
📌 Key Points
- ప్రపంచవ్యాప్తంగా సంపద కొద్దిమంది చేతుల్లో కేంద్రీకృతం కావడం ప్రజల కొనుగోలు శక్తిని తగ్గిస్తుంది.
- ప్రభుత్వం ప్రజల ఆదాయాలు పెంచే విధంగా చర్యలు తీసుకుంటే ఆర్థిక వ్యవస్థ బలపడుతుంది.
- నూతన ఆర్థిక విధానాల తర్వాత మనదేశంలో బిలియనీర్ల సంఖ్య భారీగా పెరిగింది.
- దేశంలో బిలీనియర్ల సంఖ్య పెరిగే కొలది ఆదాయ సమానతలు విపరీతంగా పెరిగిపోతున్నాయి.
ప్రపంచవ్యాప్తంగా సంపద కొద్దిమంది వ్యక్తుల చేతుల్లో కేంద్రీకృతమై ఉండటం వల్ల ఆర్థిక అసమానతలు పెరుగుతున్నాయి. ఇది ఆర్థిక మాంద్యానికి దారితీసే అవకాశం ఉంది. దీని నివారణకు ప్రభుత్వం ప్రజల ఆదాయాలు పెంచే విధంగా చర్యలు తీసుకోవాలి.
సంపద కేంద్రీకరణ – ఆర్థిక మాంద్యం
ప్రపంచ దేశాలన్నింటిలోనూ సంపద కొంతమంది చేతుల్లో ఎన్నడూ లేని విధంగా కేంద్రీకరణ జరిగింది. సంపద కొంతమంది చేతుల్లో కేంద్రీకృతం అయితే ప్రజల ఆదాయాలు తగ్గి కొనుగోలు శక్తి పడిపోతుంది. దీంతో మార్కెట్‌లో డిమాండ్ తగ్గి ఉత్పత్తులు అమ్ముడుపోవు.. పెట్టుబడులు తగ్గి నిరుద్యోగం పెరుగుతుంది. ప్రజల ఆదాయాలు ముఖ్యంగా తగ్గి పేదరికంలోకి పోయే పరిస్థితి.
నిజానికి వీరి అభివృద్ధి లేనిదే వారికి ఆదాయాలు అందనిదే ఆర్థిక వ్యవస్థ బతికి బట్ట కట్టలేదు. అందువల్ల ప్రభుత్వం జోక్యం చేసుకుని ప్రజల ఆదాయాలు పెంచే విధంగా, అసమానతలు తగ్గే విధంగా ఉద్యోగ అవకాశాలు పెంచితే ఆర్థిక వ్యవస్థ బలపడుతుంది.
1930లలో ఆర్థిక మాంద్యం సమయంలో కీన్స్, ప్రపంచ దేశాలు ఈ మాంద్యం నుండి బయటపడేందుకు ప్రజల కొనుగోలు శక్తి పెంచాలని సూచించాడు. ప్రభుత్వం ఉపాధి కల్పించి ప్రజల ఆదాయాలు పెంచితేనే ఆర్థిక వ్యవస్థలో ఎఫెక్టివ్ డిమాండ్ పెరిగి మాంద్యం తగ్గుతుందని చెప్పాడు. ఈ కినీషియన్ విధానాల ప్రకారం ప్రభుత్వ ఖర్చులు, ముఖ్యంగా సైనిక వ్యయం పెంచడంతో అనేక దేశాలు ఆర్థిక మాంద్యం నుంచి బయటపడ్డాయి. కానీ నేడు ఈ విధానాల నుండి పాలకులు నయా ఉదారవాద విధానాల వైపు మళ్లిన తర్వాత సమాజంలో అసమానతలు సంపద కేంద్రీకరణ జరిగి కార్మికులను దారిద్రం లోకి నెట్టివేసినారు. ప్రపంచ దేశాలన్నీ నేడు ఆర్థిక మాంద్యంలోకి పోయే పరిస్థితి ఏర్పడింది. జాతీయ ఆదాయాలలో కార్మికుల వాటా గణనీయంగా తగ్గిపోయింది. గుత్త పెట్టుబడిదారుల సంఖ్య మాత్రం భారీగా పెరిగిపోతోంది. ముఖ్యంగా నూతన ఆర్థిక విధానాలు చేపట్టిన తర్వాత మనదేశంలో ఒక్కరిగా ఉన్న బిలినియర్, నేడు 350కి పెరిగిపోయారు.. ఆర్థిక సంస్కరణల ప్రయోజనాలను కొందరు పారిశ్రామికవేత్తలు పొందుతున్న తీరు అందుకు పాలకులు సహకరిస్తున్న విధానం కారణంగా సంపన్నులు మరింత సంపన్నులు అవుతున్నారు. ముఖ్యంగా కార్పొరేట్లకు పన్నుల విధానం వలన ప్రభుత్వ ఆదాయానికి భారీగా నష్టం అవుతున్నది.
ప్రభుత్వ జోక్యంతోనే పరిష్కారం
దేశంలో బిలీనియర్ల సంఖ్య పెరిగే కొలది ఆదాయ సమానతలు విపరీతంగా పెరిగి ప్రజలపై ప్రభుత్వాలు చేసే అణిచివేత ధోరణలు విపరీతంగా పెరిగిపోతున్నాయి. ఈ 350 మంది నయా కుబేరుల సంపద జాతీయ ఆదాయం పెరుగుదలలో 25 శాతంగా ఉంది. దేశం తలసరి ఆదాయం ప్రస్తుతం మూడు వేల డాలర్లు ఉండగా, ఉన్నత ఆదాయ వర్గాలపై భాగంలో ఉన్న 10 శాతం ధనికుల తలసరి ఆదాయం 14 వేల మిలియన్ డాలర్లుగా ఉంది. ఇలా పేదలకు ధనికులకు మధ్య ఆర్థిక అసమానతలు ఎన్నడూ లేని విధంగా పెరిగిపోయాయి. దేశంలో తీవ్రమైన ఆర్థిక అసమానతలు పెరిగాయి. టాప్ 10% ప్రజల వద్ద 77% సంపద ఉండగా, కింది 50% ప్రజల వద్ద కేవలం 4.1% మాత్రమే ఉంది. Oxfam నివేదిక ప్రకారం 2022–23లో 1% ప్రజలు 22.3% జాతీయ ఆదాయాన్ని పొందారు. ఇది ఒకప్పటి రాచరిక వ్యవస్థలో అసమానతల కంటే ఎక్కువ. ఈ అసమానతలు ప్రజా శ్రేయస్సును దెబ్బతీస్తున్నాయి. వరల్డ్ ఎకనామిక్ ఫోరం సమావేశంలో 24 దేశాల 400 మంది ధనవంతులు తమపై ఎక్కువ పన్నులు విధించాలని కూడా కోరారు. ప్రజలకు చెందాల్సిన వనరులు కొద్ది మందికి వెళ్లడం వల్ల సంపద కేంద్రీకరణ పెరిగి సామాజిక- ఆర్థిక సమస్యలు తీవ్రం అవుతున్నాయి. దేశంలో అసమానతలను, దోపిడీని రూపుమాపేందుకు పుట్టిన మావోయిస్టు పార్టీని ఆపరేషన్ కగార్‌తో నామరూపాలు లేకుండా చేస్తున్నారు.
బ్రిటిష్ పాలన తర్వాత దేశంలో సంపద కొద్దిమంది బిలియనీర్ల చేతుల్లో కేంద్రీకృతమైందని విమర్శలు ఉన్నాయి. 25% ధనికుల వద్ద సుమారు 80% భూమి ఉండగా, 41% రైతులకు భూమి లేదు. 1997–2022 మధ్య సుమారు మూడు లక్షల రైతులు ఆత్మహత్యలు చేసుకున్నారు. ఈ పరిస్థితుల్లో యువత వలసలు పెరిగాయి, రైతు వ్యతిరేక విధానాలపై ఎన్నికల్లో కూడా అసంతృప్తి వ్యక్తమైంది. 1960–70లతో పోలిస్తే నేడు అసమానతలు మరింత పెరిగాయని చర్చ జరుగుతోంది. కుబేరుల అండదండలతో మేము పాలకులుగా ఉండాలని ప్రజా హక్కుల పోరాటాన్ని అణగదొక్కుతూ ప్రమాదంలోకి పడవేస్తున్నారు పాలకులు.. కాబట్టి ప్రజా హక్కులు, సమాన అవకాశాలు, ఆర్థిక న్యాయం కోసం ప్రజా ఉద్యమాలు అవసరమనే అభి ప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.
పెరుగుతున్న బిలియనీర్లు – అసమానతలు
-డాక్టర్ ఎనుగొండ నాగరాజ నాయుడు
రిటైర్డ్ ప్రిన్సిపాల్ గవర్నమెంట్ డిగ్రీ కాలేజ్
దేశంలో సంపద కొద్దిమంది చేతుల్లో కేంద్రీకృతం కావడం ఆందోళన కలిగిస్తుంది. ప్రభుత్వం సరైన చర్యలు తీసుకోవడం ద్వారా ఆర్థిక అసమానతలు తగ్గించవచ్చు. పేద ప్రజల అభివృద్ధికి పాటుపడాలి.


