
📌 Key Points
- వేట్లపాలెం పేలుడు ఘటనలో మృతుల సంఖ్య 22కు చేరింది, మరికొందరు పరిస్థితి విషమంగా ఉంది.
- ప్రభుత్వం మృతుల కుటుంబాలకు రూ. 20 లక్షల చొప్పున పరిహారం ప్రకటించింది, చెక్కులు పంపిణీ చేసింది.
- సూర్యశ్రీ ఫైర్ వర్క్స్ బాణసంచా తయారీ కేంద్రంలో పేలుడు సంభవించింది, 35 మంది కార్మికులు పని చేస్తుండగా ప్రమాదం జరిగింది.
- క్షతగాత్రులకు కాకినాడ జీజీహెచ్ ఆస్పత్రిలో చికిత్స అందిస్తున్నారు, పరిస్థితి విషమంగా ఉండటంతో మృతుల సంఖ్య పెరిగే అవకాశం ఉంది.
కాకినాడ జిల్లా వేట్లపాలెంలో బాణసంచా కర్మాగారంలో జరిగిన భారీ పేలుడులో మృతుల సంఖ్య 22కు చేరింది. ఈ దుర్ఘటనలో తీవ్రంగా గాయపడిన మరికొందరి పరిస్థితి విషమంగా ఉండటంతో, మృతుల సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉంది.
వేట్లపాలెంలో పెరిగిన మరణాల సంఖ్య
కాకినాడ జిల్లా సామర్లకోట మండలం వేట్లపాలెం పేలుడు ఘటనలో మృతుల సంఖ్య పెరిగుతోంది.ఆదివారం రాత్రి 9 గంటల తర్వాత మరోకరు ప్రాణం కోల్పోయారు. దీంతో ఈ ఘటనలో ప్రాణాలు కోల్పోయిన వారి సంఖ్య 22కి చేరింది.
క్రాకర్ యూనిట్ పేలుడులో మృతుల సంఖ్య 22కు చేరినట్లు జిల్లా అధికారి ఒకరు తెలిపారు. ఆదివారం రాత్రి 9 గంటలకు ఒకరు మృతి చెందారని… మృతుల సంఖ్య 22కు పెరిగిందని కాకినాడ జిల్లా వైద్య, ఆరోగ్య అధికారి జే నరసింహా నాయక్ తెలిపారు. ప్రస్తుతం… నాలుగు నుంచి ఐదుగురి పరిస్థితి విషయంగానే ఉందని పేర్కొన్నారు. వీటిలో కొందరికి 90 శాతం వరకు కాలిన గాయాలతో ఉన్నాయని వివరించారు.
ప్రభుత్వం ప్రకటించిన పరిహారం
ప్రస్తుతం క్షతగాత్రులకు కాకినాడ జీజీహెచ్ ఆస్పత్రిలో చికిత్స అందిస్తున్నారు. వీరిలో పలువురి పరిస్థితి విషమంగా ఉండటంతో…. మృతుల సంఖ్య పెరిగే అవకాశం కనిపిస్తోంది.
మరోవైపు మృతుల కుటుంబాలకు రూ. 20 లక్షల చొప్పున పరిహారం ఇస్తున్నట్లు రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించిన సంగతి తెలిసిందే. ఇందుకు సంబంధించిన చెక్కులను కూడా అధికారులు బాధిత కుటుంబాలకు అందించారు. సామర్లకోటకు చెందిన దర్శిపాటి నాని(38), ఏడిద సంపత్ కుమార్(25), జి.మేడపాడు గ్రామానికి చెందిన గంపల మంగ(43), గంపల నాగరాజు(45), గూడపర్తికి చెందిన మందపల్లి చిన్ని(44), గొడత మహేష్(41), గొడత వీరవెంకట రమణ(48), కడింపల్లి ధనరాజు(55), పెదబ్రహ్మదేవంకి చెందిన మకర రాఘవమ్మ(55) ల కుటుంబసభ్యులకు వీటిని అందించారు.
సూర్యశ్రీ ఫైర్ వర్క్స్‌లో ప్రమాదం
కాకినాడ జిల్లాలోని సామర్లకోట మండలంలోని వేట్లపాలెం బాణసంచా తయారీ పరిశ్రమలో శనివారం మధ్యాహ్నం భారీ పేలుడు సంభవించింది. ఈ ఘటనలో పలువురు సజీవ దహనమయ్యారు. భారీ ఎత్తున మంటలు ఎగసిపడడంతో ఆ ప్రాంతమంతా దట్టమైన పొగ వ్యాపించింది.
సూర్యశ్రీ ఫైర్ వర్క్స్ బాణసంచా తయారీ కేంద్రంలో జరిగిన ఈ పేలుడు ఘటనలో 15 మందికిపైగా కార్మికులు సజీవ దహనమయ్యారు. ప్రమాద సమయంలో 35 మంది వరకు కార్మికులు పని చేశారు. పేలుడు ధాటికి మృతదేహాలు చెల్లాచెదురుగా పడిపోయాయి. మరికొందరు చికిత్స పొందుతూ చనిపోయారు. ఇంకా కొందరి పరిస్థితి విషమంగా ఉంది.
వేట్లపాలెం బాణసంచా కర్మాగారంలో జరిగిన ఈ ప్రమాదం తీవ్ర దిగ్భ్రాంతిని కలిగించింది. ప్రభుత్వం సహాయ చర్యలు చేపట్టి, బాధితులకు అండగా నిలబడాలని ప్రజలు కోరుతున్నారు. ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా చూడాలి.


