
థియేటర్లలో కంటే ఓటీటీలోనే మంచి విజయం సాధించిన చిత్రంగా ‘బకాసుర రెస్టారెంట్’ నిలిచింది. అమెజాన్ ప్రైమ్‌లో ఈ తెలుగు హారర్ మూవీ 250 మిలియన్ వీక్షణలు దాటి, టాప్ 10లో దూసుకుపోతోంది. ప్రవీణ్ ప్రధాన పాత్రలో నటించిన ఈ చిత్రం ఓటీటీ ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకుంటోంది.
Key Points
'బకాసుర రెస్టారెంట్' ఓటీటీలో రిలీజై భారీ విజయాన్ని అందుకుంది.
అమెజాన్ ప్రైమ్‌లో 24 రోజులుగా టాప్ 10 చిత్రాల్లో ఒకటిగా నిలిచింది.
ఈ తెలుగు హారర్ మూవీ ఇప్పటికే 250 మిలియన్ వీక్షణలు దాటి రికార్డు సృష్టించింది.
ప్రవీణ్ (కమెడియన్) ప్రధాన పాత్రలో నటించిన ఈ చిత్రం కంటెంట్ బలాన్ని నిరూపించింది.
ఓటీటీలో ‘బకాసుర రెస్టారెంట్’ సంచలనం
కొన్ని సినిమాలు థియేటర్స్‌లో కంటే ఓటీటీలోనే ఎక్కువ బాగా ఆడతాయి . ముఖ్యంగా చిన్న సినిమాలకు ఓటీటీ వరంలా మారింది . కంటెంట్ ఉంటే చాలు .. కాస్టింగ్ ని పట్టించుకోకుండా సినిమాను ఆదరిస్తున్నారు . ఇప్పటికే పలు చిన్న చిత్రాలు ఓటీటీలో సంచలనం సృష్టించిన సంగతి తెలిసిందే . తాజాగా ఓ తెలుగు హారర్ సినిమా కూడా ఓటీటీలో రిలీజై సూపర్ హిట్ గా నిలిచింది . అదే ‘ బకాసుర రెస్టారెంట్ ’(Bakasura Restaurant ). పలు సినిమాల్లో కమెడియన్‌గా నటించి గుర్తింపు తెచ్చుకున్న ప్రవీణ్ ఈ చిత్రంలో లీడ్ రోల్ చేశాడు .
ఈ ఏడాది ఆగస్ట్ లో థియేటర్స్ లో రిలీజై మంచి టాక్ ని సంపాదించుకున్న ఈ చిత్రం .. ఇప్పుడు ఓటీటీలో దుమ్మురేపుతోంది . అమెజాన్ ప్రైమ్ వీడియోలో స్ట్రీమింగ్ అవుతున్న టాప్ చిత్రాల్లో ఒకటిగా నిలిచింది . కన్నప్ప, పరద, కూలి లాంటి సినిమాలను సైతం వెనక్కి నెట్టి, వరుసగా 24 రోజులుగా టాప్ 10 లోనే ఉండడం గమనార్హం . అంతేకాదు ఇప్పటికే 250 మిలియన్ వ్యూస్ క్రాస్ చేసిందంటే .. ఈ సినిమాను ఓటీటీ ప్రేక్షకులు ఏ స్థాయిలో ఆదరిస్తున్నారో అర్థం చేసుకోవచ్చను .
సినిమా కథాంశం, ప్రధాన పాత్రలు
పెద్ద సినిమాల నడుమ నిలబడటం చాలా కష్టమని అందరూ అనుకునే పరిస్థితిలో, బకాసుర రెస్టారెంట్ మాత్రం ఆ అపోహను చెరిపేసింది. కంటెంట్ బలం ఉంటే ప్రేక్షకులు తప్పకుండా ఆదరిస్తారనే విషయాన్ని మరొకసారి నిరూపించింది.
కథేంటంటే.. పరమేశ్వర్(ప్రవీణ్) ఓ సాఫ్ట్‌వేర్ ఇంజనీర్. నలుగురు స్నేహితులతో కలిసి ఓ రూమ్‌లో ఉంటూ ఇష్టం లేకపోయినా డబ్బుల కోసం ఆ జాబ్ చేస్తుంటాడు. ఎప్పటికైనా ఓ రెస్టారెంట్ పెట్టాలనేది ఆయన కోరిక. ఓ సారి తన కోరికనే స్నేహితులతో పంచుకోగ.. డబ్బుల కోసం యూట్యూబ్ లో ఘోస్ట్ వీడియోలు చేద్దామని సలహా ఇస్తారు. అనుకున్నట్లే మొదటి వీడియో బాగా వైరల్ అవుతుంది. రెండో వీడియో కోసం ఓ హోస్ట్ హౌస్‌కి వెళ్తారు. అక్కడ వీరికి ఒక తాంత్రిక పుస్తకం దొరుకుతుంది. దాన్ని వాడి డబ్బులు సంపాదించుకోవాలనుకుంటారు. అందులో రాసి ఉన్నట్లుగా మంత్ర పూజ చేయగా.. నిమ్మకాయలోకి 200 ఏళ్ల క్రితం నాటి ఆత్మ వస్తుంది. ఆ ఆత్మకు ఆకలి ఎక్కువ. ఇంట్లో ఉన్న ఫుడ్ అంతా తిసేస్తుంది.
ప్రవీణ్ నటించిన హారర్ మూవీ విజయ రహస్యం
ఆ నిమ్మకాయలో ఉన్న ఆత్మను కట్టడి చేసేందుకు ప్రయత్నించగా.. పరమేశ్వర్ రూమ్‌లోకి వచ్చిన అంజిబాబు(ఫణి) శరీరంలోకి వెళ్తుంది. అంజిబాబు శరీరాన్ని ఆవహించిన ఆత్మను పొగొట్టేందుకు పరమేశ్వర్ గ్యాంగ్ చేసిన ప్రయత్నాలు ఏంటి? బక్క సూరి(వైవా హర్ష) ఎవరు? అతనికి ఉన్న రోగం ఏంటి? అంజిబాబులో ఉన్న ఆత్మ బక్క సూరిది అని తెలిసిన తర్వాత పరమేశ్వర్(ప్రవీణ్) గ్యాంగ్ ఎలాంటి నిర్ణయం తీసుకుంది. చివరకు అంజిబాబు శరీరం నుంచి ఆ ఆత్మ బయటకు వెళ్లిందా లేదా? రెస్టారెంట్ పెట్టాలన్న పరమేశ్వర్ కోరిక నెరవేరిందా? లేదా? అనేది తెలియాలంటే సినిమా చూడాల్సిందే.
మొత్తం మీద ‘బకాసుర రెస్టారెంట్’ ఓటీటీలో చిన్న సినిమాలకు వరం అని మరోసారి నిరూపించింది. కంటెంట్ బలంగా ఉంటే ప్రేక్షకులు తప్పకుండా ఆదరిస్తారని ఈ చిత్రం నిరూపించింది. ఓటీటీలో దీని విజయగాథ చాలా మందికి స్ఫూర్తినిస్తోంది.


