
📌 Key Points
- రాబోయే 2 నెలల్లో 2.20 లక్షల మంది కొత్త వితంతువులకు పింఛన్లు మంజూరు చేయనున్నట్లు మంత్రి కొండపల్లి శ్రీనివాస్ వెల్లడి.
- గత ప్రభుత్వం 9.56 లక్షల పింఛన్లు తొలగించగా, కూటమి ప్రభుత్వం కేవలం 7,856 అనర్హుల పింఛన్లను మాత్రమే తొలగించింది.
- పింఛనుదారుడైన భర్త మరణిస్తే, ‘స్పౌజ్ కేటగిరీ’ కింద తక్షణమే భార్యకు పింఛన్ బదిలీ, ఇప్పటికే 2.45 లక్షల మందికి లబ్ధి.
- డ్వాక్రా మహిళల కోసం ‘స్వయం’ బ్రాండింగ్, ‘మన డబ్బులు – మన లెక్కలు’ యాప్, పెరటి కోళ్ల పెంపకం పథకాలు.
ఆంధ్రప్రదేశ్‌లోని కూటమి ప్రభుత్వం అర్హులైన లబ్ధిదారులకు శుభవార్త అందించింది. రాబోయే రెండు నెలల్లో కొత్తగా 2.20 లక్షల మంది వితంతువులకు పింఛన్లు మంజూరు చేయనున్నట్లు మంత్రి కొండపల్లి శ్రీనివాస్ ప్రకటించారు. ఇది రాష్ట్రంలో సామాజిక భద్రతను మరింత బలోపేతం చేయనుంది.
కొత్త వితంతు పింఛన్ల మంజూరు: పూర్తి వివరాలు
ఆంధ్రప్రదేశ్‌లోని అర్హులైన లబ్ధిదారులకు కూటమి ప్రభుత్వం మరో తీపి కబురు అందించింది. రాష్ట్రవ్యాప్తంగా త్వరలోనే కొత్తగా సుమారు 2.20 లక్షల మందికి వితంతు కేటగిరీ కింద పింఛన్లను మంజూరు చేయనున్నట్లు మంత్రి కొండపల్లి శ్రీనివాస్ వెల్లడించారు.
కొత్త వితంతు పింఛన్లకు సంబంధించి ఇప్పటికే అర్హులను గుర్తించామని, రాబోయే ఒకటి లేదా రెండు నెలల్లో వీరికి నేరుగా లబ్ధి చేకూరేలా నూతన మార్గదర్శకాలను సిద్ధం చేస్తున్నామని మంత్రి శ్రీనివాస్ తెలిపారు. దేశంలోనే అత్యధికంగా సామాజిక పింఛన్లు ఇస్తున్న రాష్ట్రం ఆంధ్రప్రదేశేనని, పొరుగు రాష్ట్రమైన తెలంగాణ కంటే మనం రెట్టింపు స్థాయిలో పింఛన్లు అందిస్తున్నామని పేర్కొన్నారు.
గత, ప్రస్తుత ప్రభుత్వాల పింఛన్ల విధానంపై స్పష్టత
గత ప్రభుత్వ హయాంలో దాదాపు 9.56 లక్షల మంది పింఛన్లను తొలగించగా, ప్రస్తుత కూటమి ప్రభుత్వం కేవలం 7,856 అనర్హుల పింఛన్లను మాత్రమే తొలగించిందని స్పష్టం చేశారు మంత్రి కొండపల్లి శ్రీనివాస్. దివ్యాంగులు, అనారోగ్య పింఛన్లలో ఒక్కటి కూడా తొలగించలేదని, ప్రతిపక్షాల అసత్య ప్రచారాలను నమ్మవద్దని కోరారు. అలాగే పింఛనుదారుడైన భర్త మరణిస్తే.. ‘స్పౌజ్ కేటగిరీ’ కింద తక్షణమే భార్యకు పింఛన్ బదిలీ చేస్తూ ఇప్పటికే 2.45 లక్షల మందికి కొత్తగా పింఛన్లు ఇచ్చామని వివరించారు.
పొదుపు సంఘాల మహిళల ఆర్థికాభివృద్ధికి ప్రభుత్వం విప్లవాత్మక మార్పులు చేస్తోంది. డ్వాక్రా ఉత్పత్తులకు అంతర్జాతీయ మార్కెట్ కల్పించేందుకు స్వయం (Swayam) అనే ప్రత్యేక బ్రాండింగ్‌ను తీసుకువస్తున్నారు. పైలట్ ప్రాజెక్ట్ కింద తొలి విడతగా 100 ఉత్పత్తులను ఎంపిక చేశారు. చదువుకుని ఇళ్లకే పరిమితమైన 3 లక్షల మంది డ్వాక్రా మహిళలను ‘నైబర్‌హుడ్ బిజినెస్’ (ఇరుగు-పొరుగు వ్యాపారాలు) వైపు మళ్లించేలా కార్యాచరణ రూపొందిస్తున్నామని మంత్రి కొండపల్లి వెల్లడించారు.
డ్వాక్రా మహిళలు, ఎస్సీ, ఎస్టీల అభివృద్ధికి చర్యలు
‘మన డబ్బులు -మన లెక్కలు యాప్ తీసుకురాబోతున్నాం. డ్వాక్రా రుణాల చెల్లింపుల్లో అవకతవకలకు తావులేకుండా ఈ సరికొత్త డిజిటల్ యాప్‌ను ప్రవేశపెడుతున్నాం. గ్రామీణ మహిళల జీవనోపాధిని పెంచేందుకు పెరటి కోళ్ల పెంపకం పథకాన్ని ప్రోత్సహిస్తున్నాం. అత్యవసర అవసరాల కోసం మండల సమాఖ్యల ద్వారా అతి తక్కువ వడ్డీకే రూ. 20,000 చొప్పున రుణాలు అందిస్తున్నాం. ఎస్సీ, ఎస్టీ వర్గాల ఉన్నతి కోసం వడ్డీ లేని రుణాలను ఇస్తున్నాం. ఇప్పటివరకు 81 వేల మందికి రూ. 498 కోట్ల ఆర్థిక సాయం అందించాం.’ అని మంత్రి కొండపల్లి శ్రీనివాస్ అన్నారు.
ఆనంద్ సాయి మాదాసు ప్రస్తుతం హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో డిప్యూటీ చీఫ్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. డిజిటల్ మీడియాలో 9 ఏళ్లకుపైగా అనుభవం ఉంది. హెచ్‌టీ తెలుగులో చేరడం కంటే ముందు ఏబీపీ దేశంలో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేశారు. మెుదట నవతెలంగాణ అనే దినపత్రికలో సబ్ఎడిటర్‌గా జర్నలిజం కెరీర్ మెుదలుపెట్టారు. ఆ తర్వాత కరీంనగర్‌లో ఈనాడు దినపత్రికలో కొంతకాలం సబ్‌ఎడిటర్‌గా బాధ్యతలు చూసుకున్నారు. కాకతీయ యూనివర్సిటీలో 2015-2017 పీజీ మాస్ కమ్యూనికేషన్ అండ్ జర్నలిజం చేశారు. ఈ సమయంలో మేడారం సమ్మక్క-సారలమ్మ జాతర కోసం ప్రత్యేకంగా క్యాంపస్ నుంచి పంపించిన టీమ్‌లో ఉన్నారు. పీజీ చదివే సమయంలోనే క్యాంపస్ రిక్రూట్‌మెంట్‌లో భాగంగా ఈటీవీ భారత్‌కు సెలక్ట్ అయ్యారు. అక్కడ ఆంధ్రప్రదేశ్ డెస్క్‌లో పని చేశారు. అంతేకాదు కొన్ని ప్రత్యేక స్టోరీలు కూడా ఈటీవీ భారత్ వెబ్‌సైట్ కోసం రాసేవారు. 2019 ఎన్నికల్లో ఎలక్షన్ డెస్క్ టీమ్‌లో ఉన్న నలుగురిలో ఆనంద్ సాయి ఒకరు. ఆ తర్వాత అక్కడ నుంచి ఏబీపీ దేశంలోకి వెళ్లి కొంతకాలం పని చేశారు. ఈ సమయంలో కూడా డిజిటల్ మీడియాకు తగినట్టుగా అనేక ప్రత్యేక కథనాలు రాశారు.
హిందూస్తాన్ టైమ్స్ తెలుగులో 2022లో చేరారు. ఇక్కడ గతంలో నేషనల్, బిజినెస్, లైఫ్‌స్టైల్, ఎంటర్‌టైన్‌మెంట్, స్పోర్ట్స్ సెక్షన్లకు పనిచేశారు. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్, తెలంగాణ సెక్షన్లకు వార్తలు రాస్తున్నారు. అన్ని సెక్షన్లకు డిజిటల్ కంటెంట్ రైటర్‌గా పని చేసిన అనుభవం ఆయనకు ఉంది. అంతేకాదు ఈటీవీ భారత్, ఏబీపీ దేశం, హిందుస్తాన్ టైమ్స్ వెబ్‌సైట్స్ లాంచ్ టీమ్‌లో ఈయన ఉన్నారు. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాజకీయ పరిణామాలు, విశ్లేషణలు, విద్య, ఉద్యోగ సమాచారంతో పాటు ఆసక్తికరమైన కథనాలను అందిస్తారు. ప్రభుత్వ పథకాలు, ఉద్యోగ నోటిఫికేషన్లు, ఇతర సమాచారం ప్రజలకు సులభంగా అర్థమయ్యే రీతిలో, వీలైనంత త్వరగా కథనాలను ఇవ్వటంలో ప్రత్యేక శైలి కలిగి ఉన్నారు. అనేకసార్లు హిందుస్తాన్ టైమ్స్ సంస్థ నుంచి ఇన్‌స్టా అవార్డులు అందుకున్నారు. డిజిటల్ మీడియాలో ఎక్కువకాలం పని చేసిన అనుభవం ఉంది. యూజర్లకు ఉపయోగపడే వార్తలను అందించడంలో ముందుంటారు. Read More
మొత్తంగా, కూటమి ప్రభుత్వం సంక్షేమ పథకాల అమలులో పారదర్శకత, లబ్ధిదారులకు సత్వర సేవలు అందించడంపై దృష్టి సారించింది. వితంతు పెన్షన్ల పెంపు, డ్వాక్రా మహిళల సాధికారత, ఎస్సీ, ఎస్టీల ఆర్థికాభివృద్ధికి కట్టుబడి ఉన్నట్లు ఈ ప్రకటనలు స్పష్టం చేస్తున్నాయి.


