
రాష్ట్రంలో జరుగుతున్న స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ (ఎస్ఐఆర్) ప్రక్రియపై రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి సి.సుదర్శన్ రెడ్డి కీలక ఆదేశాలు జారీ చేశారు. ఆన్‌లైన్‌లో సమర్పించిన ఓటరు ఎన్యుమరేషన్ ఫారమ్‌లకు హార్డ్ కాపీలు అడగవద్దని, ఓటర్లను ఇబ్బంది పెట్టవద్దని స్పష్టం చేశారు. డిజిటలైజేషన్ వేగవంతం చేయాలని సూచించారు.
Key Points
ఎస్ఐఆర్ ప్రక్రియను సకాలంలో పూర్తి చేయాలని సీఈఓ సుదర్శన్ రెడ్డి ఆదేశం.
ఆన్‌లైన్‌లో సమర్పించిన ఫారమ్‌లకు హార్డ్‌కాపీలు అడగవద్దని బీఎల్ఓలకు సూచన.
ఆధార్ తప్పనిసరి కాదని, ఓటర్లకు సహాయం చేయాలని స్పష్టీకరణ.
గైర్హాజరు, మరణించిన ఓటర్ల వివరాలను క్షుణ్ణంగా పరిశీలించాలని ఆదేశం.
ఆన్‌లైన్ దరఖాస్తులకు హార్డ్‌కాపీలు వద్దు!
రాష్ట్రంలో నిర్వహిస్తున్న స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్(Special Intensive Revision-SIR) ప్రక్రియకు సంబంధించిన అన్ని కార్యక్రమాలను సకాలంలో పూర్తయ్యేలా సంబంధిత ఎన్నికల అధికారులు చర్యలు తీసుకోవాలని రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి సి.సుదర్శన్ రెడ్డి ఐఎఎస్ ఆదేశించారు. గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ కమిషనర్, రాష్ట్రంలోని అన్ని జిల్లాల ఎన్నికల అధికారులతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు.
ఈ సందర్భంగా రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి సుదర్శన్ రెడ్డి మాట్లాడారు. ఓటర్లు ఎన్యుమరేషన్ ఫారమ్‌లను ఆన్‌లైన్‌లో సమర్పించిట్లయితే హార్డ్ కాపీ కోసం బీఎల్ఓలు ఓటర్లను ఇబ్బంది పెట్టొద్దని సూచించారు. ఎన్యుమరేషన్ ఫారమ్ సమర్పించేటప్పుడు ఆధార్ కార్డు తప్పనిసరి అని చెప్పొద్దని, ఓటర్లు ఎన్యుమరేషన్ ఫారమ్‌లను సమర్పించేందుకు అవసరమైన సహాయాన్ని అందించి, వారి ఫిర్యాదులను పరిష్కరించాలని తెలిపారు.
ఓటర్లకు సహాయం, ఫిర్యాదుల పరిష్కారం
అలాగే ఓటరు జాబితాల్లో వీవీఐపీ, వీఐపీ ఓటర్ల పేర్లు తప్పనిసరిగా ఉండేలా చూసుకోవాలన్నారు ప్రధాన ఎన్నికల అధికారి. గైర్హాజరు, నివాసం మారిన, మరణించిన ఓటర్ల వివరాలను క్షుణ్ణంగా పరిశీలించి రికార్డుల్లో నమోదు చేయాలని సూచించారు. డిజిటలైజేషన్ ప్రక్రియను వేగవంతం చేయాలని చెప్పారు. రాజకీయపార్టీలతో నిర్వహించే సమావేశాల్లో పారదర్శకత పాటిస్తూ, సంబంధిత వివరాలను నమోదు చేయాలని, పట్టణ ప్రాంతాలు, పురోగతి తక్కువ ఉన్న అసెంబ్లీ నియోజకవర్గాలపై ప్రత్యేక దృష్టి సారించాలని పేర్కొన్నారు.
ఈ వారంలోగా ప్రతి జిల్లాలో ఎన్యుమరేషన్ ప్రక్రియ 90 శాతం పూర్తయ్యేలా తగిన చర్యలు తీసుకోవాలని జిల్లా ఎన్నికల అధికారులను సుదర్శన్ రెడ్డి ఆదేశించారు. అలాగే నో మ్యాపింగ్ కేటగిరీలో ఉన్న ఓటర్లను పూర్తిస్థాయిలో ధృవీకరించి తగిన చర్యలు తీసుకోవాలని సూచించారు. ఎస్ఐఆర్-2026 కార్యక్రమాన్ని సకాలంలో పూర్తి చేయడానికి సంబంధిత ఎన్నికల అధికారులందరూ సమన్వయంతో పని చేయాలని ప్రధాన ఎన్నికల అధికారి ఆదేశించారు.
డిజిటలైజేషన్, వీవీఐపీ ఓటర్ల వివరాలు
ఈ కార్యక్రమంలో అదనపు ప్రధాన ఎన్నికల అధికారి డాక్టర్.వాసం వెంకటేశ్వర్ రెడ్డి, ఉప ప్రధాన ఎన్నికల అధికారి జి.ఎస్. చారి, ఇతర అధికారులు పాల్గొన్నారు.
ఎస్ఐఆర్-2026 కార్యక్రమాన్ని సకాలంలో పూర్తి చేయడానికి అధికారులు సమన్వయంతో పనిచేయాలని సీఈఓ సుదర్శన్ రెడ్డి ఆదేశించారు. ఓటర్ల నమోదు ప్రక్రియలో పారదర్శకత, వేగం ఉండేలా చర్యలు తీసుకోవాలని స్పష్టం చేశారు.


