
📌 Key Points
- ప్రదీప్ రంగనాథన్ కొత్త సినిమా ‘లవ్ ఇన్సూరెన్స్ కంపెనీ’ (LIK) ఏప్రిల్ 10న విడుదల కానుంది.
- దర్శకుడు విఘ్నేష్ శివన్ ఈ సినిమాను తెరకెక్కించగా, అనిరుద్ సంగీతం అందించారు.
- టాలీవుడ్ డైరెక్టర్ అనిల్ రావిపూడి సినిమా చూసి పాజిటివ్ రివ్యూ ఇవ్వడంతో చిత్ర యూనిట్ నమ్మకంగా ఉంది.
- ఏఐ టెక్నాలజీ భవిష్యత్తు తరాలపై చూపించే ప్రభావం గురించి ఈ చిత్రం ముందస్తు హెచ్చరికలు చేస్తుంది.
ప్రదీప్ రంగనాథన్ నటించిన ‘లవ్ ఇన్సూరెన్స్ కంపెనీ’ (LIK) చిత్రం ఏప్రిల్ 10న విడుదల కానుంది. ఈ సినిమాను ప్రముఖ దర్శకుడు విఘ్నేష్ శివన్ తెరకెక్కించారు. టాలీవుడ్ దర్శకుడు అనిల్ రావిపూడి సినిమా చూసి పాజిటివ్ రివ్యూ ఇచ్చారు.
LIK మూవీ విడుదల ఎప్పుడంటే?
LIK:ప్రదీప్ రంగనాథన్ (Pradeep Ranganathan).. వినూత్నమైన ఆలోచనలతో.. ప్రస్తుత సమాజానికి అద్దంపట్టేలా కథలను ఎంచుకుంటూ ప్రేక్షకుల ముందుకు వస్తున్నారు ఈ యువ హీరో. అద్భుతమైన నటనతో సహజంగా కనిపిస్తూ ప్రేక్షకుల హృదయాలను ఆకట్టుకుంటున్న ఈయన.. గతంలో లవ్ టుడే అనే సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చి, మంచి విజయాన్ని సొంతం చేసుకున్నారు. ఈ సినిమాను ఆధారంగా చేసుకుని నిజజీవితంలో ఫోన్ మార్పిడి చేసి కొంతమంది లవ్ బ్రేకప్ చేసుకున్న వారు కూడా లేకపోలేదు. అలా తన సినిమాలతో యువతపై భారీ ప్రభావాన్ని చూపించే ప్రదీప్ తాజాగా ఏఐ టెక్నాలజీ భవిష్యత్తు తరాలపై చూపించబోయే ప్రభావం గురించి ముందస్తుగానే హెచ్చరికలు జారీ చేస్తూ ప్రేక్షకుల ముందుకు రాబోతున్నారు.
అదే లవ్ ఇన్సూరెన్స్ కంపెనీ (LIK) ప్రముఖ కోలీవుడ్ బడా డైరెక్టర్ విఘ్నేష్ శివన్ దర్శకత్వంలో ఏప్రిల్ 10వ తేదీన ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ చిత్రానికి ప్రముఖ సంగీత దర్శకులు అనిరుద్ సంగీతాన్ని అందిస్తుండగా.. యంగ్ బ్యూటీ కృతి శెట్టి హీరోయిన్గా నటిస్తోంది. విడుదల తేదీ దగ్గర పడుతున్న నేపథ్యంలో ఇటీవల ట్రైలర్ లాంచ్ నిర్వహించగా.. తాజాగా ప్రీ రిలీజ్ ఈవెంట్ ను నిర్వహించారు . హైదరాబాద్ వేదికగా జరిగిన ఈ ప్రీ రిలీజ్ ఈవెంట్లో ఎన్నో విషయాలను పంచుకున్నారు ప్రముఖ డైరెక్టర్ విఘ్నేష్ శివన్. అందులో భాగంగానే ఈ సినిమాను టాలీవుడ్ లో కమర్షియల్ డైరెక్టర్గా మంచి పేరు సొంతం చేసుకుని.. ఓటమెరుగని దర్శకుడిగా ఇమేజ్ క్రియేట్ చేసుకున్న అనిల్ రావిపూడి చూశారని.. ఆయన ఇచ్చిన రివ్యూతో తమ సినిమాపై నమ్మకం పెరిగిందని ఆయన స్పష్టం చేశారు.
అనిల్ రావిపూడి రివ్యూతో నమ్మకం పెరిగిందన్న విఘ్నేష్ శివన్
మరి లవ్ ఇన్సూరెన్స్ కంపెనీ పై అనిల్ రావిపూడి పంచుకున్న ఫస్ట్ రివ్యూ ఏంటి అనే విషయాన్ని విఘ్నేష్ చెప్పుకొచ్చారు.. లవ్ ఇన్సూరెన్స్ కంపెనీ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ లో భాగంగా విఘ్నేష్ శివన్ మాట్లాడుతూ..” మా సినిమాను టాలీవుడ్ సక్సెస్ఫుల్ డైరెక్టర్ అనిల్ రావిపూడి ముందుగానే చూసారు. ఆయన సినిమా చూసి చాలా పాజిటివ్గా రెస్పాండ్ అయ్యారు. ఆయన ఇచ్చిన ఫీడ్ బ్యాక్ తర్వాతే నా సినిమా ఖచ్చితంగా విజయం సాధిస్తుందనా పూర్తి నమ్మకం నాలో కలిగింది. ఒక కమర్షియల్ డైరెక్టర్ నుండి వచ్చిన ప్రశంసలు మా టీంలో కొత్త ఉత్సాహాన్ని నింపాయి ” అంటూ విఘ్నేష్ శివన్ తన సంతోషాన్ని అభిమానులతో పంచుకున్నారు. ఇక విభిన్నమైన కాన్సెప్ట్ తో ప్రేక్షకుల ముందుకు రాబోతున్న ప్రదీప్ రంగనాథన్ ఈ సినిమాతో తెలుగులో తన మార్కెట్ ను మరింత పెంచుకోవడం ఖాయమని అటు చిత్ర బృందం కూడా ధీమా వ్యక్తం చేస్తోంది .
ఏఐ టెక్నాలజీపై ప్రదీప్ మూవీ హెచ్చరికలు
మరొకవైపు ఈ సినిమాలో హీరోయిన్గా నటిస్తున్న కృతి శెట్టి కూడా గత కొంతకాలంగా సరైన సక్సెస్ కోసం గట్టిగా ఎదురుచూస్తున్న విషయం తెలిసిందే. ఒకవేళ ఈ సినిమా గనుక హిట్ అయితే ఆమెకు మరిన్ని అవకాశాలు తలుపు తడతాయి అనడంలో సందేహం లేదు. ఇదిలా ఉండగా ప్రస్తుతం ఈ ముద్దుగుమ్మకి ప్రముఖ డైరెక్టర్ అనిల్ రావిపూడి తన సినిమాలో అవకాశం కల్పించారు. వెంకటేష్, కళ్యాణ్ రామ్ కాంబినేషన్లో వస్తున్న సినిమాలో కళ్యాణ్ రామ్ కి జోడిగా కృతి శెట్టిని ఎంపిక చేయడం విశేషం.
మొత్తానికి, ‘లవ్ ఇన్సూరెన్స్ కంపెనీ’ చిత్రం ఏఐ టెక్నాలజీ యుగంలో ప్రేమ, భవిష్యత్తు గురించి చర్చించే ఒక ప్రయత్నంగా కనిపిస్తోంది. అనిల్ రావిపూడి రివ్యూతో సినిమాపై అంచనాలు పెరిగాయి.

