
📌 Key Points
- హిందూపూర్ వద్ద ఎలక్ట్రానిక్ సిటీ ఏర్పాటుకు సీఎం చంద్రబాబు ఆలోచన.
- అటవీ శాఖ అధికారుల తీరుపై సీఎం అసంతృప్తి వ్యక్తం చేశారు.
- పర్యావరణహిత ప్రాజెక్టులకు అటవీ శాఖ సహకరించాలని సూచన.
- గిరిజన ప్రాంతాల్లో మౌలిక సదుపాయల కల్పనకు ప్రాధాన్యత ఇవ్వాలని సీఎం ఆదేశించారు.
రెండో రోజు కలెక్టర్ల సమావేశంలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు పలు కీలక ప్రకటనలు చేశారు. ముఖ్యంగా హిందూపూర్ వద్ద ఎలక్ట్రానిక్ సిటీ ఏర్పాటు ఆలోచనలో ఉన్నట్లు తెలిపారు. అటవీ శాఖ అధికారుల పనితీరుపై ఆయన అసంతృప్తి వ్యక్తం చేశారు.
హిందూపూర్ ఎలక్ట్రానిక్ సిటీ ఏర్పాటు దిశగా అడుగులు
రెండో రోజు కలెక్టర్ల కాన్ఫరెన్సులో వివిధ శాఖలపై సీఎం చంద్రబాబు సమీక్ష నిర్వహించారు. అటవీ శాఖ అధికారులు పీపుల్స్ ఫ్రెండ్లీగా మారాలంటూ ముఖ్యమంత్రి సూచించారు. పోలీస్ పీపుల్స్ ఫ్రెండ్లీగా మారారు కానీ… ఫారెస్ట్ మారలేకపోతోందంటూ సీఎం కామెంట్ చేశారు. అటవీ శాఖ అధికారుల తీరు వల్ల ఇటీవల కాలంలో ఏర్పడ్డ ఇబ్బందులను సమావేశంలో ప్రస్తావించారు.
ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ రంగంలో పెట్టుబడుల పై జిల్లాల కలెక్టర్లకు వివిధ సూచనలు చేశారు ముఖ్యమంత్రి చంద్రబాబు. ‘హిందూపూర్ వద్ద ఎలక్ట్రానిక్ సిటీ ఏర్పాటుకు ఆలోచిస్తున్నాం. అభివృద్ధికి, మౌలిక సదుపాయల కల్పనకు అటవీ శాఖ సహకరించాలి. నాలుగోసారి సీఎంగా చేస్తున్నాను.. కానీ గతంలో ఎన్నడూ లేని విధంగా ఈసారి అటవీ శాఖ విషయంలో చాలా ఫిర్యాదులు వస్తున్నాయి. దీనిపై ఇప్పటికే డిప్యూటీ సీఎంతో మాట్లాడాను. మళ్లీ మరోసారి మాట్లడతాను. పోలీసు డిపార్ట్మెంట్ పీపుల్ ఫ్రెండ్లీగా మారిపోయింది… కానీ ఫారెస్టు డిపార్టుమెంట్ పీపుల్ ఫ్రెండ్లీగా లేరు. గ్రీన్ కవర్ పెంచండి, బయోడైవర్సిటీకి వెళ్లాలి. ప్రజలు ఆహ్లాదంగా పర్యటించేందుకు ఉపయుక్తంగా పరిస్థితులు మారాలి.’ అని చంద్రబాబు అన్నారు.
ఫారెస్టు అధికారులు జిల్లా కలెక్టర్ కిందే పనిచేయాలని గుర్తుంచుకోవాలని చంద్రబాబు అన్నారు. కలెక్టర్లు చెబుతున్నా… అటవీ అధికారులు పట్టించుకోవడం లేదని ఫిర్యాదులు వస్తున్నాయన్నారు. నిబంధనలకు అనుగుణంగానే పర్యావరణహిత ప్రాజెక్టులకు సహకరించాలని చెప్పారు.
అటవీ శాఖ అధికారులపై సీఎం చంద్రబాబు ఆగ్రహం
సర్వే చేస్తున్న సమయంలో ప్రైవేటు, అటవీ, ఎండోమెంట్ తదితర క్లాసిఫికేషన్ల ప్రకారం రిజర్వు ల్యాండ్ ను గుర్తించాలని సీఎం చెప్పారు. కొందరు అటవీ శాఖ అధికారుల ఇంప్రాక్టికల్ థింకింగ్ వల్ల ఇబ్బందులు వస్తున్నాయన్నారు. గిరిజన ప్రాంతాల్లో కూడా మౌలిక సదుపాయాలు కల్పించకపోతే ఎలా..? అని ప్రశ్నించారు. శ్రీశైలంలో వస్తున్న భక్తులను అటవీ శాఖ అధికారులు అడ్డుకున్నారని, ఆ తర్వాత రోజు తొక్కిసలాట అయ్యే పరిస్థితి వచ్చిందన్నారు.
‘బద్వేలులోనూ అటవీ శాఖ ఇదే తరహాలో అటవీశాఖ వ్యవహరించింది. పోర్టులు, ఎయిర్ పోర్టులు, రైల్వే లాంటి ఇన్ఫ్రా ప్రాజెక్టులపై ప్రత్యేక దృష్టి పెట్టాలి. హిందుపూర్ దగ్గర ఓ ఎలక్ట్రానిక్స్ సిటీని ఏర్పాటు చేయాలని ఆలోచన చేస్తున్నాం. రతన్ టాటా ఇన్నోవేషన్ హబ్ ద్వారా వినూత్న ఆలోచనలు చేయాలి. స్టార్టప్ కంపెనీలు, యువతలో ఉన్న ఇన్నోవేషన్లను ప్రొత్సహించేందుకు RTIH అధికారులు పని చేయాలి. RTIHను మరింత యాక్టీవ్ చేయాల్సిన అవసరం ఉంది. వినూత్నంగా ఆలోచిస్తారు కాబట్టే… RTIHకు యువ అధికారులను నియమించాం.’ అని సీఎం చంద్రబాబు చెప్పారు
యువ అధికారులకు సీనియర్లు సహకరించాలని కోరారు. వారికి హ్యండ్ హోల్డింగ్ అందించాలని చెప్పారు. నాలెడ్జి ఎకనామీ పెరిగేలా సేవల రంగాన్ని గణనీయంగా ప్రోత్సహించాలని, జిల్లాల్లో వచ్చిన పెట్టుబడులు, ఉద్యోగాలు, తలసరి ఆదాయం ఎంతమేర పెంచాం అన్నదానిపై జిల్లా కలెక్టర్లు దృష్టి పెట్టాలన్నారు. తదుపరి సమావేశం నుంచి ఏ జిల్లా కలెక్టర్ ఎంతమేర పరిశ్రమల్ని ప్రోత్సహించారన్న దానిపై సమీక్షిస్తానని చెప్పారు.
పర్యావరణ ప్రాజెక్టులకు సహకరించాలని సూచన
పులికాట్ సరస్సులో పర్యాటక ప్రాజెక్టును ప్రతిష్టాత్మక కంపెనీలకు అప్పగించి అభివృద్ధి చేయాలని చంద్రబాబు అన్నారు. సూర్యలంక, గండికోట ప్రాజెక్టుల వద్ద పర్యాటక ఎకోసిస్టంను కూడా పూర్తిస్థాయిలో అభివృద్ధి చేయాలని సూచించారు. స్థానికుల్ని ఈ ప్రాజెక్టుల్లో భాగస్వామ్యం చేయటం ద్వారా వేగంగా అభివృద్ధి జరుగుతుందని వెల్లడించారు. జాతీయ రహదారులపై వే సైడ్ అమెనిటీస్, ఈవీ ఛార్జింగ్ స్టేషన్లు, నైట్ హాల్ట్ కోసం గదులు నిర్మాణం చేపడితే పెట్టుబడులు వస్తాయని తెలిపారు.
‘ఏపీ ఐఐసీ ద్వారా చేసే ల్యాండ్ అలాట్మెంట్‌లో 5 ఎకరాల వరకూ కేటాయింపులు చేసేలా జిల్లా కలెక్టర్లకు ఆథరైజేషన్ ఇచ్చేలా చర్యలు తీసుకోవాలి. విజయవాడలోని డిస్నీల్యాండ్, భవానీ ఐ ల్యాండ్ లను పర్యాటకంగా అభివృద్ధి చేద్దాం.’ అని చంద్రబాబు అన్నారు.
మరోవైపు సంజీవని ప్రాజెక్టు , వేసవి కార్యాచరణ ప్రణాళిక అమలుపై వైద్య ఆరోగ్యశాఖ కార్యదర్శి సౌరబ్ గౌర్ ప్రెజెంటేషన్ ఇస్తూ… రాష్ట్రంలో రతన్ టాటా ఇన్నోవేషన్ హబ్ సహకారంతో సంజీవని ప్రాజెక్టును అమలు చేయడం జరుగుతుందని వివరించారు.ఇందుకు సంబంధించి రతన్ టాటా సంస్థ ఒక మంచి ప్లాట్ ఫామ్ ను అందించిందని దీంతో ఎఐ ఆధారిత డయాగ్నొస్టిక్ విధానంతో సేవలు నిర్వహించడం జరుగుతుందని తెలిపారు. అంతేగాక రతన్ టాటా ఇన్నోవేషన్ హబ్‌లో మెడ్ టెక్ పోర్టల్ ఎఐ టూల్స్ ద్వారా వివిధ డయాగ్నొస్టిక్ టెస్టులు నిర్వహణ జరుగుతుందని వివరించారు.
ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు తీసుకుంటున్న ఈ నిర్ణయాలు రాష్ట్ర అభివృద్ధికి ఎంతవరకు దోహదపడతాయో వేచి చూడాలి. అటవీ శాఖ పనితీరు మెరుగుపడాలని ఆయన ఆకాంక్షించారు.


