
📌 Key Points
- స్పైడర్ మ్యాన్ బ్రాండ్ న్యూ డే: జులై 31న ప్రపంచవ్యాప్తంగా విడుదల కాబోతున్న భారీ యాక్షన్ చిత్రం!
- టామ్ హోలాండ్, జెండయా, సాడీ సింక్ నటనతో అదరగొట్టేందుకు సిద్ధమైన స్పైడర్ మ్యాన్ నాల్గో చిత్రం!
- ‘స్పైడర్-మ్యాన్: నో వే హోమ్’ రికార్డుల తర్వాత వస్తున్న ఈ సినిమాపై భారీ అంచనాలు!
- విజువల్ వండర్స్‌తో ప్రేక్షకులను కట్టిపడేసేలా దర్శకుడు డెస్టిన్ డానియల్ క్రిట్టన్ దర్శకత్వం!
స్పైడర్ మ్యాన్ అభిమానులకు ఇది ఒక పండగలాంటి వార్త! ఎందుకంటే స్పైడర్ మ్యాన్ సిరీస్‌లో వస్తున్న నాల్గవ చిత్రం ‘స్పైడర్ మ్యాన్ బ్రాండ్ న్యూ డే’. ఈ సినిమా ట్రైలర్ విడుదలై సంచలనం సృష్టిస్తోంది.
ట్రైలర్‌తో అంచనాలు పెంచేసిన స్పైడర్ మ్యాన్
స్పైడర్ మ్యాన్ మూవీస్ కి ప్రపంచ వ్యాప్తంగా విశేష ఆదరణ ఉంది. చిన్న పిల్లల నుంచి పెద్ద వాళ్ల వరకు ఈ చిత్రాలను చూసి ఎంజాయ్ చేస్తారు. మార్వెల్ సినిమాటిక్ యూనివర్స్ లో నుంచి వస్తోన్న మరో సిరీస్ `స్పైడర్ మ్యాన్`. స్పైడర్ మ్యాన్ సిరీస్‌లోని చిత్రాలు అన్ని వర్గాల ఆడియెన్స్ ని ఆకట్టుకోవడమే కాదు, బాక్సాఫీసు వద్ద కూడా కలెక్షన్ల సునామీ సృష్టిస్తుంటాయి. ఈ క్రమంలో ఈ సిరీస్ నుంచి సినిమా వచ్చి ఐదేళ్లు అవుతుంది. చివరగా 2021లో `స్పైడర్ మ్యాన్ నో వే హోమ్` అనే మూవీ వచ్చింది. అది 1.92 బిలియన్ డాలర్ల కలెక్షన్లని వసూలు చేసింది.
ఈ క్రమంలో తాజాగా ఈ స్పైడర్ మ్యాన్ సిరీస్ నుంచి నాల్గో మూవీ వస్తోంది. `స్పైడర్ మ్యాన్ బ్రాండ్ న్యూ డే` పేరుతో దీన్ని రూపొందించారు. దీనికి డెస్టిన్ డానియల్ క్రిట్టన్ దర్శకత్వం వహించగా, టామ్ హోలాండ్, జెండయా, సాడీ సింక్, జాకబ్ బటలాన్ వంటి వారు ప్రధాన పాత్రలు పోషించారు. ఈ మూవీ జులై 31న విడుదల కానుంది. ఈ క్రమంలో తాజాగా ఈ మూవీ నుంచి ట్రైలర్ విడుదలయ్యింది. ఈ సినిమా ట్రైలర్ టీజ్ తర్వాత, న్యూయార్క్ నగరంలో ఐకానిక్ ఎంపైర్ స్టేట్ బిల్డింగ్ పై నుండి టామ్ హోలాండ్ పూర్తి ట్రైలర్‌ను ఆవిష్కరించారు.
టామ్ హోలాండ్ యాక్షన్ అదుర్స్ అంతే!
‘స్పైడర్-మ్యాన్: నో వే హోమ్’ సాధించిన రికార్డ్స్ బ్రేకింగ్ గ్లోబల్ సక్సెస్ తర్వాత, పీటర్ పార్కర్, స్పైడర్ మ్యాన్‌ల జీవితాల్లో ‘స్పైడర్-మ్యాన్: బ్రాండ్ న్యూ డే’ ఒక సరికొత్త అధ్యాయాన్ని క్రియేట్ చేయడానికి రాబోతుంది. ‘నో వే హోమ్’ సంఘటనలు జరిగి ఐదేళ్లు గడిచాయి. పీటర్ ఇప్పుడు తనను ప్రేమించేవారి జీవితాలు, జ్ఞాపకాల నుండి తన అస్తిత్వాన్ని పూర్తిగా చెరిపేసుకుని ఒంటరిగా జీవిస్తున్నాడు. తన పేరును ఏమాత్రం గుర్తుపట్టలేని న్యూయార్క్ నగరంలో నేరాలతో పోరాడుతూ, సిటీని రక్షించడానికి ఒక ఫుల్-టైమ్ స్పైడర్ మ్యాన్‌గా పూర్తిగా అంకితమయ్యాడు. అయితే అతనిపై బాధ్యతలు, ఒత్తిడి పెరిగేకొద్దీ.. ఊహించని శారీరక మార్పులు అతని మనుగడకే ముప్పుగా పరిణమిస్తాయి. అదే సమయంలో నగరంలో జరుగుతున్న వింతైన నేరాల పరంపర అతనెన్నడూ ఎదుర్కోనంతటి అత్యంత శక్తివంతమైన విలన్ ముప్పుకు దారితీస్తుంది. మరి దీన్ని స్పైడర్ మ్యాన్ ఎలా ఎదుర్కొన్నాడు, సరికొత్త విలన్లని ఎదుర్కొనేందుకు ఆయన ఎలా రెడీ అయ్యాడు? ఈ సారి తన పోరాటం ఎలా సాగిందనే ఆసక్తికర అంశాలతో సినిమా సాగబోతుందని ట్రైలర్ చూస్తే అర్థమవుతుంది.
జులై 31న గ్రాండ్ రిలీజ్.. రికార్డులు షురూ!
ఈ చిత్రంలో స్పైడర్ మ్యాన్‌గా టామ్ హాలండ్ నటిస్తుండగా, జెండయా, జాకబ్ బటలాన్, సాడీ సింక్, జోన్ బెర్న్తాల్, మార్క్ రుఫలో, మైఖేల్ మాండో, ట్రామెల్ టిల్మాన్ కీలక పాత్రలు పోషిస్తున్నారు. సోనీ పిక్చర్స్ ఎంటర్‌టైన్‌మెంట్ ఇండియా నిర్మిస్తున్న ఈ భారీ యాక్షన్ ఎంటర్‌టైనర్, జూలై 31న ఇంగ్లీష్, హిందీ, తమిళం, తెలుగు, కన్నడ, మలయాళ భాషల్లో అన్ని ప్రీమియం ఫార్మాట్లలో థియేటర్లలో విడుదల కానుంది. తాజా ట్రైలర్ మూవీపై అంచనాలను పెంచింది. విజువల్స్ పరంగా కనువిందు చేస్తుంది. ఈ సారి ఎంటర్‌టైన్‌మెంట్ వేరే లెవల్ అని చెప్పొచ్చు.
స్పైడర్ మ్యాన్ బ్రాండ్ న్యూ డే చిత్రం జులై 31న విడుదల కానుంది. ఈ సినిమా కోసం అభిమానులు ఎంతగానో ఎదురుచూస్తున్నారు. మరిన్ని అప్‌డేట్స్ కోసం చూస్తూనే ఉండండి.


