
📌 Key Points
- తెలంగాణ ప్రభుత్వ ఉద్యోగులకు ఈవీ వాహనాల కొనుగోలుపై 20% వరకు రాయితీ.
- ప్రభుత్వ శాఖలన్నీ ఇకపై ఈవీ వాహనాలనే కొనుగోలు చేయాలని సీఎం రేవంత్ రెడ్డి ఆదేశం.
- కాలుష్యాన్ని తగ్గించేందుకు తెలంగాణ ప్రభుత్వం ఈవీ పాలసీని ప్రోత్సహిస్తోంది.
- ప్రభుత్వ ఉద్యోగులకు రూ.4 లక్షల వరకు ఆదా అయ్యే అవకాశం.
తెలంగాణ ప్రభుత్వం ఎలక్ట్రిక్ వాహనాల వినియోగాన్ని ప్రోత్సహిస్తూ కీలక నిర్ణయం తీసుకుంది. ప్రభుత్వ ఉద్యోగులకు ఈవీ వాహనాల కొనుగోలుపై 20% రాయితీ ప్రకటించింది. దీని ద్వారా ఉద్యోగులకు రూ.4 లక్షల వరకు ఆదా అయ్యే అవకాశం ఉంది.
ఉద్యోగులకు ఈవీ వాహనాలపై రాయితీ
కాలుష్యాన్ని తగ్గించడానికి తెలంగాణ ప్రభుత్వం ఈవి పాలసీ తీసుకొచ్చింది. ఈవీ పాలసీతో జీరో రోడ్ టాక్స్, జీరో రిజిస్టేషన్ టాక్స్ మినహాయింపు ఉంటుంది. దాని ద్వారా దాదాపు వెయ్యి కోట్లు ప్రభుత్వం నష్టపోయిన ఈవీ పాలసీని ప్రోత్సహిస్తుందని మంత్రి పొన్నం ప్రభాకర్ చెప్పారు.
‘ఈవీ పాలసీ వచ్చిన తర్వాత ఎలక్ట్రిక్ వాహనాల వినియోగం భారీగా పెరిగింది. అందువల్ల ఇటీవల రవాణా శాఖ సమీక్షా సమావేశంలో ప్రభుత్వం ఉద్యోగులకు ప్రోత్సాహం ఇవ్వాలని తయారీ దారులను కోరాం. ప్రభుత్వ సంస్థలకు హైర్ లేదా డిపార్ట్మెంట్‌లు కొనుగోలు చేస్తే.. ఈవీ వాహనాలు కొనుగోలు చేయాలని ముఖ్యమంత్రి సూచించారు. ఈవీ వాహనాలకు అన్ని ప్రాంతాల్లో ఈవీ ఛార్జింగ్ స్టేషన్లు ఏర్పాటు చేయడం జరిగింది. కంపెనీదారులు ప్రభుత్వ ఉద్యోగులకు 10-20 శాతం వారు డిస్కౌంట్ ఇస్తారు. మహేంద్ర ఎలెక్ట్రిక్స్, ఏథర్ ఎనర్జీ, గ్రావిటన్ మోటార్స్, ఓలాతోపాటు పలు కంపెనీలు ముందుకు వస్తున్నాయి.’ అని పొన్నం ప్రభాకర్ చెప్పారు.
క్యూర్ ఏరియాలో ఎలక్ట్రిక్ బస్సులు నడుస్తున్నాయని పొన్నం వెల్లడించారు. క్యూర్ ఏరియాలో డీజిల్ ఆటోలు కూడా మార్చి నడపాలని నిర్ణయం తీసుకుందన్నారు. 15 సంవత్సరాలు దాటిన వాహనాలు స్క్రాపేజీ కి పంపిస్తున్నామని తెలిపారు. రవాణా శాఖ లో అనేక సంస్కరణలు తీసుకొస్తున్నట్టుగా పేర్కొన్నారు. తెలంగాణలో వాహన్ పోర్టల్‌లోకి చేరామన్నారు. వాహనాన్ని కొనుగోలు చేసినప్పుడు షో రూమ్‌లోనే రిజిస్టేషన్ చేసుకునే అవకాశం ఉంటుందని వెల్లడించారు.
ప్రభుత్వ శాఖల్లో ఈవీ వాహనాల వినియోగం
మెుత్తానికి రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగుల కోసం ఎలక్ట్రిక్ ద్విచక్ర, నాలుగు చక్రాల వాహనాలపై 20 శాతం వరకు రాయితీలను అందిస్తుంది. ఈ ప్రత్యేకమైన చర్య వల్ల తెలంగాణ వ్యాప్తంగా సుమారు ఐదు లక్షల మంది ప్రభుత్వ ఉద్యోగులకు ఒక్కో ఉద్యోగికి రూ.4 లక్షల వరకు ఆదా అయ్యే అవకాశం ఉంది.
ఈ పథకం గురించి మంత్రి ప్రభాకర్ మాట్లాడుతూ.. ప్రభుత్వ ఉద్యోగులకు ఈవీలు మరింత సరసమైనవిగా, అందుబాటులో ఉండేవిగా, రోజువారీ వినియోగానికి ఉపయోగకరంగా ఉంటాయన్నారు. ఇది ప్రజలకు, భూగోళానికి కూడా మేలు చేసే పరిపాలన అని మంత్రి అన్నారు.
కాలుష్య నియంత్రణకు ఈవీ పాలసీ ప్రోత్సాహం
ఇప్పటికే అన్ని ప్రభుత్వ శాఖలు కేవలం ఈవీ లను మాత్రమే కొనుగోలు చేయాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి స్పష్టంగా ఆదేశించిన విషయం తెలిసిందే. ప్రధాన పట్టణ ప్రాంతాల్లోని ప్రభుత్వ శాఖలు అద్దెకు తీసుకునే వాహనాలు కూడా ఇకపై ఎలక్ట్రిక్ వాహనాలే అయి ఉండాలి. ఇది స్వచ్ఛమైన, సుస్థిరమైన రవాణా వ్యవస్థను నిర్మించాలనే ప్రభుత్వ నిబద్ధతకు నిదర్శనంగా చెబుతున్నారు. రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటికే ప్రజా రవాణా వ్యవస్థలో భాగంగా 2,800కు పైగా ఎలక్ట్రిక్ బస్సులను నడుపుతోంది.
‘ప్రభుత్వ ఉద్యోగులకు ఈవీ వాహనాల్లో ప్రోత్సాహకం అందిస్తాం. ప్రభుత్వ ఉద్యోగుల కోసం ఎలక్ట్రిక్ వాహనాలపై 20 శాతం వరకు ప్రత్యేక రాయితీ ఉంటుంది. తెలంగాణను గ్రీన్ మొబిలిటీ రంగంలో దేశానికే ఆదర్శంగా నిలుపుతాం. కాలుష్యాన్ని తగ్గించి పర్యావరణాన్ని కాపాడుకోవడానికి ఈవీ వాహనాలు వినియోగించండి. ఈవీ వాహనాలకు బ్రాండ్ అంబాసిడర్ ప్రభుత్వ ఉద్యోగులే ఉంటారు.’ అని మంత్రి పొన్నం వెల్లడించారు.
తెలంగాణ ప్రభుత్వం తీసుకున్న ఈ నిర్ణయం పర్యావరణ పరిరక్షణకు దోహదం చేయడంతో పాటు, ఉద్యోగులకు ఆర్థికంగా కూడా ఊరటనిస్తుందని చెప్పవచ్చు. ఈవీ పాలసీ భవిష్యత్తులో మరిన్ని మార్పులకు దారితీయవచ్చు.


