|

Andhravilas.net – Breaking News & Movie Buzz Since 2002

అన్నం vs చపాతీ: బరువు తగ్గాలంటే ఏది బెస్ట్? షాకింగ్ నిజాలు!

Published: 23-06-2026, 1:14 AM
  • అన్నం, చపాతీ రెండూ భారతీయ భోజనంలో ముఖ్యమైన భాగాలు.
  • చపాతీలలో పీచు, ప్రొటీన్లు, సూక్ష్మ పోషకాలు అధికంగా ఉంటాయి.
  • వైట్ రైస్ జీఐ ఎక్కువ, బ్రౌన్ రైస్ పోషకాలు అధికంగా అందిస్తుంది.
  • ఆహార ఎంపిక వ్యక్తి శరీరం, జీవనశైలి, ఇతర ఆహార పదార్థాలపై ఆధారపడి ఉంటుంది.

బరువు తగ్గాలనుకునే వారికి అన్నం, చపాతీలలో ఏది మంచిదనేది ఎప్పుడూ చర్చనీయాంశమే. అన్నం తింటే లావు అవుతారనే అపోహను తొలగిస్తూ, ప్రముఖ డైటీషియన్ డాక్టర్ అర్చన బాత్రా ఈ రెండింటి పోషక విలువలు, క్యాలరీల గురించి వివరించారు.

అన్నం vs చపాతీ: పోషక విలువలు

భారతీయుల భోజనంలో అన్నం, చపాతీ (రోటీ) అత్యంత ముఖ్యమైన భాగం. అయితే, బరువు తగ్గాలని నిర్ణయించుకోగానే చాలా మంది మనసులో మెదిలే మొదటి ప్రశ్న: “అన్నం మానేసి చపాతీలు తినడం మొదలుపెట్టాలా?” అని. సాధారణంగా అన్నం తింటే లావు అవుతారని, చపాతీలు తింటే బరువు తగ్గుతారని చాలా మంది బలంగా నమ్ముతుంటారు. కానీ, న్యూట్రీషియన్ సైన్స్ ప్రకారం చూస్తే అసలు నిజాలు వేరేలా ఉన్నాయి! ఈ రెండింటి మధ్య ఉన్న వ్యత్యాసాలను, ఏది ఆరోగ్యానికి మంచిదనే విషయాలను ప్రముఖ డైటీషియన్, సర్టిఫైడ్ డయాబెటిస్ ఎడ్యుకేటర్ డాక్టర్ అర్చన బాత్రా క్లియర్​గా వివరించారు.

“అన్నం, చపాతీ.. ఈ రెండింటిలో ఇదొక్కటే గొప్పదని ఖచ్చితంగా చెప్పలేం. మీరు ఎంచుకునే ఆహారం మీ శరీరం, జీవనశైలి, రోజూ తీసుకునే ఇతర ఆహార పదార్థాలపై ఆధారపడి ఉంటుంది,” అని డాక్టర్ అర్చన బాత్రా పేర్కొన్నారు.

సాధారణంగా చపాతీలను హోల్ వీట్ (గోధుమ పిండి)తో తయారు చేస్తారు. అందువల్ల ఇందులో పీచుపదార్థం, ప్రొటీన్లతో పాటు మెగ్నీషియం, విటమిన్-బీ వంటి సూక్ష్మ పోషకాలు ఎక్కువగా ఉంటాయి. ఇక అన్నం విషయానికి వస్తే, అది మనం వండుకునే బియ్యం రకాన్ని బట్టి మారుతుంది. వైట్ రైస్ (తెల్లటి అన్నం) ఎక్కువ ప్రాసెసింగ్ జరగడం వల్ల అందులో ఫైబర్ తక్కువగా ఉంటుంది. అదే బ్రౌన్ రైస్ (దంపుడు బియ్యం) లో తవుడు పొర అలాగే ఉండటం వల్ల పోషకాలు ఎక్కువగా లభిస్తాయి.

క్యాలరీల పరంగా చూస్తే.. ఒక మీడియం సైజు చపాతీలో దాదాపు 70 నుంచి 100 క్యాలరీలు ఉంటాయి. అదే ఒక కప్పు వండిన అన్నంలో రకాన్ని బట్టి 130 నుంచి 200 క్యాలరీల వరకు ఉంటాయి. అయితే కేవలం క్యాలరీలను మాత్రమే బట్టి ఒక ఆహారం మంచిదా కాదా అని నిర్ణయించలేమని ఆమె స్పష్టం చేశారు.

క్యాలరీలు, గ్లైసిమిక్ ఇండెక్స్: వాస్తవాలు

అన్నం తింటే లావు అవుతారనే ప్రచారానికి ప్రధాన కారణం అందులో ఉండే గ్లైసిమిక్ ఇండెక్స్ (జీఐ). ఒక ఆహారం మన శరీరంలో ఎంత వేగంగా బ్లడ్ షుగర్ స్థాయిలను పెంచుతుందనే దాన్ని ఈ గ్లైసిమిక్ ఇండెక్స్ సూచిస్తుంది. గోధుమ చపాతీలతో పోలిస్తే వైట్ రైస్‌కు జీఐ ఎక్కువగా ఉంటుంది. అంటే అన్నం తిన్నప్పుడు రక్తంలో చక్కెర స్థాయిలు త్వరగా పెరుగుతాయి.

కానీ, ఇక్కడ మనం తినే విధానం చాలా ముఖ్యం. అన్నాన్ని కేవలం పచ్చడితోనో లేదా ఒట్టిగానో తినకుండా.. పప్పు, కూరగాయలు, పెరుగు లేదా ప్రొటీన్లు ఎక్కువగా ఉండే చికెన్, పనీర్ వంటి వాటితో కలిపి తిన్నప్పుడు శరీరంలో గ్లూకోజ్ శోషణ నెమ్మదిస్తుంది. కడుపు కూడా ఎక్కువసేపు నిండినట్లు ఉంటుంది. అలాగే, ప్రొటీన్లు లేదా కూరగాయలు ఏవీ లేకుండా కేవలం 3, 4 చపాతీలు తిన్నా కూడా పెద్దగా ప్రయోజనం ఉండదు.

కొందరికి చపాతీల కంటే అన్నం చాలా సులభంగా జీర్ణమవుతుంది. జీర్ణక్రియ సమస్యలు ఉన్నవారు, సున్నితమైన కడుపు ఉన్నవారు లేదా అనారోగ్యం నుంచి కోలుకుంటున్న వారికి అన్నం ఒక బెస్ట్ ఆప్షన్. అంతేకాదు, అన్నంలో సహజంగానే గ్లూటెన్ ఉండదు. కాబట్టి గ్లూటెన్ పడని వారికి, సీలియాక్ వ్యాధి ఉన్నవారికి అన్నం చాలా సురక్షితం.

మరోవైపు, గోధుమ చపాతీలో ఉండే పీచుపదార్థం పేగుల ఆరోగ్యానికి మేలు చేస్తుంది, ఎక్కువ సమయం ఆకలి వేయకుండా చూస్తుంది. అయితే, గ్యాస్ లేదా కడుపు ఉబ్బరం సమస్యలు ఉన్నవారికి ఎక్కువ ఫైబర్ వల్ల ఇబ్బంది కలగవచ్చు.

బరువు తగ్గడానికి సరైన ఆహార ఎంపిక

“అన్నం గానీ, చపాతీ గానీ నేరుగా బరువు పెరగడానికి కారణం కావు. మనం ఖర్చు చేసే క్యాలరీల కంటే ఎక్కువ క్యాలరీల ఆహారాన్ని తీసుకున్నప్పుడే బరువు పెరుగుతాం. నిజానికి, రోజూ అన్నం తింటూ కూడా బరువు తగ్గిన వారు ఉన్నారు, అలాగే చపాతీలు తింటూ బరువు తగ్గిన వారూ ఉన్నారు,” అని డాక్టర్ అర్చన వివరించారు.

మనం అన్నం తింటున్నామా లేదా చపాతీ తింటున్నామా అనే దానికంటే.. ఎంత పరిమాణంలో తింటున్నాం, దాంతో పాటు ఎలాంటి కూరలు తీసుకుంటున్నాం అనేదే ముఖ్యం. మీ ప్లేట్‌లో కార్బోహైడ్రేట్లతో పాటు తగినంత ప్రొటీన్ , హెల్తీ ఫ్యాట్స్, ఎక్కువ మొత్తంలో కూరగాయలు ఉండేలా చూసుకోవడం అన్నింటికంటే ముఖ్యం.

చివరగా చెప్పేదేంటంటే.. మీరు శారీరకంగా చురుగ్గా ఉంటూ, ఎలాంటి ఆరోగ్య సమస్యలు లేనట్లయితే.. మీ డైట్‌లో అన్నం, చపాతీ రెండింటికీ చోటు కల్పించవచ్చు. కాబట్టి “ఈ రెండింటిలో ఏది మంచిది?” అని ఆలోచించే బదులు, “నా శరీర తత్వానికి, నా లైఫ్‌స్టైల్‌కు ఏది బాగా సరిపోతుంది?” అని ఆలోచించి నిర్ణయం తీసుకోవడమే ఉత్తమం.

శరత్​ చిట్టూరి హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో డిప్యూటీ చీఫ్​ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా ఉన్నారు. 7ఏళ్ల జర్నలిజం ఎక్స్​పీరియెన్స్​తో ఇక్కడ బిజినెస్​, ఆటో, టెక్​, పర్సనల్​ ఫైనాన్స్​, నేషనల్​- ఇంటర్నేషనల్, స్పోర్ట్స్​ వార్తలు రాస్తున్నారు. 2022 జనవరిలో హిందుస్థాన్ టైమ్ తెలుగులో చేరారు. పలుమార్లు హెచ్​టీ ఇన్​స్టా అవార్డులు అదుకున్నారు. గతంలో ఈటీవీ భారత్​లో కంటెంట్ రైటర్‌గా పని చేశారు. అక్కడ జాతీయం, అంతర్జాతీయం, బిజినెస్​ వార్తలు రాసేవారు. ఏ అంశమైనా సరళంగా, చదివేందుకు సులభంగా ఉండే విధంగా తీర్చిదిద్దేందుకు ఇష్టపడతారు.IGNOU నుంచి జర్నలిజంలో పీజీ డిగ్రీ ఉంది. అంతకుముందు బీటెక్​ పూర్తి చేశారు. కథలు చెప్పడం, రాయడంపై ఇష్టంతో ఈ రంగాన్ని ఎంచుకున్నారు. తన ఆర్టికల్స్​తో ఇప్పుడు ప్రజలకు చేరువవుతున్నారు. Read More

చివరగా, అన్నం లేదా చపాతీ ఏదైనా సరే, తినే విధానం, పరిమాణం ముఖ్యమని డాక్టర్ అర్చన బాత్రా స్పష్టం చేశారు. సమతుల్య ఆహారంతో పాటు సరైన జీవనశైలి బరువు తగ్గడానికి కీలకం.

Related News

Plugin developed by ProSEOBlogger
Plugin developed by ProSEOBlogger. Get free Ypl themes.