|

Andhravilas.net – Breaking News & Movie Buzz Since 2002

భద్రాచలం రూపురేఖలు మార్చేందుకు రేవంత్ సర్కార్ సంచలన నిర్ణయం! పుష్కరాల నాటికే మొదటి దశ పూర్తి!!

Published: 21-03-2026, 11:05 PM
భద్రాచలం రూపురేఖలు మార్చేందుకు రేవంత్ సర్కార్ సంచలన నిర్ణయం! పుష్కరాల నాటికే మొదటి దశ పూర్తి!!
  • భద్రాచలం ఆలయ అభివృద్ధి పనులను ఆగమ శాస్త్రం ప్రకారం చేపట్టాలని సీఎం ఆదేశించారు.
  • గోదావరి పుష్కరాల నాటికి తొలి దశ పనులు పూర్తి చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నారు.
  • మూడు దశల్లో ఆలయ అభివృద్ధి పనులు పూర్తి చేసేలా ప్రణాళికలు సిద్ధం చేయాలని సూచన.
  • రామవరంలో ట్రైబల్ మ్యూజియం ఏర్పాటు చేయాలని ప్రభుత్వం నిర్ణయం.

భద్రాచలం శ్రీ సీతారామచంద్ర స్వామి వారి ఆలయాన్ని అభివృద్ధి చేసేందుకు సీఎం రేవంత్ రెడ్డి గారు కీలక నిర్ణయాలు తీసుకున్నారు. ఆలయ అభివృద్ధి పనులను ఆగమ శాస్త్ర ప్రకారం చేపట్టాలని అధికారులకు ఆదేశాలు జారీ చేశారు.

ఆగమ శాస్త్ర ప్రకారం అభివృద్ధి పనులు

భద్రాచలం శ్రీ సీతారామచంద్ర స్వామి వారి ఆలయ సహజత్వానికి ఏమాత్రం భంగం కలగకుండా అభివృద్ధి పనులు జరగాలని సీఎం రేవంత్ రెడ్డి అధికారులను ఆదేశించారు. పూర్తిగా ఆగమ శాస్త్రానుసారం చేపట్టాలని సూచించారు. శ్రీ సీతారామచంద్ర స్వామి వారి ఆలయ అభివృద్ధి ప్రణాళికలపై ముఖ్యమంత్రి శనివారం ఉన్నతస్థాయి సమావేశంలో సమీక్షించారు.

ఉపముఖ్యమంత్రి భట్టి విక్రమార్కతో పాటు మంత్రులు ఉన్నతాధికారులు పాల్గొన్న ఈ సమావేశంలో ఇప్పటి వరకు పూర్తయిన భూసేకరణకు అనుగుణంగా ఆలయ అభివృద్ధికి సంబంధించిన పలు డిజైన్లను సీఎం పరిశీలించారు. ఆగమశాస్త్రానుసారం అభివృద్ధి పనుల నిర్వహణ సందర్భంగా భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా… మూడు దశల్లో పనులను పూర్తి చేసేలా ప్రణాళికలు సిద్ధం చేసుకోవాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చెప్పారు.

పుష్కరాల నాటికి తొలి దశ పూర్తి

వచ్చే గోదావరి పుష్కరాల నాటికి చేయగలిగిన పనులను ముందుగా గుర్తించాలని సీఎం రేవంత్ రెడ్డి దిశానిర్దేశం చేశారు. అందుకు సంబంధించిన అంచనాలతో తొలి దశ అభివృద్ధి ప్రణాళికలు సిద్ధం చేయాలని ఆదేశించారు.

గోదావరి పుష్కరాల ప్రణాళికలకు అనుగుణంగా ఆలయ సమీపంలోని పుష్కర ఘాట్ల నిర్మాణం, అభివృద్ధి పనులు జరగాలని చెప్పారు. 2027 మార్చి 31 నాటికి తొలిదశ అభివృద్ధి పనులు పూర్తి చేసే లక్ష్యంతో పనులు జరగాలని సూచించారు. పుష్కరాలు ముగిసిన అనంతరం మిగతా పనులు పూర్తి చేసేందుకు కూడా ఇప్పుడే ప్రణాళికలు, అంచనాలు సిద్ధం చేయాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆదేశించారు.

మూడు దశల్లో అభివృద్ధి ప్రణాళికలు

తెలంగాణలోని ప్రముఖ పుణ్యక్షేత్రంగా… దక్షిణ అయోధ్యగా పేరుగాంచిన భద్రాచలం శ్రీ సీతారామచంద్ర స్వామి దేవస్థాన అభివృద్ధిపై ప్రభుత్వం ఫోకస్ పెట్టిన సంగతి తెలిసిందే. ప్రాథమికంగా మాస్టర్ ప్లాన్ సిద్ధం కాగా…. సీఎం సూచనల తర్వాత తుది రూపు ఇవ్వనున్నారు. ఆగ‌మ శాస్త్రం ప్ర‌కార… మొత్తం మూడు ద‌శల్లో ఆల‌యాన్ని అభివృద్ది చేయనున్నారు.

భద్రాచలాన్ని తెలంగాణలోనే అతిపెద్ద ఆధ్యాత్మిక హబ్‌గా మార్చాలని సర్కార్ యోచిస్తోంది. భద్రాచలం స‌మీపంలోని రామ‌వ‌రంలో ట్రైబ‌ల్ మ్యూజియం ఏర్పాటు చేయాల‌ని నిర్ణ‌యించింది.ఆలయం మాత్రమే కాకుండా పట్టణాన్ని కూడా ఆధునిక సౌకర్యాలతో అభివృద్ధి చేయడం లక్ష్యంగా ప్రభుత్వం ప్రణాళికలు సిద్ధం చేస్తోంది.

భద్రాచలం ఆలయాన్ని తెలంగాణ రాష్ట్రంలోనే ఒక గొప్ప ఆధ్యాత్మిక కేంద్రంగా తీర్చిదిద్దడానికి ప్రభుత్వం కృషి చేస్తోంది. త్వరలోనే పూర్తి స్థాయి ప్రణాళికలు సిద్ధం కానున్నాయి.

Related News

Plugin developed by ProSEOBlogger
Plugin developed by ProSEOBlogger. Get free Ypl themes.