
📌 Key Points
- తల్లిదండ్రులను నిర్లక్ష్యం చేస్తే ఉద్యోగుల జీతాల్లో 10% కోత విధించే ప్రతిపాదనలు సిద్ధం.
- కేబినెట్ సమావేశంలో ప్రతిపాదన పరిశీలన, ఆమోదం పొందిన తర్వాత సభ ముందుకు.
- కుటుంబ విలువలను కాపాడటం, సీనియర్ సిటిజన్ల గౌరవం ప్రభుత్వ లక్ష్యం.
- చట్టం ఆమోదం పొందితే, తల్లిదండ్రుల సంరక్షణకు జీతం అనుసంధానించిన మొదటి రాష్ట్రం తెలంగాణ కావచ్చు.
తెలంగాణ ప్రభుత్వం సంచలన నిర్ణయం తీసుకోబోతోంది. వృద్ధులైన తల్లిదండ్రులను నిర్లక్ష్యం చేసే ఉద్యోగుల జీతాల్లో కోత విధించేందుకు ప్రభుత్వం కసరత్తు చేస్తోంది. దీనికి సంబంధించిన ప్రతిపాదనలను సిద్ధం చేసింది.
జీతాల్లో కోతకు తెలంగాణ సర్కార్ యోచన
వృద్ధ తల్లిదండ్రులను నిర్లక్ష్యం చేసే ఉద్యోగులకు కోత పడనుంది. ఆ దిశగా తెలంగాణ సర్కార్ కసరత్తు చేస్తోంది. ప్రాథమికంగా ప్రతిపాదనలు సిద్ధమైనట్లు తెలుస్తోంది. 10 శాతం వరకు వేతనాల్లో కోత విధించే అవకాశం ఉందని సమాచారం.
వేతనాల్లో కోత విధించే ప్రతిపాదనను ఇవాళ జరిగే కేబినెట్ సమావేశంలో పరిశీలించే అవకాశం ఉందని సమాచారం. ప్రస్తుతం బడ్జెట్ సమావేశాలు జరుగుతున్నాయి. ఈ నేపథ్యంలో… ఈ ప్రతిపాదనపై నేటి కేబినెట్ భేటీలో చర్చించి… ఓ నిర్ణయం తీసుకోవాలని భావిస్తున్నట్లు తెలుస్తోంది. ఆ తర్వాత సభ ముందుకు తీసుకురావాలని యోచిస్తున్నట్లు సమాచారం.
ఆర్థికంగా సురక్షితమైన కుటుంబాలలో కూడా వృద్ధ తల్లిదండ్రులను నిర్లక్ష్యం చేస్తున్న ఘటనలు వెలుగు చూస్తున్నాయి. కొందరు ఉద్యోగులైతే… వారి తల్లిదండ్రుల విడిచిపెట్టడంతో… అలాంటి వారి పరిస్థితులు ఆందోళనకరంగా మారుతోంది. ఇలాంటి సమస్యలకు చెక్ పెట్టడమే ఈ కొత్త చట్టం లక్ష్యం.
కేబినెట్ భేటీలో కీలక నిర్ణయం!
ఈ చట్టం అమల్లోకి వస్తే… ఉద్యోగుల వృద్ధ తల్లిదండ్రుల జీవితానికి ఎంతో రక్షణ ఉంటుందని ప్రభుత్వం భావిస్తోంది. విఫలమైన ప్రభుత్వ ఉద్యోగులపై చర్యలు తీసుకోవడానికి కూడా అవకాశం ఉంటుంది.
కుటుంబ విలువలను నిలబెట్టడం, సీనియర్ సిటిజన్ల గౌరవాన్ని కాపాడటం యొక్క ప్రాముఖ్యతను నొక్కి చెబుతూ …. ఇటువంటి చర్యను ప్రవేశపెట్టాలనే ప్రభుత్వ ఉద్దేశాన్ని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అనేక సందర్భాల్లో సూచించారు.
కుటుంబ విలువలకు పెద్దపీట
ఈ ప్రతిపాదనను వేగంగా పట్టాలెక్కించాలని ప్రభుత్వం ఆసక్తిగా ఉంది. ప్రస్తుత బడ్జెట్ సమావేశాల్లోనే చట్టాన్ని ఆమోదించడానికి ప్రయత్నించవచ్చని అధికారవర్గాలు సూచిస్తున్నాయి. ఈ ప్రతిపాదనకు ఆమోదం లభిస్తే…. ఉద్యోగుల జీతాలను తల్లిదండ్రుల సంరక్షణ బాధ్యతలతో నేరుగా అనుసంధానించిన మొదటి రాష్ట్రాలలో తెలంగాణ ఒకటిగా అవతరించవచ్చు.
ఈ రోజు జరిగే క్యాబినెట్ సమావేశం తర్వాత ముసాయిదా చట్టం మరియు దాని అమలు యంత్రాంగాలపై మరింత స్పష్టత వచ్చే అవకాశం ఉంది.
ఈ చట్టం అమల్లోకి వస్తే వృద్ధుల జీవితాల్లో వెలుగు నింపినట్టు అవుతుంది. తెలంగాణ ప్రభుత్వం తీసుకునే ఈ నిర్ణయం దేశానికే ఆదర్శంగా నిలుస్తుందని చెప్పవచ్చు.


