|

Andhravilas.net – Breaking News & Movie Buzz Since 2002

లాగార్డియాలో పెను విషాదం: ఫైర్ ట్రక్కును ఢీకొట్టిన విమానం! ఇద్దరు దుర్మరణం!

Published: 23-03-2026, 7:35 AM
లాగార్డియాలో పెను విషాదం: ఫైర్ ట్రక్కును ఢీకొట్టిన విమానం! ఇద్దరు దుర్మరణం!
  • న్యూయార్క్ లాగార్డియా విమానాశ్రయంలో ఫైర్ ట్రక్కును ఢీకొట్టిన ఎయిర్ కెనడా విమానం.
  • ప్రమాదంలో ఇద్దరు పైలట్లు మృతి, 41 మందికి గాయాలు.
  • రన్‌వేపై పొగలు వస్తున్న విమానానికి సహాయం చేయడానికి వచ్చిన ఫైర్ ట్రక్కును ఢీకొట్టిన విమానం.
  • విమానాశ్రయం తాత్కాలికంగా మూసివేత, విమానాల దారి మళ్లింపు, ఘటనపై విచారణకు ఆదేశం.

న్యూయార్క్ నగరంలోని లాగార్డియా విమానాశ్రయంలో ఆదివారం అర్ధరాత్రి ఘోర ప్రమాదం జరిగింది. ఎయిర్ కెనడా విమానం ఫైర్ ట్రక్కును ఢీకొనడంతో ఇద్దరు పైలట్లు దుర్మరణం పాలయ్యారు. ఈ ఘటన దేశవ్యాప్తంగా దిగ్భ్రాంతిని కలిగించింది.

లాగార్డియాలో విమాన ప్రమాదం: అసలేం జరిగింది?

70 మంది ప్రయాణికులు, ఇద్దరు పైలట్లు, ఇతర సిబ్బందితో న్యూయార్క్ లో ల్యాండ్ అవుతున్న విమానం.. ఫైర్ ట్రక్కును ఢీ కొట్టింది. లాగార్డియా విమానాశ్రయంలో జరిగిన ఈ ఘోర విమాన ప్రమాదంలో ఇద్దరు పైలట్లు మృతి చెందారు. ఆదివారం అర్ధరాత్రి ఈ పెనుప్రమాదం సంభవించింది. ఎయిర్ కెనడాకు చెందిన జాజ్ ఏవియేషన్ విమానం రన్‌వేపై ఉన్న ఫైర్ ఫైటింగ్ వాహనాన్ని (Fire Truck) బలంగా ఢీకొట్టింది. ఈ ఘటనలో విమానంలోని ఇద్దరు పైలట్లు అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోగా, మరో 41 మంది తీవ్రంగా గాయపడ్డారు.

ప్రమాదానికి గల కారణాలపై దర్యాప్తు

స్థానిక కాలమానం ప్రకారం ఆదివారం రాత్రి 11:40 గంటల సమయంలో కెనడాలోని మాంట్రియల్ నుండి వచ్చిన ఫ్లైట్ 8646 (CRJ-900 విమానం) లాగార్డియా ఎయిర్‌పోర్ట్‌లో ల్యాండ్ అయ్యింది. అదే సమయంలో రన్‌వే-4పై మరో విమానంలో పొగలు వస్తున్నాయన్న సమాచారంతో సహాయక చర్యల కోసం పోర్ట్ అథారిటీకి చెందిన ఫైర్ ఇంజిన్ అక్కడికి చేరుకుంది. సుమారు 24 మైళ్ల వేగంతో ప్రయాణిస్తున్న ఎయిర్ కెనడా విమానం అకస్మాత్తుగా ఈ ఫైర్ ట్రక్కును ఢీకొట్టింది. ఆ సమయంలో విమానంలో 72 మంది ప్రయాణికులు, నలుగురు సిబ్బంది ఉన్నారు. ఈ ప్రమాదంలో విమాన పైలట్, కో-పైలట్ మరణించినట్లు పోర్ట్ అథారిటీ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ క్యాథరిన్ గార్సియా ధృవీకరించారు. విమానంలోని 39 మంది ప్రయాణికులతో పాటు ఫైర్ ఇంజిన్‌లో ఉన్న ఇద్దరు అధికారులను చికిత్స నిమిత్తం ఆసుపత్రికి తరలించారు. ప్రస్తుతం ఆసుపత్రిలో ఉన్న 41 మందిలో 32 మంది చికిత్స అనంతరం డిశ్చార్జ్ అయ్యారని, మిగిలిన వారి పరిస్థితి నిలకడగా ఉందని అధికారులు తెలిపారు.

క్షతగాత్రులకు చికిత్స, విమానాశ్రయం మూసివేత

ప్రమాదం జరిగిన వెంటనే లాగార్డియా విమానాశ్రయాన్ని తాత్కాలికంగా మూసివేశారు. సోమవారం మధ్యాహ్నం వరకు విమాన రాకపోకలను నిలిపివేస్తున్నట్లు అధికారులు ప్రకటించారు. దీనివల్ల సుమారు 18 విమానాలను జెఎఫ్‌కే (JFK), నెవార్క్ విమానాశ్రయాలకు మళ్లించారు. నేషనల్ ట్రాన్స్‌పోర్టేషన్ సేఫ్టీ బోర్డ్ (NTSB), ఫెడరల్ ఏవియేషన్ అడ్మినిస్ట్రేషన్ (FAA) ఈ ఘటనపై సమగ్ర విచారణకు ఆదేశించాయి. ఎయిర్ ట్రాఫిక్ కంట్రోల్ వైఫల్యం ఉందా? లేదా ఇతర సాంకేతిక కారణాలు ఉన్నాయా? అనే కోణంలో దర్యాప్తు సాగుతోంది.

ఈ ప్రమాదం విమానయాన భద్రతపై అనేక ప్రశ్నలను లేవనెత్తుతోంది. పూర్తి స్థాయి విచారణ అనంతరం వాస్తవాలు వెలుగులోకి వస్తాయని భావిస్తున్నారు. బాధితులకు ప్రభుత్వం అండగా నిలుస్తుందని ఆశిద్దాం.

Related News

Plugin developed by ProSEOBlogger
Plugin developed by ProSEOBlogger. Get free Ypl themes.