
ఫ్యాషన్ ప్రపంచంలో నిత్యం ఎన్నో కొత్త ప్రయోగాలు చూస్తుంటాం. కానీ, నైజీరియాలో జరిగిన ఒక అవార్డుల ప్రదానోత్సవంలో ఒక నటి వేసుకొచ్చిన డ్రెస్ మాత్రం అందరినీ విస్మయానికి గురిచేసింది. ఏకంగా 500 బ్రెడ్లతో తయారు చేసిన గౌనును ధరించి రెడ్ కార్పెట్‌పై నడిచి అందరి దృష్టిని తనవైపు తిప్పుకుంది ప్రముఖ రియాలిటీ టీవీ స్టార్ ‘క్వీన్ మెర్సీ అటాంగ్’. ఆఫ్రికా ఖండంలోనే అతిపెద్ద సినిమా, ఫ్యాషన్ వేడుకగా భావించే ‘ఆఫ్రికా మ్యాజిక్ వ్యూయర్స్ ఛాయిస్ అవార్డ్స్’ (AMVCA) 12వ ఎడిషన్ వేడుకలు లాగోస్‌లోని ఎకో హోటల్ అండ్ సూట్స్‌లో అట్టహాసంగా జరిగాయి. సినీ ప్రముఖులు, క్రియేటర్లు ఎవరికి వారు వినూత్నమైన, ఆకర్షణీయమైన దుస్తుల్లో ఈ వేడుకకు హాజరయ్యారు. అయితే, వీటన్నింటిలో క్వీన్ మెర్సీ అటాంగ్ ధరించిన ‘బ్రెడ్ డ్రెస్’ ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది.
క్వీన్ మెర్సీ అటాంగ్ రెడ్ కార్పెట్ మీదకు వస్తున్నప్పుడు ఇద్దరు మహిళలు బ్రెడ్ ట్రేలు పట్టుకుని ఆమెకు ఇరువైపులా నడిచారు. భారీగా ఉన్న ఆ డ్రెస్‌తో ఆమె సులభంగా నడవలేకపోవడంతో, దానిని మోయడానికి పలువురు సహాయకులు కూడా ఆమె వెంట రావడం విశేషం. ఇంతకీ ఆమె ఈ వింత డ్రెస్ ఎందుకు ధరించారంటే.. తన బేకరీ వ్యాపారాన్ని ప్రమోట్ చేసుకోవడం కోసమే.. ఈ సందర్భంగా ఆమె మీడియాతో మాట్లాడుతూ.. ‘నా బిజినెస్‌ను ప్రమోట్ చేసుకోవడానికి ఇంతకంటే ఉత్తమమైన వేదిక ఏముంటుంది?’ అని అన్నారు. కేవలం అందరి దృష్టిని ఆకర్షించాలనే ఉద్దేశంతో కాకుండా, కావాలనే పక్కా ప్లానింగ్‌తో తన బ్రాండ్ మార్కెటింగ్ కోసం ఈ నిర్ణయం తీసుకున్నట్లు ఆమె స్పష్టం చేశారు. ప్రస్తుతం ఈ బ్రెడ్ డ్రెస్‌కు సంబంధించిన ఫోటోలు, వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి.
A post shared by Tiannah Styling (@tiannahsplacempire)


