
📌 Key Points
- ఇరిగేషన్ ప్రాజెక్టుల్లో నాణ్యత విషయంలో రాజీ ఉండకూడదని సీఎం చంద్రబాబు స్పష్టీకరణ.
- పోలవరం ప్రాజెక్టు నిర్మాణంలో కేంద్రంతో నిరంతరం టచ్‌లో ఉండాలని అధికారులకు సీఎం ఆదేశం.
- గత ప్రభుత్వంలో పోలవరం డయాఫ్రం వాల్ దెబ్బతినడానికి గల కారణాలను చంద్రబాబు విశ్లేషించారు.
- ప్రాజెక్టుల నిర్మాణాలను సకాలంలో పూర్తి చేయాలని సీఎం చంద్రబాబు అధికారులకు సూచన.
ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఇరిగేషన్ ప్రాజెక్టుల నిర్మాణంపై సమీక్ష నిర్వహించారు. పోలవరం ప్రాజెక్టు నిర్మాణంలో నాణ్యతకు అధిక ప్రాధాన్యత ఇవ్వాలని, కేంద్రంతో నిరంతరం సంప్రదింపులు జరపాలని ఆయన అధికారులను ఆదేశించారు.
నాణ్యతకు ప్రాధాన్యమివ్వాలని సీఎం ఆదేశం
ఇరిగేషన్ ప్రాజెక్టుల నిర్మాణాల్లో నాణత్య పాటించే అంశంపై రాజీ పడే ప్రసక్తే ఉండకూడదని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు స్పష్టం చేశారు. ప్రాజెక్టుల నిర్మాణాలు చేసే క్రమంలో ప్రజా భద్రత ముఖ్యమనే విషయాన్ని గుర్తు పెట్టుకోవాలని ఆదేశించారు. రాష్ట్రంలో ప్రాధాన్యత క్రమంలో చేపట్టాల్సిన ఇరిగేషన్ ప్రాజెక్టుల నిర్మాణంపై అసెంబ్లీలోని తన ఛాంబర్‌లో సీఎం చంద్రబాబు సమీక్షించారు. పోలవరం, వెలిగొండ, హంద్రీ-నీవా, పోలవరం-నల్లమల సాగర్ లింక్, చింతలపూడి లిఫ్ట్, వరికపూడిశెల లిఫ్ట్, ఉత్తరాంధ్ర ప్రాజెక్టుల ప్రగతిపై మంత్రి నిమ్మల రామానాయుడు, ఇరిగేషన్ శాఖ ఉన్నతాధికారులతో ముఖ్యమంత్రి సమావేశమయ్యారు. వివిధ ప్రాజెక్టులకు చేపట్టాల్సిన పునరావాస పనులపైనా చర్చించారు.
ఈ సందర్భంగా ముఖ్యమంత్రి మాట్లాడుతూ ‘రాష్ట్ర ప్రభుత్వం ఇరిగేషన్ ప్రాజెక్టుల నిర్మాణానికి ఎంతో ప్రాధాన్యమిస్తోంది. రకరకాల కారణాలతో రాష్ట్రంలో కొన్ని ఇరిగేషన్ ప్రాజెక్టులు సుదీర్ఘ కాలంపాటు ఎన్నికల హామీలుగా మిగిలిపోతున్నాయి. ఉమ్మడి రాష్ట్రంగా ఉన్నప్పుడు శంకుస్థాపనలు చేసిన ప్రాజెక్టులు ఇంకా పూర్తి కాకపోవడం సరికాదు. ఇలాంటి వాటికి చెక్ పెట్టాలి. ప్రాజెక్టులు కట్టాలనే డిమాండ్లు ఎన్నికల హామీలుగా మిగిలిపోకూడదు. ప్రజల అవసరాలను తీర్చేలా ప్రాజెక్టుల నిర్మాణాలను పూర్తి చేయాలి. అందుకే ప్రణాళికాబద్దంగా… ప్రాధాన్యతలను సిద్ధం చేసుకుని ప్రాజెక్టుల నిర్మాణం చేపడుతున్నాం.’ అని చంద్రబాబు అన్నారు.
కేంద్రంతో నిరంతర సమన్వయం అవసరం
గత ప్రభుత్వంలో కీలకమైన పోలవరం ప్రాజెక్టులో డయాఫ్రం వాల్ దెబ్బతినేలా చేశారని చంద్రబాబు అన్నారు. దెబ్బతిన్న డయాఫ్రం వాల్‌కు రిపేర్లు చేసినా సరిపోతుందని నిపుణులు నివేదికలు ఇచ్చినా.. నాణ్యత విషయంలో, ప్రజా భద్రత విషయంలో రాజీ పడకూడదనే ఉద్దేశంతోనే కొత్త డయాఫ్రం వాల్ నిర్మాణం చేపట్టాలని నిర్ణయించామన్నారు. పోలవరం నిర్మాణం విషయంలో కేంద్రంతో నిరంతరం టచ్‌లో ఉండాలని చంద్రబాబు అన్నారు. పోలవరం నిర్మాణానికి సంబంధించిన ప్రతి అప్డేట్ కేంద్రంలోని సంబంధిత వ్యవస్థలకు ఎప్పటికప్పుడు చేర్చాల్సిందేనని స్పష్టం చేశారు.
‘ప్రమాణాలు, నాణ్యత పాటించే విషయం సహా నివేదికల పరంగా, సాంకేతికాంశాల పరంగా, డాక్యుమెంటేషన్ పరంగా ఎలాంటి లోపాలు ఉండకూడదు… తేడాలు రాకూడదు. పోలవరం ప్రాజెక్టు నిర్మాణంలో కేంద్రం సహా ఎవ్వరూ వేలెత్తి చూపే పరిస్థితి రాకూడదు. పోలవరం ప్రాజెక్టు పరిశీలనకు అంతర్జాతీయ స్థాయీ నిపుణులు తరుచూ సందర్శనకు వచ్చేలా చూడండి. వీలు కాకుంటే వీడియో కాన్ఫరెన్సుల ద్వారానైనా వారి సలహాలను స్వీకరించండి. చారిత్రత్మాక నిర్మాణాలు చేపడుతున్నప్పుడు.. జీవనాడి లాంటి ప్రాజెక్టులను చేపడుతున్నప్పుడు అదే స్థాయిలో జాగ్రత్తలు తీసుకోవాలి. ప్రాజెక్టుల నిర్మాణంలో ప్రమాణాలు పాటించే విషయంలో చాలా కచ్చితంగా ఉంటాను.’ అని చంద్రబాబు అన్నారు.
ప్రాజెక్టుల సకాలంలో పూర్తికి చర్యలు
పోలవరం ప్రాజెక్టుపై ప్రతి నెలా సమీక్షిస్తానని సీఎం చంద్రబాబు చెప్పారు. పోలవరం ప్రాజెక్టు నిర్మాణం విషయంలో అధికారులు, కాంట్రాక్టర్లు రిలాక్స్ కావడానికి వీల్లేదన్నారు. పోలవరం లెఫ్ట్ మెయిన్ కెనాల్ పనులు మేఘాద్రిగడ్డ వరకు పూర్తి కావాలని చెప్పారు. రైట్ మెయిన్ కెనాల్‌లో ఇంకా రూ. 200 కోట్ల మేర పనులు పూర్తి చేయాల్సి ఉందన్నారు. వీటిని కూడా ఈ సీజన్లో పూర్తి చేయాలని తెలిపారు. 41.15 మీటర్ల వరకు నీళ్లను నిలిపేందుకు అవసరమైన నిర్మాణ, పునరావాస పనులు కంప్లీట్ కావాలన్నారు. పునరావాసం విషయంలో ఏమైనా ఇబ్బందులు ఎదురైతే… వెంటనే పరిష్కరించుకోవాలి. దీనికి అవసరమైన నిధులు, పరిపాలనా అనుమతుల విషయంలో జాప్యం చేయవద్దన్నారు.
‘వెలిగొండ ప్రాజెక్టు పూర్తి కావడానికి రూ. 2041 కోట్లు అవసరమవుతాయి. ఓవైపు ప్రాజెక్టు నిర్మాణ పనులు చేపడుతూనే.. మరోవైపు పునరావాసం పైనా ఫోకస్ పెట్టాలి. దీనికి అవసరమైన మేరకు విడతల వారీగా నిధులను విడుదల అయ్యేలా ఆర్థిక శాఖ అధికారులతో ఇరిగేషన్ అధికారులు సమన్వయం చేసుకోవాలి. హంద్రీ-నీవా ఫేజ్-1 కెనాల్ వైడనింగ్ 92 శాతం పూర్తి అయింది. కుప్పం-పుంగనూరు కాల్వలను 85 శాతం కంప్లీట్ చేసుకున్నాం. మిగిలిన పనులను త్వరితగతిన పూర్తి చేయాలి. హంద్రీ-నీవా జలాలు మడకశిర వరకు వెళ్లేలా చర్యలు తీసుకోవాలి. నీవా బ్రాంచ్ కెనాల్ ద్వారా చిత్తూరు వరకు నీటిని తీసుకెళ్లాల్సి ఉంటుంది.’ అని చంద్రబాబు అన్నారు.
ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు పోలవరం ప్రాజెక్టును త్వరగా పూర్తి చేయాలని, కేంద్రంతో సమన్వయం చేసుకోవాలని ఆదేశించారు. నాణ్యత విషయంలో రాజీ పడవద్దని ఆయన స్పష్టం చేశారు.


