
📌 Key Points
- ‘పెద్ది’ సినిమా రిలీజ్ సందర్భంగా రామ్ చరణ్ విగ్రహం ఏర్పాటు.
- విగ్రహం రామ్ చరణ్‌లా లేకపోవడంతో సోషల్ మీడియాలో తీవ్ర ట్రోల్స్.
- నెటిజన్లు ఇతర నటులతో పోలుస్తూ మీమ్స్, సెటైర్లు వేసారు.
- కూకట్‌పల్లి ఫ్యాన్స్ అసోసియేషన్ క్షమాపణలు, తమ ఉద్దేశ్యం ప్రేమ అని స్పష్టీకరణ.
గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ ‘పెద్ది’ సినిమా విడుదల సందర్భంగా అభిమానులు ఏర్పాటు చేసిన విగ్రహం తీవ్ర వివాదానికి దారితీసింది. విగ్రహం హీరోను పోలి ఉండకపోవడంతో సోషల్ మీడియాలో దారుణంగా ట్రోల్స్ వచ్చాయి. దీంతో ఫ్యాన్స్ అసోసియేషన్ క్షమాపణలు చెప్పింది.
రామ్ చరణ్ విగ్రహంపై నెటిజన్ల ట్రోల్స్
Charan Statue: ‘పెద్ది’..గ్లోబల్ స్టార్ రామ్ చరణ్, ఉప్పెన ఫేమ్ బుచ్చిబాబు సనా కాంబినేషన్‌లో వస్తున్న మోస్ట్ అవేటెడ్ మూవీ (Peddi) జూన్ 4న ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలోకి రాబోతోంది. ఈ సినిమాపై అంచనాలు ఇప్పటికే ఆకాశాన్ని తాకగా, తెలుగు రాష్ట్రాల్లో అప్పుడే ఫెస్టివల్ మూడ్ మొదలైపోయింది.అర్ధరాత్రి నుంచే భారీ స్థాయిలో ప్రీమియర్స్ ప్లాన్ చేయడంతో మెగా అభిమానుల హడావుడి నెక్స్ట్ లెవెల్‌కు చేరుకుంది. హైదరాబాద్ నగరంలోని ప్రముఖ థియేటర్ల వద్ద రామ్ చరణ్ భారీ కటౌట్లు, బ్యానర్లు దర్శనమిస్తున్నాయి. అయితే, ఇదే ఉత్సాహంలో అభిమానులు చేసిన ఒక క్రేజీ ఎక్స్పరిమెంట్ ఇప్పుడు సోషల్ మీడియాలో హాట్ టాపిక్‌గా మారడానికి దారితీసింది.
రామ్ చరణ్‌లా లేని రామ్ చరణ్ విగ్రహం
సాధారణంగా నెక్స్ట్ లెవెల్ క్రేజ్ ఉన్న హీరోల సినిమాల రిలీజ్ అప్పుడు కటౌట్లకు పాలాభిషేకాలు చేయడం, పూలమాలలు వేయడం చూస్తుంటాం. కానీ, కూకట్‌పల్లిలోని ‘అర్జున్ థియేటర్’ వద్ద అభిమానులు ఏకంగా రామ్ చరణ్ విగ్రహాన్ని ఏర్పాటు చేసి సరికొత్త ట్రెండ్‌కు తెరలేపాలని చూశారు. తమ అభిమాన హీరోపై ఉన్న భక్తిని, ప్రేమను చాటుకోవాలనే ఉద్దేశంతో ఫ్యాన్స్ అసోసియేషన్ ఈ క్రేజీ డిసీషన్ తీసుకుంది. కానీ, సీన్ కట్ చేస్తే ఆ విగ్రహం కాస్తా నెటిజన్ల చేతికి చిక్కి తీవ్రస్థాయిలో ట్రోలింగ్‌కు గురైంది. విగ్రహం డిజైన్ లో జరిగిన లోపాల వల్ల అది అస్సలు రామ్ చరణ్‌లా లేకపోవడమే ఇందుకు ప్రధాన కారణం.
We sincerely apologize to everyone. Our intention with the Ram Charan statue was to express our love, admiration, and devotion towards @AlwaysRamCharan in a unique way. Unfortunately, the execution did not meet expectations and turned out to be a misfire.
విగ్రహంపై అభిమానుల క్షమాపణలు
— KUKATPALLYRCFC (@KukatpallyRCFC) June 2, 2026
ఆ విగ్రహాన్ని చూసిన నెటిజన్లు సోషల్ మీడియాలో మీమ్స్,సెటైరికల్ కామెంట్స్‌తో విరుచుకుపడ్డారు. “సూపర్ అన్నా.. ఇంతకీ అది ఎవరి విగ్రహం?” అంటూ కొందరు ఎగతాళి చేయగా, “రామ్ చరణ్ విగ్రహం చేయడానికి ప్రయత్నించి, టాలీవుడ్ నటుడు రాహుల్ రామకృష్ణ విగ్రహం తయారు చేసినట్టున్నారు!” అంటూ మరికొందరు పోస్టులు పెట్టారు. ఇంకొందరైతే ఆ విగ్రహ రూపం వర్ధమాన నటుడు నవీన్ చంద్ర లేదా మలయాళ నటుడు జోజు జార్జ్‌లా ఉందంటూ రకరకాల పోలికలు వెతికారు. అభిమానంతో చేసిన పనే అయినప్పటికీ, హీరో ఇమేజ్‌ను డ్యామేజ్ చేసేలా ఆ విగ్రహం ఉండటంపై మెగా ఫ్యాన్స్ సైతం తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు.
క్లారిటీ ఇవ్వడంతో ఈ వివాదానికి ఎండ్ కార్డ్
ఈ విగ్రహంపై సోషల్ మీడియాలో తీవ్ర వ్యతిరేకత, నెగెటివిటీ రావడంతో సదరు అభిమాన సంఘం తక్షణమే స్పందించి, తమ తప్పును ఒప్పుకుంటూ నెటిజన్లకు, మెగా అభిమానులకు క్లారిటీ ఇచ్చింది. మేము ప్రతిఒక్కరికీ మనస్ఫూర్తిగా క్షమాపణలు కోరుతున్నామని, రామ్ చరణ్ గారిపై మాకున్న ప్రేమ, అభిమానం, భక్తిని ఒక ప్రత్యేకమైన రీతిలో వ్యక్తపరచాలని ఈ విగ్రహాన్ని ఏర్పాటు చేశామని వారు పేర్కొన్నారు. కానీ దురదృష్టవశాత్తు అవుట్‌పుట్ విషయంలో అంచనాలను అందుకోలేక విఫలమయ్యామని వారు క్లారిటీ ఇవ్వడంతో ఈ వివాదానికి ఎండ్ కార్డ్ పడింది.
‘పెద్ది’ రిలీజ్ వేళ రచ్చకు కారణం
థియేటర్లలో ఏ రేంజ్ విధ్వంసం సృష్టిస్తాడో
ఈ చిన్న విగ్రహ వివాదం మరియు సోషల్ మీడియా నెగెటివిటీని పక్కన పెడితే, సినిమాపై ఉన్న పాజిటివ్ బజ్ మాత్రం గట్టిగా కనిపిస్తోంది. బుచ్చిబాబు సనా స్క్రిప్ట్ వర్క్, సరికొత్త కథనం ట్రేడ్ వర్గాల్లో భారీ అంచనాలను పెంచేసాయి. వృద్ధి సినిమాస్ బ్యానర్‌పై వెంకట సతీష్ కిలారు ఈ చిత్రాన్ని అత్యంత భారీ బడ్జెట్‌తో నిర్మించగా, మైత్రి మూవీ మేకర్స్, సుకుమార్ రైటింగ్స్ సమర్పకులుగా వ్యవహరిస్తున్నారు. బాలీవుడ్ బ్యూటీ జాన్వీ కపూర్ హీరోయిన్‌గా నటిస్తున్న ఈ చిత్రంలో కన్నడ స్టార్ శివ రాజ్‌కుమార్, జగపతి బాబు, దివ్యేందు, బోమన్ ఇరానీ కీలక పాత్రల్లో నటిస్తున్నారు. ఏఆర్ రెహమాన్ అందించిన సంగీతం ఇప్పటికే చార్ట్‌బస్టర్‌గా నిలిచింది. విగ్రహం వివాదం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నప్పటికీ, అడ్వాన్స్ బుకింగ్స్ పరంగా ‘పెద్ది’ బాక్సాఫీస్ వద్ద సరికొత్త రికార్డుల వేటను ప్రారంభించింది. ఈ నెగెటివ్ ట్రోల్స్‌ను పటాపంచలు చేస్తూ, రామ్ చరణ్ రేపు థియేటర్లలో ఏ రేంజ్ విధ్వంసం సృష్టిస్తాడో చూడాలి మరి !
అభిమానంతో చేసిన పని అయినప్పటికీ, విగ్రహం రూపకల్పనలో లోపాలు హీరో ఇమేజ్‌ను దెబ్బతీసేలా మారాయి. ఈ ఘటన అభిమానులకు ఒక గుణపాఠం, భవిష్యత్తులో ఇలాంటివి పునరావృతం కాకుండా జాగ్రత్తపడాలని సూచిస్తుంది.


