|

Andhravilas.net – Breaking News & Movie Buzz Since 2002

అమెజాన్ అగ్నిగుండం: అమెరికాలో కార్మిక తిరుగుబాటు వెనుక అసలేం జరుగుతోంది?

Published: 14-04-2026, 6:00 PM
అమెజాన్ అగ్నిగుండం: అమెరికాలో కార్మిక తిరుగుబాటు వెనుక అసలేం జరుగుతోంది?
  • అమెజాన్‌లో కార్మికుల వేతనాలు, పని పరిస్థితులపై పోరాటం తీవ్రమవుతోంది.
  • కార్మికులకు అనుకూలంగా అమెజాన్‌కు వ్యతిరేకంగా ‘నేషనల్ లేబర్ రిలేషన్స్ బోర్డు’ ఆదేశాలు జారీ చేసింది.
  • కార్మిక సంఘం ‘అమెజాన్ లేబర్ యూనియన్’ (ALU) ఏర్పాటు కార్మిక ఉద్యమంలో ఒక మైలురాయి.
  • ఒరెగాన్‌లో కార్మికుడు మరణించినా పని కొనసాగించమని అమెజాన్ ఆదేశించడం వివాదాస్పదమైంది.

అమెరికాలో అమెజాన్ సంస్థ కార్మిక సంక్షోభాన్ని ఎదుర్కొంటోంది. కార్మికుల వేతనాలు, పని పరిస్థితులపై తీవ్ర అసంతృప్తి నెలకొంది. దీనికి తోడు కార్మిక సంఘాలు అమెజాన్ విధానాలను వ్యతిరేకిస్తూ ఆందోళనలు చేపట్టాయి.

అమెజాన్‌లో కార్మిక సంక్షోభం ఎందుకు?

ప్రపంచంలోనే అతిపెద్ద ఈ-కామర్స్ దిగ్గజం అమెజాన్, ప్రస్తుతం అమెరికాలో తీవ్ర కార్మిక సంక్షోభాన్ని ఎదుర్కొంటోంది. ఏళ్ల తరబడి కొనసాగుతున్న కార్మికుల వేతనాలు, పని వాతావరణం, పని వేళలు, సిబ్బంది నియామకం వంటి అంశాలు ప్రస్తుతం అమెరికాలో తీవ్ర ఆందోళనకు, పోరాటాలకు దారితీశాయి. ఈ పోరాటంలో భాగంగా, ఏప్రిల్ 2న ‘నేషనల్ లేబర్ రిలేషన్స్ బోర్డు’ (NLRB) చారిత్రక ఆదేశాన్ని జారీ చేస్తూ.. అమెజాన్ తన JFK8 గిడ్డంగి యూనియన్‌ను గుర్తించి ద్వైపాక్షిక చర్చలు జరపాలని ఆదేశించింది. అయితే, ఈ తీర్పును అమలు చేయకుండా అమెజాన్ యాజమాన్యం నేరుగా NLRB సంస్థనే రాజ్యాంగ వ్యతిరేకమని ఫెడరల్ కోర్టులో వ్యాజ్యం దాఖలు చేసి, చట్టపరమైన లూప్ హోల్స్ అడ్డం పెట్టుకొని కాలయాపన చేస్తోంది.

కార్మిక ఉద్యమ ఆవిర్భావం – ఒక చారిత్రక ప్రస్థానం

ఈ కార్మిక పోరాట చరిత్రను పరిశీలిస్తే, 2021 ఏప్రిల్ 20న క్రిస్ స్మాల్స్ నేతృత్వంలో ‘అమెజాన్ లేబర్ యూనియన్’ (ALU) స్థాపన ఒక కీలక మలుపు. అంతకుముందు అలబామాలో జరిగిన యూనియన్ ప్రయత్నాలు విఫలమైనా, 2022 ఏప్రిల్ 1న న్యూయార్క్‌లోని స్టేటన్ ఐలాండ్ (JFK8) గిడ్డంగిలో ALU చారిత్రాత్మక విజయాన్ని నమోదు చేసింది. సుమారు 8,000 మంది కార్మికులు ఉన్న ఆ గిడ్డంగిలో 2,654 మంది యూనియన్‌కు అనుకూలంగా ఓటు వేయడం, అమెజాన్ 27 ఏళ్ల చరిత్రలో తొలి యూనియన్ విజయం. అప్పటి నుండి యాజమాన్యం 25కు పైగా అభ్యంతరాలు వ్యక్తం చేసినా, NLRB వాటిని తిరస్కరిస్తూ వచ్చింది. 2024లో ALU, అంతర్జాతీయ స్థాయి ‘టీమ్‌స్టర్స్’ (International Brotherhood of Teamsters) యూనియన్‌తో చేతులు కలిపి.. శక్తివంతమైన కార్మిక యూనియన్ ‘ALU-IBT Local 1’గా అవతరించింది.

కార్మిక ఉద్యమాల ఆవిర్భావం – ఒక ప్రస్థానం

ఒరెగాన్ గిడ్డంగి విషాదం – అమెజాన్ తీరుపై విమర్శలు

ఈ ఉద్రిక్తతల మధ్య.. ఇటీవల ఒరెగాన్ రాష్ట్రంలోని ట్రౌట్‌డేల్ (PDX9) గిడ్డంగిలో జరిగిన ఒక విషాదకరమైన ఘటన ప్రపంచవ్యాప్తంగా విమర్శలకు దారితీసింది. ఏప్రిల్ 6న ఒక 46 ఏళ్ల కార్మికుడు పని ఒత్తిడి వల్ల కుప్పకూలి మరణించాడు. అయితే, ఆ వ్యక్తి మృతదేహం గంటకు పైగా అక్కడే ఉన్నప్పటికీ, ఇతర ఉద్యోగులను శవాన్ని పట్టించుకోకుండా, పని కొనసాగించమని యాజమాన్యం ఆదేశించిందనే వార్తలు ఏప్రిల్ 13న వెలుగులోకి వచ్చాయి. కార్మికుని ప్రాణం విషయంలో యాజమాన్యం నిర్లక్ష్యంగా వ్యవహరించిందని ఉద్యోగులు ఆరోపిస్తున్నారు. దీనిపై అమెజాన్ స్పందిస్తూ.. కార్మికుని మరణాన్ని ధృవీకరించినప్పటికీ, పనిని కొనసాగించమని తాము బలవంతం చేశామన్న ఆరోపణలను మాత్రం తీవ్రంగా ఖండించింది.

ఈ నేపథ్యంలో.. వివిధ ప్రాంతాల్లో కార్మికులు నిరసన పోరాటాలు చేస్తున్నట్టు సమాచారం. అంతేకాదు అమెజాన్ వ్యవహారశైలికి విసిగిపోయిన కార్మికులు గిడ్డంగులకు నిప్పు పెడుతున్న వార్తలు వైరల్ అవుతున్నాయి. గత మూడు రోజుల్లో 5 నుంచి 11 అమెజాన్ గిడ్డంగులు నిప్పులకు ఆహుతయ్యాయని, గిడ్డంగులకు స్వయంగా కార్మికులే నిప్పు పెట్టారని కొన్ని వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. అయితే అవన్నీ అవాస్తవాలని అమెజాన్ కొట్టి పారేసింది.

ఒరెగాన్ గిడ్డంగి విషాదం – అమెజాన్ తీరుపై విమర్శలు

కార్మిక శక్తి vs కార్పొరేట్ అహంకారం

అమెజాన్ కార్మికులు మెరుగైన వేతనాలు, పని సమయం, తగినంత సిబ్బంది నియమకాల కోసం చేస్తున్న పోరాటం అక్షరాలా నిజం. అయితే, అమెజాన్ వంటి శక్తివంతమైన కంపెనీతో పోరాడి వారి హక్కులు గెలవడం అతిపెద్ద సవాలుగా నిలుస్తోంది. అమెజాన్ చరిత్రలో ఇటువంటి కార్మిక సంఘటిత శక్తిని చూడటం ఇదే మొదటిసారైనా, యాజమాన్యం దీనిని అడ్డుకోవడానికి చేస్తున్న ప్రయత్నాలు ఆ సంస్థలోని అంతర్గత విభేదాలను, ఒత్తిడిని ప్రపంచానికి చాటిచెబుతున్నాయి. కార్మికుల హక్కులను, గౌరవాన్ని గుర్తించినప్పుడే ఇటువంటి అశాంతికి తెరపడుతుందని నిపుణులు అభిప్రాయపడుతున్నారు.

అమెజాన్‌లో కార్మిక సమస్యలు పరిష్కారం కాకపోతే భవిష్యత్తులో మరిన్ని పోరాటాలు జరిగే అవకాశం ఉంది. కార్మికుల హక్కుల కోసం పోరాటం కొనసాగించాల్సిన అవసరం ఉంది.

Related News

Plugin developed by ProSEOBlogger
Plugin developed by ProSEOBlogger. Get free Ypl themes.