
📌 Key Points
- ఇరాన్ దాడులతో హోర్ముజ్ జలసంధి మూసివేత దిశగా అడుగులు.
- భారత్ చమురు దిగుమతుల్లో సగం ఈ జలసంధి నుంచే జరుగుతోంది.
- చమురు ధరలు పెరిగితే దేశంలో అన్ని ఉత్పత్తుల ధరలు పెరిగే అవకాశం ఉంది.
- ప్రస్తుతం 37 భారీ నౌకలు హోర్ముజ్ జలసంధి వద్ద నిలిచిపోయాయి.
ఇజ్రాయెల్, అమెరికా, ఇరాన్ మధ్య జరుగుతున్న యుద్ధం ప్రపంచ దేశాల ఆర్థిక వ్యవస్థలపై తీవ్ర ప్రభావం చూపుతోంది. ముఖ్యంగా చమురు దిగుమతులపై ఆధారపడే భారత్‌కు ఇది పెను సవాలుగా మారింది. ధరలు పెరిగే అవకాశం ఉంది.
హోర్ముజ్ జలసంధి మూసివేతతో ముప్పు?
– యుద్ధం ఎఫెక్ట్‌తో ఇండియాలో ధరలు పెరిగే అవకాశం
– సౌదీ, ఖతర్‌లోని ఆయిల్ కేంద్రాలపై ఇరాన్ దాడులు
– హోర్ముజ్ జలసంధి మూసివేత.. అంతర్జాతీయ మార్కెట్‌లో పెరిగిన ధరలు
ఘోరం.. ఒకేచోట 165 సమాధులు.. ఫోటో షేర్ చేసిన ఇరాన్
గల్ఫ్ దేశాలపై దాడులను ఖండించిన భారత్
ఇజ్రాయెల్-అమెరికా, ఇరాన్ మధ్య జరుగుతున్న యుద్ధం ప్రపంచ దేశాల ఆర్థిక వ్యవస్థలకు పెను సవాళ్లను విసురుతున్నది. దాదాపు 88 శాతం చమురును దిగుమతిని చేసుకునే భారత్‌కు ఇది మరింత తీవ్ర సమస్యగా పరిణమిస్తున్నది. పశ్చిమాసియాలో చీమ చిటుక్కుమన్నా మన చమురు దిగుమతులపై ప్రభావం పడుతుందనే ఆందోళనలు వెలువడుతాయి. అలాంటిది.. ఇజ్రాయెల్, అమెరికా ఉమ్మడిగా ఇరాన్‌పై దాడి చేయడం.. ప్రతీకారంగా ఇరాన్ గల్ఫ్ దేశాలపైనే దాడులకు దిగడం.. భారత్‌తోపాటు ప్రపంచ దేశాల చమురు అవసరాలనూ ముప్పులో పడేస్తున్నాయి. ముఖ్యంగా భారత మొత్తం చమురు దిగుమతుల్లో సగం పశ్చిమాసియా నుంచే.. అదీ హోర్ముజ్ జలసంధి గుండానే మనకు వస్తాయి. తాజాగా హోర్ముజ్ జలసంధిని ఇరాన్‌కు చెందిన ఐఆర్‌జీసీ మూసేస్తున్నట్టు ప్రకటించడంతో భారత్‌కు చమురు కొరత ఏర్పడుతుందని, పెట్రోల్, డీజిల్ ధరలు ఆకాశాన్నంటుతాయన్న ఆందోళనలు వస్తు్న్నాయి. ఇప్పటికే అంతర్జాతీయ చమురు మార్కెట్‌లో చమురు బ్యారెల్ ధర 10 శాతం పెరిగి 80 డాలర్లకు చేరింది. మరోవైపు హోర్ముజ్ జలసంధిని మూసేస్తున్నట్టు ప్రకటన వచ్చిందో.. రాలేదో.. మన దేశానికి చమురుతో వస్తు్న్న 37 భారీ నౌకలు అక్కడే స్ట్రక్ అయినట్టు తెలిసింది.
భారత్‌పై యుద్ధ ప్రభావం ఎంత?
భారత్.. టెన్షన్.. టెన్షన్
మన దేశం చమురు దిగుమతులపైనే ఎక్కువగా ఆధారపడుతుంది. చమురు ధరలు పెరిగితే ప్రతి ఉత్పత్తి, ప్రతి సర్వీసుపై ప్రభావం పడుతుంది. హోర్ముజ్ జలసంధి మూసేస్తే.. మార్కెట్‌లో చమురు పై ఒక డాలర్ పెరిగినా.. మనం ఇతర సుదూర మార్గాల్లో దిగుమతి చేసుకోవాల్సి వస్తే.. మనకు రెట్టింపు ధర అవుతుంది. అందుకే హోర్ముజ్ జలసంధి కీలకం. 2024 చివరి గణాంకాలు చూస్తే.. ఈ జలసంధి నుంచి ప్రతిరోజు మనకు 2.7 మిలియన్ బ్యారెళ్లు ప్రతి రోజుకు దిగుమతి అవుతుండేవి. అంటే మన దేశానికి ప్రతిరోజు అవసరమయ్యే(సుమారు 6 మిలియన్ బ్యారెళ్లు) చమురులో సగం ఇక్కడి నుంచే వస్తున్నట్టు. భారత్ 88 శాతం చమురునే కాదు.. దాదాపు 50 శాతం సహజ వాయువునూ దిగుమతి చేసుకుంటుంది. అందులో దాదాపుగా మొత్తం ఎల్‌పీజీ ఈ జలసంధి గుండానే మనకు వస్తున్నది. 60 శాతం ఎల్ఎన్‌జీ హోర్ముజ్ ద్వారానే(అంతర్జాతీయంగా 20 శాతం చమురు ఈ సంధి గుండానే రవాణా అవుతుంది) మనకు చేరుతున్నది. ఖతర్ నుంచి అత్యధికంగా ఎల్ఎన్‌జీ మనం దిగుమతి చేసుకుంటున్నాం. నిత్యం అత్యధికంగా మనకు ఈ జలసంధి గుండానే వస్తాయి. అందుకే అటు జలసంధి మూసేసే ప్రకటన రాగానే.. అప్పటికే 37 భారత జెండాలతో వస్తు్న్న నౌకలు అక్కడ నిలిచిపోయినట్టు తెలుస్తున్నది. అందుకే భారత్ ఇది వరకే ప్రత్యామ్నాయాల కోసం అన్వేషణ మొదలుపెట్టిందని, ధరాఘాతాన్ని ఎదుర్కోవడానికి చర్యలు మొదలుపెట్టినట్టు సమాచారం.
పెట్రోల్, గ్యాస్ ధరలు భగ్గు?
హోర్ముజ్ జలసంధిని మూసేయడంతో తక్షణమే మనకు చమురు కొరత ఏర్పడకపోవచ్చు. సుమారు ఆరు వారాలకు సరిపడా నిల్వలున్నాయని తెలుస్తున్నది. అయితే, ధరలు పెరిగే అవకాశమున్నదని నిపుణులు చెబుతున్నారు. ఒకవేళ హోర్ముజ్ జలసంధిని దీర్ఘకాలం మూసేస్తే.. నెలల తరబడి ఇక్కడి నుంచి రాకపోకలు నిలిపేస్తే కొరత ఏర్పడటమే కాకుండా ధరలు అమాంతం పెరగొచ్చు. ఎందుకంటే భారత్ సగం చమురు అవసరాలను ఈ సంధి గుండానే తీర్చుకుంటున్నది. అలాగే.. హోర్ముజ్ నుంచే మనకు సింహభాగం ఎల్ఎన్‌జీ, ఎల్‌పీజీ వస్తుండటంతో పెట్రోల్, డీజిల్, వాహనాలకు అవసరమైన గ్యాస్‌తోపాటు.. వంటచెరుకుగా ఉపయోగించే ఎల్‌పీజీ గ్యాస్ ధరలు ఆకాశాన్ని చేరే ముప్పు ఉంటుంది.
మనకు సరిపడా నిల్వలున్నాయి: కేంద్రమంత్రి
మనకు ఇంధన నిల్వలున్నాయని, సరఫరాల్లో అంతరాయం కలగకుండా అవసరమైన చర్యలు తీసుకుంటున్నామని కేంద్ర పెట్రోలియం శాఖ మంత్రి హర్దీప్ సింగ్ పూరి మంగళవారం వెల్లడించారు. మిడిల్ ఈస్ట్ ప్రాంతంలో భౌగోళిక రాజకీయ పరిస్థితులు ఎలా ఉన్నా, దేశ ప్రజల ఇంధన అవసరాలను తీర్చేలా నరేంద్ర మోడీ ప్రభుత్వం ముందస్తు ప్రణాళికలతో పనిచేస్తోందన్నారు. దేశవ్యాప్తంగా పెట్రోలియం ఉత్పత్తుల నిల్వలను, సరఫరాను 24 గంటలూ పర్యవేక్షించడానికి ఒక ప్రత్యేక కంట్రోల్ రూమ్‌ను ఏర్పాటు చేసినట్లు కూడా వెల్లడించారు. గత కొన్నేళ్లుగా భారత్ చమురు దిగుమతులకు ఒకట్రెండు దేశాలపై ఆధారపడటం లేదు. చాలా దేశాల నుంచి దిగుమతి చేసుకున్నదని వివరించారు. కాబట్టి, ఒక రీజియన్‌లో ఉద్రిక్తతలు నెలకొన్నా వేర్వేరు చోట్ల నుంచి దిగుమతి చేసుకుని దేశ అవసరాలను తీర్చుకోవచ్చని తెలిపారు. ప్రస్తుతం మన దగ్గర కనీసం 40 నుంచి 45 రోజులకు సరిపడా చమురు నిల్వలున్నట్టు సమాచారం.
చమురు ధరలు పెరిగితే ఏమి జరుగుతుంది?
రష్యా నుంచి మళ్లీ కొనుగోళ్లు?
ఈ యుద్ధం మరో నాలుగు వారాలు కొనసాగవచ్చని అమెరికా అధ్యక్షుడు సూత్రప్రాయంగా వెల్లడించారు. బఫర్ స్టోరేజీ పెట్టుకున్న దేశాలకు ఈ విషయం కొంత ఉపశమనమే ఇస్తుంది గానీ.. ఒక వేళ అంతకు మించి పొడిగితే పరిస్థితి ఏమిటనే ఆందోళనలున్నాయి. భారత్ కూడా ఇదే ఆందోళనలతో ప్రత్యామ్నాయాలపై ఫోకస్ పెట్టింది. ఈ నేపథ్యంలోనే రష్యా నుంచి చమురు కొనుగోళ్లు పునరుద్ధరించవచ్చని తెలుస్తు్నది. ఈ మేరకు రష్యా నుంచి కూడా గ్రీన్ సిగ్నల్ అందినట్టు కీలకవర్గాలు వెల్లడించాయి. అమెరికా సుప్రీంకోర్టు టారిఫ్‌లను కొట్టేయడం.. ట్రేడ్ డీల్ మధ్యలో నిలిచిపోవడంతో ట్రంప్ ఆంక్షలను పక్కనపెట్టి రష్యా చమురు మళ్లీ కొనుగోలు చేయవచ్చనే సంకేతాలు వస్తున్నాయి. రష్యాతోపాటు వెనిజులా, అమెరికా, వెస్ట్ ఆఫ్రికా, లాటిన్ దేశాల నుంచీ చమురు దిగుమతులు పెంచుకునే అవకాశాలున్నాయి.
ఒక్క బొట్టు కూడా బయటకు వెళ్లనివ్వం
హొర్ముజ్ జలసంధిని మూసేస్తున్నట్టు ఇరాన్‌కు చెందిన ఇస్లామిక్ రివల్యూషనరీ గార్డ్ కార్ప్స్(ఐఆర్‌జీసీ) ప్రకటించింది. ఈ రీజియన్ నుంచి ఒక్క చమురు బొట్టు కూడా బయటకుపోదని, తమను కాదని ఏ ఒక్క నౌక జలసంధి గుండా ప్రయాణానికి సాహసించిన పేల్చేస్తామని ఐఆర్‌జీసీ అడ్వైజర్ బ్రిగేడియ్ జనరల్ సర్దార్ ఇబ్రహిం జబ్బారి వార్నింగ్ ఇచ్చారు. ‘మా దేశంలోని ముఖ్యమైన కేంద్రాలను మీరు టార్గెట్ చేస్తే.. ఈ రీజియన్‌లోని అన్ని ఆర్థిక కేంద్రాలను ధ్వంసం చేస్తాం. హోర్ముజ్ జలసంధిని మూసేశాం. ప్రస్తుతం చమురు ధర బ్యారెల్ 80 డాలర్లకు పెరిగింది. త్వరలోనే ఇది 200 డాలర్లకు పెరుగుతుంది’ అని స్పష్టం చేశారు. ఇది వరకే 10 శాతం చమురు ధర పెరిగే 80 డాలర్లకు పెరిగింది. ఇది మూడు రెట్లకూ పెరగొచ్చని తాజాగా హెచ్చరించారు.
రిఫైనరీలపైనా ఇరాన్ దాడులు
తొలుత గల్ఫ్‌లోని అమెరికా బేస్‌లపై దాడులకే పరిమితమైన ఇరాన్.. ఈ దాడులను విస్తృతం చేసింది. ఎంబసీలతోపాటు అమెరికాకు మిత్రపక్షాలుగా ఉన్న గల్ఫ్ దేశాల ఆయిల్ రిఫైనరీలు, గ్యాస్ ఇండస్ట్రీ సిటీలనూ లక్ష్యంగా చేసుకుంది. సౌదీ అరేబియాలోని రాస్ తనూరా ఆయిల్ రిఫైనరీపై ఇరాన్ డ్రోన్లు ప్రయోగించింది. దీంతో ఈ రిఫైనరీని సౌదీ తాత్కాలికంగా నిలిపేసింది. ఖతర్ ప్రపంచంలోనే అతిపెద్ద ఎల్ఎన్‌జీ ఎక్స్‌పోర్టర్. ఈ దేశంపైనా డ్రోన్లు పడటంతో రాస్ లాఫన్ ఇండస్ట్రియల్ సిటీ, మసాయిద్ ఇండస్ట్రియల్ సిటీల్లో ఉత్పత్తిని నిలిపేసింది. దీంతో ప్రపంచవ్యాప్తంగా ఎల్ఎన్‌జీ నిల్వలపై ప్రభావం పడుతున్నది. ఇది వరకే యూరప్‌లో ఎల్ఎన్‌జీ ధరలు పెరిగాయి.
హోర్ముజ్ జలసంధి మూసివేస్తే చమురు దిగుమతులపై తీవ్ర ప్రభావం పడుతుంది. ఇది దేశ ఆర్థిక వ్యవస్థను కుదిపేసే ప్రమాదం ఉంది. ప్రభుత్వం తక్షణమే చర్యలు తీసుకోవాలి.


