
📌 Key Points
- ఒక్కరోజులో రికార్డు స్థాయిలో 75.7 లక్షల LPG బుకింగ్‌లు నమోదయ్యాయి.
- దేశంలో గ్యాస్ కొరత లేదని, సరిపడా నిల్వలు ఉన్నాయని ప్రభుత్వం స్పష్టం చేసింది.
- గ్యాస్ ఉత్పత్తిని 30% పెంచామని, ప్రజలు ఆందోళన చెందవద్దని ప్రభుత్వం విజ్ఞప్తి చేసింది.
- PNG వాడకాన్ని ప్రోత్సహిస్తూ, కనెక్షన్లు పెంచేందుకు ప్రభుత్వం చర్యలు తీసుకుంటోంది.
పశ్చిమాసియాలో యుద్ధ పరిస్థితుల నేపథ్యంలో గ్యాస్ సిలిండర్ల కొరత ఏర్పడుతుందనే భయంతో ప్రజలు ఒక్కసారిగా బుకింగ్‌లు పెంచేశారు. ఒక్కరోజులోనే రికార్డు స్థాయిలో 75.7 లక్షల ఎల్‌పీజీ బుకింగ్‌లు నమోదయ్యాయి.
భయంతో రికార్డు స్థాయిలో గ్యాస్ బుకింగ్‌లు
పశ్చిమాసియాలో జరుగుతున్న బీకర యుద్ధం నేపథ్యంలో దేశవ్యాప్తంగా సామాన్యుల్లో గ్యాస్ సిలిండర్ల కొరత ఏర్పడుతుందనే భయం (Panic) మొదలైంది. దీనివల్ల ఒక్కరోజే రికార్డు స్థాయిలో 75.7 లక్షల ఎల్‌పీజీ(LPG) బుకింగ్‌లు నమోదయ్యాయి. హర్మూజ్ జలసంధి మూసివేత వల్ల చమురు, గ్యాస్ సరఫరా నిలిచిపోతుందనే వార్తలతో ప్రజలు ఏజెన్సీల వద్ద క్యూ కడుతుండగా, ప్రభుత్వం మాత్రం పరిస్థితి అదుపులోనే ఉందని భరోసా ఇస్తోంది. పెట్రోలియం మంత్రిత్వ శాఖ జాయింట్ సెక్రటరీ సుజాత శర్మ వెల్లడించిన వివరాల ప్రకారం.. దేశంలో ఎక్కడా గ్యాస్ ఏజెన్సీలు ఖాళీ అవ్వలేదని(No dry-out), గృహ అవసరాలకు సరిపడా సరఫరా కొనసాగుతోందని స్పష్టం చేశారు. అంతేకాకుండా, దేశీయంగా గ్యాస్ ఉత్పత్తిని మార్చి 5తో పోలిస్తే 30% పెంచామని, కాబట్టి ప్రజలు అనవసరంగా భయపడి పానిక్ బుకింగ్ చేయవద్దని ప్రభుత్వం విజ్ఞప్తి చేసింది.
ప్రస్తుత సంక్షోభాన్ని ఎదుర్కోవడానికి ప్రభుత్వం పీఎన్‌జీ (PNG) వాడకాన్ని ప్రోత్సహిస్తోంది. ప్రస్తుతం దేశంలో 1.5 కోట్ల ఇళ్లకు ఈ కనెక్షన్లు ఉండగా, మరో 60 లక్షల ఇళ్లు వెంటనే మారే అవకాశం ఉందని ప్రభుత్వం సూచించింది. అయితే క్షేత్రస్థాయిలో పరిస్థితి కొంత భిన్నంగా ఉంది. గ్యాస్ బుకింగ్‌లు అమాంతం పెరగడంతో సాధారణంగా ఉండే 21 రోజుల బుకింగ్ గ్యాప్‌ను ఇప్పుడు 25 రోజులకు (గ్రామీణ ప్రాంతాల్లో 45 రోజులకు) పెంచారు. గృహ వినియోగదారులకు ప్రాధాన్యత ఇవ్వడం వల్ల హోటళ్లు, రెస్టారెంట్లు వాడే కమర్షియల్ సిలిండర్లకు కొంత కొరత ఏర్పడింది. అక్రమ నిల్వలు, బ్లాక్ మార్కెటింగ్‌పై కఠిన చర్యలు తీసుకోవాలని రాష్ట్ర ప్రభుత్వాలను కేంద్రం ఆదేశించింది. చమురు ధరల పెరుగుదల భయం ఉన్నప్పటికీ, గ్యాస్ సరఫరా విషయంలో ఎటువంటి ఇబ్బందులు లేకుండా చూడడమే తమ ప్రాధాన్యతని ప్రభుత్వం చెబుతోంది.
గ్యాస్ కొరత లేదని ప్రభుత్వ ప్రకటన
పీఎన్‌జీ వాడకాన్ని ప్రోత్సహిస్తున్న ప్రభుత్వం
ప్రస్తుత పరిస్థితుల్లో ప్రజలు ఆందోళన చెందకుండా, ప్రభుత్వం సరఫరాను మెరుగుపరిచేందుకు చర్యలు తీసుకుంటోంది. ప్రత్యామ్నాయంగా పీఎన్‌జీ వాడకంపై దృష్టి సారించాలని సూచిస్తోంది.

