్యాచ్‌కు రాజమౌళి స్పందన వైరల్ అవుతోంది. పంజాబ్ కింగ్స్ కెప్టెన్ శ్రేయస్ అయ్యర్ మరియు ఆర్సీబీ కెప్టెన్ విరాట్ కోహ్లిలపై ఆయన అభిప్రాయం ఆసక్తిని రేకెత్తిస్తోంది. ఎవరు గెలిచినా తనకు హార్ట్ బ్రేక్ అని ఆయన తెలిపారు.
Key Points
ఐపీఎల్ ఫైనల్‌లో పంజాబ్ కింగ్స్, ఆర్సీబీ మధ్య పోటీ
రాజమౌళి ట్వీట్‌లో శ్రేయస్ అయ్యర్, విరాట్ కోహ్లి పై ప్రశంసలు
ఇద్దరిలో ఎవరు గెలిచినా రాజమౌళికి హార్ట్ బ్రేక్ అని ఆయన అభిప్రాయం
శ్రేయస్ అయ్యర్ కెప్టెన్సీపై రాజమౌళి ప్రశంసలు
రాజమౌళి ట్వీట్ వైరల్
ఐపీఎల్‌కు మరో కొత్త విజేత రాబోతున్నారు. ఈసారి ఫైనల్లో ఇప్పటి వరకూ ట్రోఫీ గెలవని పంజాబ్ కింగ్స్, రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు టీమ్స్ తలపడనున్న విషయం తెలిసిందే. మంగళవారం (జూన్ 3) ఈ మెగా ఫైనల్ జరగనుంది. అయితే ఆదివారం (జూన్ 1) జరిగిన రెండో క్వాలిఫయర్ మ్యాచ్ తర్వాత పంజాబ్ కింగ్స్ విజయం, ఫైనల్ పై ప్రముఖ దర్శకుడు ఎస్ఎస్ రాజమౌళి చేసిన ట్వీట్ వైరల్ అవుతోంది.
రాజమౌళి సోమవారం (జూన్ 2) చేసిన ట్వీట్ లో పంజాబ్ ను ఫైనల్ చేర్చిన కెప్టెన్ శ్రేయస్ అయ్యర్ పై ప్రశంసల వర్షం కురిపించాడు. అయితే ఆ టీమ్ ఫైనల్లో తన మరో ఫేవరెట్ అయిన విరాట్ కోహ్లి ఆర్సీబీతో తలపడనుండటంతో ఇద్దరిలో ఎవరు గెలిచినా తనకు హార్ట్ బ్రేక్ తప్పదని జక్కన్న అన్నాడు.
శ్రేయస్ అయ్యర్ పై ప్రశంసలు
“బుమ్రా, బౌల్ట్ యార్కర్లను అయ్యర్ థర్డ్ మ్యాన్ బౌండరీకి తరలించడం ఓ అద్భుతం. ఈ వ్యక్తి ఢిల్లీని ఫైనల్ కు తీసుకెళ్లాడు.. తర్వాత డ్రాప్ చేశారు.. కోల్‌కతాకు ట్రోఫీ అందించాడు.. అయినా డ్రాప్ చేశారు.. ఇప్పుడు పంజాబ్ కింగ్స్ ను 11 ఏళ్ల తర్వాత ఫైనల్ కు తీసుకెళ్లాడు.
ఈసారి కూడా అతడు ట్రోఫీ అందుకోవడానికి పూర్తిగా అర్హుడు. మరోవైపు కోహ్లి ఉన్నాడు. ప్రతి ఏటా అతడు నిలకడగా ఆడుతున్నాడు. వేల కొద్దీ రన్స్ చేస్తున్నాడు. ఇది అతనికి ఆఖరి పోరాటం.. అతడు కూడా దీనికి అర్హుడే. ఫలితం ఏదైనా హార్ట్ బ్రేకే కానుంది” అని రాజమౌళి ట్వీట్ చేశాడు.
విరాట్ కోహ్లి పై అభిమానం
శ్రేయస్ అయ్యర్ మోస్ట్ అండర్ రేటెడ్ కెప్టెన్ అని చెప్పొచ్చు. రాజమౌళి చెప్పినట్లు అతడు ప్రతి ఐపీఎల్ టీమ్ నూ తన భుజాలపై మోస్తూ అద్భుతమైన ఫలితాలు సాధించి పెడుతున్నాడు. కానీ చివరికి అతన్ని ఆయా టీమ్స్ అన్నీ వదిలించుకుంటూనే ఉన్నాయి. గతేడాది కేకేఆర్ కు ట్రోఫీ అందించినా.. అతన్ని కొనసాగించలేదు. ఈసారి పంజాబ్ కింగ్స్ ను ఏకంగా ఫైనల్ కు తీసుకెళ్లాడు. టోర్నీ మొత్తం నిలకడగా రాణించాడు. అతని కెప్టెన్సీ కూడా అద్భుతమనే చెప్పాలి.
ఓ బ్యాటర్ గా తాను ముందుండి నడిపిస్తూ.. జట్టులోని వనరులను సరిగా ఉపయోగించుకుంటూ ముందుకు సాగుతున్నాడు. ఈ నేపథ్యంలో మంగళవారం (జూన్ 3) జరగబోయే ఫైనల్లోనూ అతడు ఇదే దూకుడు కొనసాగిస్తాడు అనడంలో ఎలాంటి సందేహం లేదు. అయితే మరోవైపు తొలిసారి ట్రోఫీ కోసం ఉవ్విళ్లూరుతున్న విరాట్ కోహ్లి కూడా అంతే ఆకలితో ఉన్నాడు. దీంతో ఈ ఇద్దరి మధ్య ఫైనల్ సమరం ఎంతో ఆసక్తికరంగా సాగనుంది.
ఐపీఎల్ ఫైనల్ ఎంతో ఆసక్తికరంగా ఉంటుందని రాజమౌళి ట్వీట్ స్పష్టం చేస్తుంది. శ్రేయస్ అయ్యర్ మరియు విరాట్ కోహ్లి ఇద్దరికీ ఆయన మద్దతు తెలిపారు. చివరగా ఎవరు గెలిచినా ఆయనకు హార్ట్ బ్రేక్ అని తెలిపారు.


