|

Andhravilas.net – Breaking News & Movie Buzz Since 2002

breaking: తెలంగాణ యువతకు గుడ్ న్యూస్! డిగ్రీ, పీజీలో సరికొత్త కోర్సులు! ఇక ఉద్యోగాల జాతరే!

Published: 17-03-2026, 11:35 PM
breaking: తెలంగాణ యువతకు గుడ్ న్యూస్! డిగ్రీ, పీజీలో సరికొత్త కోర్సులు! ఇక ఉద్యోగాల జాతరే!
  • తెలంగాణలో డిగ్రీ, పీజీ విద్యార్థుల కోసం 39 కొత్త కోర్సులను ప్రవేశపెట్టాలని ఉన్నత విద్యామండలి నిర్ణయం.
  • 2047 నాటికి నిరుద్యోగ యువతకు ఉపాధి కల్పించడమే లక్ష్యంగా ఈ కోర్సులు రూపొందించబడ్డాయి.
  • సైబర్ సెక్యూరిటీ, డాటా సైన్స్ వంటి ప్రత్యేక కోర్సుల్లో నైపుణ్యం పెంపొందించేందుకు చర్యలు తీసుకుంటున్నారు.
  • ప్రభుత్వ, ప్రైవేటు భాగస్వామ్యంతో 20 లక్షల ఉద్యోగాల కల్పన, యువతకు శిక్షణ ఇవ్వాలని లక్ష్యంగా పెట్టుకున్నారు.

తెలంగాణలోని నిరుద్యోగ యువతకు ఉపాధి కల్పించేందుకు ఉన్నత విద్యామండలి సరికొత్త ప్రణాళికతో ముందుకు వచ్చింది. డిగ్రీ, పీజీ స్థాయిలో 39 కొత్త కోర్సులను ప్రవేశపెట్టడానికి సిద్ధమైంది. తద్వారా యువతకు వెంటనే ఉద్యోగాలు పొందే అవకాశం లభిస్తుంది.

కొత్త కోర్సుల రూపకల్పనలో ఉన్నత విద్యామండలి

తెలంగాణ యువత కోసం ఉన్నత విద్యామండలి ప్రత్యేక ప్రణాళిక రూపొందించింది. ఆధునిక సాంకేతికతకు అనుసంధానం చేస్తూ కొత్త కోర్సులు ప్రవేశపెట్టేందుకు సిద్ధమైంది. ‘

యూజీ అండ్ పీజీ కోర్సెస్ న్యూ అండ్ ఎమెర్జింగ్ ఏరియాస్’ అనే అంశంపై మంగళవారం టి-సాట్ వేదికగా చర్చా కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమంలో తెలంగాణ ఉన్నత విద్యామండలి ఛైర్మన్ ఫ్రొఫెసర్ వి.బాలకిష్టారెడ్డి మాట్లాడారు. ప్రతిపాదించే కొత్త కోర్సులకు సంబంధించిన వివరాలు ప్రకటించారు.

తెలంగాణలోని అండర్ గ్రాడ్యుయేట్ మరియు పోస్టు గ్రాడ్యుయేట్ విద్యార్థుల కోసం సుమారు 39 కోర్సులకు రూపకల్పన చేస్తున్నామన్నారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి విజన్ లో భాగమైన 2047 లక్ష్యాన్ని పూర్తి చేసే ప్రయత్నంలో నిరుద్యోగ యువతకు ఉపాధి కల్పనే లక్ష్యంగా కొత్త కోర్సులను రూపొందించామన్నారు.

ఉపాధి కల్పనే లక్ష్యంగా ప్రత్యేక కోర్సులు

అండర్ గ్రాడ్యుయేట్ విద్యార్థులకు 19 కోర్సులు , పోస్టు గ్రాడ్యుయేట్ విద్యార్థుల కోసం మరో 10 కోర్సులను తక్షణమే ఉపాధి కల్పించేవిగా ఆచరణలోకి తేబోతున్నామని ప్రకటించారు. ఏఈడీపీ (అప్రెంటిస్ ఎనేబుల్డ్ డిగ్రీ ప్రోగ్రామ్స్)లో భాగంగా మరో 10 కోర్సులు ప్రవేశపెడుతున్నామని స్పష్టం చేశారు.

2030 సంవత్సరానికీ మూడు లక్షల కోట్ల రూపాయలు వెచ్చించి పబ్లిక్ అండ్ ప్రయివేటు భాగస్వామ్యంతో తెలంగాణాలోని వివిధ రంగాల్లో 20 లక్షల ఉద్యోగాలు ఏర్పడే అవకాశాలున్నాయని తెలిపారు. ఆ ఉద్యోగాలను సాధించేందుకు తెలంగాణ యువతను సిద్ధం చేయాలన్న లక్ష్యంతో ఉన్నత విద్యామండలి పనిచేస్తుందని బాలకిష్టారెడ్డి వివరించారు. కళాశాలల్లో క్యాలిటీ టీచింగ్, మానిటరింగ్, అకడమిక్ పార్టిసిపేషన్, రీసెర్చ్ తదితర అంశాలను తప్పనిసరిగా పాటించాలని ఛైర్మన్ సూచించారు.

వైస్ ఛైర్మన్ ప్రొఫెసర్ ఎస్.కె.మహమూద్ మాట్లాడుతూ…. సైబర్ క్రైమ్, సైబర్ సెక్యూరిటీ, డాటా సైన్స్ వంటి ప్రత్యేక కోర్సులలో విద్యార్థులకు ప్రత్యేక అవకాశాలు కల్పించే ప్రయత్నంలో భాగంగా యూనివర్సిటీలకు, ఆయా కళాశాలకు తగిన సలహాలు-సూచనలు అందిస్తున్నామన్నారు.

నైపుణ్యంపై ప్రత్యేక దృష్టి సారించాలని సూచన

మండలి మరో వైస్ ఛైర్మన్ ఇటిక్యాల పురుషోత్తం మాట్లాడుతూ విద్యార్థులు కోర్సు పూర్తి చేయడంతో పాటు నైపుణ్యం తప్పని సరిగా ఉండాలని సూచించారు. ఎన్ని ఉన్నత చదువులు చదివినా నైపుణ్యం లేని చదువువల్ల ప్రయోజనం, ఉపాధి రెండూ ఉండవన్నారు.

కార్యదర్శి ప్రొఫెసర్ శ్రీరాం వెంకటేశ్ మాట్లాడుతూ… యూనివర్సిటీ లేదా కళాశాల తాము నిర్వహించే కోర్సులకు సంబంధించి ఖచ్చితంగా ల్యాబ్స్ నిర్వహించాలని సూచించారు. కొత్త కోర్సులు ప్రారంభించి వదిలివేయడమే కాకుండా వాటిపై తప్పని సరిగా తమ వైపు నుండి ప్రత్యేక పర్యవేక్షణ ఉంటుందని స్పష్టం చేశారు.

మొత్తానికి, తెలంగాణలోని నిరుద్యోగ యువతకు ఉపాధి అవకాశాలు మెరుగుపరచడానికి ప్రభుత్వం చేస్తున్న ఈ ప్రయత్నాలు సత్ఫలితాలనివ్వాలని ఆశిద్దాం. నైపుణ్యం కలిగిన విద్యార్థులను తయారు చేయడమే లక్ష్యంగా పెట్టుకున్నారు.

Related News

Plugin developed by ProSEOBlogger
Plugin developed by ProSEOBlogger. Get free Ypl themes.