
📌 Key Points
- రేఖ వేదవ్యాస్ ఒకప్పుడు స్టార్ హీరోయిన్, ఆనందం సినిమాతో మంచి గుర్తింపు తెచ్చుకుంది.
- ఆరోగ్యం సరిగా లేకపోవడంతో సినిమాలకు దూరమయ్యానని రేఖ తెలిపారు.
- జీవిత భాగస్వామి లేకపోవడం వల్ల ఒంటరిగా బాధపడుతున్నానని రేఖ ఆవేదన వ్యక్తం చేసింది.
- సరైన వ్యక్తి కోసం ఎదురు చూస్తున్నానని, తొందరపడి తప్పు నిర్ణయం తీసుకోకూడదని ఆమె అన్నారు.
ఒకప్పుడు టాలీవుడ్ లో స్టార్ హీరోయిన్ గా వెలుగొందిన రేఖా వేదవ్యాస్ ప్రస్తుతం ఒంటరిగా జీవితం గడుపుతున్నారు. ఆరోగ్య సమస్యలతో బాధపడుతూ, తోడు కావాలని కోరుకుంటూ ఆమె చేసిన వ్యాఖ్యలు వైరల్ అవుతున్నాయి.
ఒకప్పటి స్టార్ హీరోయిన్ రేఖా వేదవ్యాస్
Tollywood:సినిమా ఇండస్ట్రీలో ఎప్పుడు ఎవరి పరిస్థితి ఎలా ఉంటుందో చెప్పడం అసాధ్యం.. ఒకప్పుడు తమ అందంతో , అభినయంతో అలరించిన హీరోయిన్లు ఆ తర్వాత గుర్తుపట్టలేనంతగా మారిపోయి అందరినీ ఆశ్చర్యపరుస్తున్నారు. ఇంకొంతమంది సెకండ్ ఇన్నింగ్స్ లో కూడా వరుస సినిమాలు చేస్తూ దూసుకుపోతున్నారు. అయితే ఇక్కడ ఒక హీరోయిన్ మాత్రం తనను ఎవరూ పట్టించుకోవడంలేదని, తనకు ఒక తోడు కావాలి అంటూ చేసిన కామెంట్లు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. మరి ఆమె ఎవరో ఇప్పుడు చూద్దాం.
సౌత్ సినీ ఇండస్ట్రీలో తన అందం, అభినయంతో ప్రేక్షకుల గుండెల్లో ఆరాధ్య దేవతగా పేరు దక్కించుకున్న రేఖా వేదవ్యాస్ గురించి ప్రత్యేకంగా చెప్పుకోవాలి. 2001లో విడుదలైన ‘ఆనందం’ సినిమాతో తెలుగు తెరకు పరిచయమైన ఈమె.. తొలి చిత్రంతోనే మంచి గుర్తింపు దక్కించుకుంది. శ్రీను వైట్ల దర్శకత్వంలో వచ్చిన ఈ సినిమా తర్వాత తెలుగు, కన్నడ, తమిళ భాషల్లో వరుస అవకాశాలు అందించింది. ప్రధానంగా కన్నడ సినీ పరిశ్రమలో స్టార్ హీరోయిన్ గా ఎదిగి సుమారుగా 30కి పైగా చిత్రాలలో నటించిన రేఖ.. సినిమా రంగంలో బిజీగా ఉన్న సమయంలోనే అనూహ్యంగా ఇండస్ట్రీకి దూరం కావడం అభిమానులను ఆశ్చర్యానికి గురి చేసింది. మధ్యలో ఒక ఇంటర్వ్యూలో పాల్గొని బక్క చిక్కిపోయి గుర్తుపట్టలేనంతగా మారిపోయిందని ఆశ్చర్యపరిచింది. అయితే ఇప్పుడు ఒక ఇంటర్వ్యూలో పాల్గొన్న ఈమె గత కొన్ని సంవత్సరాలుగా అనారోగ్య సమస్యలు బాధిస్తున్నాయని , శారీరకంగానే కాకుండా మానసికంగా కూడా ఇబ్బందులు ఎదురవుతున్నాయని చెప్పుకొచ్చింది.
ఆరోగ్య సమస్యలతో బాధపడుతున్న రేఖ
ఇక ఇదే విషయంపై రేఖ మాట్లాడుతూ..” గత కొంతకాలంగా శారీరకంగా, మానసికంగా కృంగిపోయాను. ఆరోగ్యం బాగా సరిగ్గా లేకపోవడంతోనే సినిమాలకు కూడా దూరమయ్యాను. ఒక దశలో ఫోటోషూట్ చేయించి సినిమాల్లోకి రీ ఎంట్రీ ఇవ్వాలనుకున్నప్పటికీ ఆరోగ్య పరిస్థితి సహకరించలేదు. సినిమాలలో వరుసగా చాన్సులు అందుకుంటున్న సమయంలో వివాహంపై పెద్దగా ఆసక్తి లేదు.. కానీ వయసు పెరుగుతున్న కొద్దీ జీవిత భాగస్వామి అవసరం అనిపించింది. అయితే నా ఆరోగ్య పరిస్థితిని చూసి సంబంధాలు కూడా రాకపోవడం బాధ కలిగించింది. తొందరపడి తప్పు నిర్ణయం తీసుకోవడం కంటే ఆలస్యమైనా సరే సరైన వ్యక్తి రావాలని కోరుకుంటున్నాను. బయటకి సినిమా జీవితాలు రంగుల మయంగా కనిపించినా వ్యక్తిగతంగా ఎన్నో కష్టాలు, ఒంటరితనం ఉంటుంది” అంటూ ఆమె కంటతడి పెట్టుకుంటూ ఎమోషనల్ అయింది. మొత్తానికైతే తనకు తోడు కావాలి అని చెప్పిన ఈ ముద్దుగుమ్మకి మళ్లీ సరైన తోడు ఎప్పుడు దొరుకుతుందో చూడాలి.
తోడు కోసం ఆరాటపడుతున్న హీరోయిన్
రేఖ కెరియర్ విషయానికే వస్తే.. దొంగోడు, ఒకటో నెంబర్ కుర్రాడు, అనగనగా ఓ కుర్రాడు, జాబిలి, ప్రేమించుకున్నాం, జానకి వెడ్స్ శ్రీరామ్, పెళ్లికి రండి వంటి చిత్రాల్లో ప్రేక్షకులను ఆకట్టుకుంది. అటు కన్నడలో కూడా వరుస విజయాలతో స్టార్ హోదా దక్కించుకుంది. వరుస విజయాలతో దూసుకుపోతున్న సమయంలోనే అనారోగ్య సమస్యలు ఆమె కెరియర్ కు బ్రేక్ వేశాయి. ఇక 2014 తర్వాత సినిమాలలో పెద్దగా కనిపించని రేఖ.. అప్పుడప్పుడు టీవీ కార్యక్రమాలు, ఇంటర్వ్యూల ద్వారా మాత్రమే అభిమానులకు టచ్ లో ఉంటున్నారు. మరి ఎప్పుడు సినిమాల్లోకి రీ ఎంట్రీ ఇస్తారో చూడాలి.
సినీ జీవితం రంగులమయంగా కనిపించినా వ్యక్తిగత జీవితంలో ఎన్నో కష్టాలు ఉంటాయని రేఖ అన్నారు. ఆమె త్వరగా కోలుకుని, జీవితంలో ఒక తోడు దొరుకుతుందని ఆశిద్దాం.

