
📌 Key Points
- తిరుమలలో 80 లగేజీ డిపాజిట్ కౌంటర్లు, 394 మంది సిబ్బందితో నిరంతరాయ సేవలు.
- అలిపిరి, శ్రీవారి మెట్టు మార్గాల్లో ప్రత్యేక లగేజీ డిపాజిట్ కేంద్రాలు ఏర్పాటు.
- ఫేస్ రికగ్నిషన్ టెక్నాలజీతో క్యూఆర్ కోడ్ ద్వారా లగేజీ భద్రత.
- భక్తుల సౌకర్యార్థం కల్యాణకట్ట వద్ద కూడా లగేజీ డిపాజిట్ కేంద్రాలు.
తిరుమల శ్రీవారి దర్శనానికి వచ్చే భక్తులకు టీటీడీ లగేజీ డిపాజిట్ సేవలను విస్తృతంగా అందుబాటులోకి తెచ్చింది. భక్తుల సౌకర్యార్థం అనేక డిపాజిట్, డెలివరీ కేంద్రాలను ఏర్పాటు చేసింది.
తిరుమలలో టీటీడీ లగేజీ సేవల విస్తరణ
శ్రీ వేంకటేశ్వర స్వామివారి దర్శనార్థం తిరుమలకు విచ్చేసే లక్షలాది మంది భక్తులకు సౌకర్యవంతమైన సేవలు అందించేందుకు టీటీడీ విస్తృత స్థాయిలో లగేజీ డిపాజిట్, డెలివరీ కేంద్రాలను ఏర్పాటు చేసి సమర్థవంతంగా నిర్వహిస్తోంది. భక్తులు దర్శనం, సేవలు, కాలినడక యాత్ర సమయంలో తమతో తీసుకువచ్చే లగేజీ, బ్యాగులు, సెల్ ఫోన్లను భద్రంగా ఉంచుకునేందుకు తిరుమలలో, కాలినడక మార్గాల్లో కలిపి మొత్తం 80 కౌంటర్లు ఏర్పాటు చేసి 394 మంది సిబ్బంది మూడు షిఫ్టుల్లో నిరంతరంగా సేవలందిస్తున్నారు.
అలిపిరి, శ్రీవారి మెట్టు కాలినడక మార్గాల ద్వారా తిరుమలకు చేరుకునే భక్తుల కోసం ప్రత్యేక డిపాజిట్ కేంద్రాలు ఏర్పాటు చేశారు.
ఈ కేంద్రాల్లో లగేజీ డిపాజిట్ చేసిన భక్తులు తిరుమలలోని డెలివరీ కేంద్రాల్లో సులభంగా తిరిగి పొందే సౌకర్యాన్ని టీటీడీ కల్పించింది.
కాలినడక మార్గాల్లో ప్రత్యేక డిపాజిట్ కేంద్రాలు
తిరుమలలోని వివిధ ప్రాంతాల్లో భక్తుల కోసం లగేజీ, సెల్ ఫోన్ డిపాజిట్ సౌకర్యం అందుబాటులో ఉంది. ఫ్రీ హాల్ – 10 కౌంటర్లు, 36 సిబ్బంది (17,291 సెల్ ఫోన్లు, 7,793 లగేజీ డిపాజిట్ల సామర్థ్యం). వైకుంఠం క్యూకాంప్లెక్స్– 2 కౌంటర్లు, 6 సిబ్బంది (4,270 సెల్ ఫోన్లు). నారాయణగిరి షెడ్ – 8 కౌంటర్లు, 30 సిబ్బంది (11,941 సెల్ ఫోన్లు, 6,749 లగేజీ డిపాజిట్ల సామర్థ్యం). డీడీ హాల్ – 3 కౌంటర్లు, 20 సిబ్బంది (2,526 సెల్ ఫోన్లు, 324 లగేజీ డిపాజిట్ల సామర్థ్యం). రూ.300 హాల్ – 5 కౌంటర్లు, 27 సిబ్బంది (6,338 సెల్ ఫోన్లు, 1,600 లగేజీ డిపాజిట్ల సామర్థ్యం). వైకుంఠం క్యూకాంప్లెక్స్ అప్ స్కానింగ్ (కంపార్ట్‌మెంట్-03) – 2 కౌంటర్లు, 15 సిబ్బంది ఉంటారు.
తలనీలాలు సమర్పించే భక్తుల సౌకర్యార్థం కల్యాణకట్ట సమీపంలో కూడా ప్రత్యేక కేంద్రాలను టీటీడీ ఏర్పాటు చేసింది.
డిపాజిట్ చేసిన లగేజీని తిరిగి పొందేందుకు కొన్ని డెలివరీ కేంద్రాలు పనిచేస్తున్నాయి: అలిపిరి ఫుట్‌పాత్ డెలివరీ (జీఎన్సీ వద్ద) – 5 కౌంటర్లు, 53 సిబ్బంది (ప్రతి షిఫ్ట్‌లో 18 మంది), 9,345 లగేజీ డిపాజిట్ల సామర్థ్యం ఉంది. శ్రీవారి మెట్టు డెలివరీ(టీబీసీ వద్ద)– 2 కౌంటర్లు, 24 సిబ్బంది (ప్రతి షిఫ్ట్‌లో 8 మంది), 2,482 లగేజీ డిపాజిట్ల సామర్థ్యంతో నిర్వహిస్తున్నారు.
ఆధునిక సాంకేతికతతో లగేజీ భద్రత
టీటీడీ లగేజీ డిపాజిట్ కేంద్రాల్లో భక్తులు తమ లగేజీని డిపాజిట్ చేసే సమయంలో సిబ్బంది ఫేస్ రికగ్నిషన్ టెక్నాలజీ ద్వారా క్యూఆర్ కోడ్ జెనరేటర్ చేసి బ్యాగుపై కోడ్ స్కిక్కర్ వేస్తారు. ఆ తర్వాత లగేజీకి సంబంధించిన సమాచారంతో ఒక స్లిప్ జెనరేట్ చేసి భక్తులకు అందిస్తారు. డిపాజిట్ డెలివరీ సమయంలో డెలివరీ కేంద్రంలో ఆ స్లిప్ సిబ్బందికి చూపితే ఆ నెంబర్ ఆధారంగా లగేజీని సులభంగా గుర్తించి ఒక నిమిషంలోపు లగేజీని భక్తులకు అందిస్తారు.
టీటీడీ కల్పించిన ఈ సేవలను భక్తులు పెద్ద ఎత్తున వినియోగిస్తున్నారు. 2026 జనవరి నెలలో అత్యధికంగా 10,44,268 డిపాజిట్లు నమోదయ్యాయి. 2026 జనవరి 25రథసప్తమి రోజున అత్యధికంగా 1,34,749 డిపాజిట్లు నమోదయ్యాయి. వైకుంఠ ఏకాదశి, గరుడసేవ, రథసప్తమి వంటి ఉత్సవాల సమయంలో భారీగా వినియోగం నమోదవుతోంది.
తిరుమలకు విచ్చేసే భక్తులు తమ వద్ద ఉన్న లగేజీ, బ్యాగులు, సెల్ ఫోన్లను అధికారిక డిపాజిట్ కేంద్రాల్లో భద్రపరచి, టోకెన్ ఆధారంగా తిరిగి పొందాలని టీటీడీ విజ్ఞప్తి చేస్తోంది. టీటీడీ కల్పిస్తున్న ఈ సేవల ద్వారా భక్తులు ఎలాంటి ఆందోళన లేకుండా ప్రశాంతంగా శ్రీ వేంకటేశ్వర స్వామివారి దర్శనం చేసుకునే అవకాశం పొందుతున్నారు.
టీటీడీ అందిస్తున్న ఈ లగేజీ సేవలు భక్తులకు ఎంతో సౌకర్యవంతంగా ఉన్నాయి. సాంకేతిక పరిజ్ఞానాన్ని ఉపయోగించి మరింత భద్రతతో లగేజీని భద్రపరచడం అభినందనీయం.


