|

Andhravilas.net – Breaking News & Movie Buzz Since 2002

చంద్రబాబు సంచలన నిర్ణయం: విద్యుత్ ఛార్జీలు తగ్గించేందుకు వ్యూహం! ఎనర్జీ యూనివర్సిటీ ఏర్పాటుకు గ్రీన్ సిగ్నల్!

Published: 24-03-2026, 12:35 PM
చంద్రబాబు సంచలన నిర్ణయం: విద్యుత్ ఛార్జీలు తగ్గించేందుకు వ్యూహం! ఎనర్జీ యూనివర్సిటీ ఏర్పాటుకు గ్రీన్ సిగ్నల్!
  • విద్యుత్ కొనుగోలు ధరను యూనిట్‌కు రూ.4కు తగ్గించాలని సీఎం ఆదేశం
  • 2028-29 నాటికి విద్యుత్ కొనుగోలు ఖర్చు తగ్గించేందుకు ప్రణాళికలు సిద్ధం
  • గ్రీన్ ఎనర్జీపై దృష్టి సారించాలని చంద్రబాబు సూచన
  • వ్యవసాయ పంపు సెట్లకు పీఎం కుసుమ్ పథకం వినియోగంపై అవగాహన కల్పించాలని ఆదేశం

విద్యుత్ కొనుగోలు ధరలను తగ్గించేందుకు ప్రభుత్వం చర్యలు చేపడుతోంది. యూనిట్ విద్యుత్ ధరను రూ.4కు తగ్గించాలని, ప్రజలపై భారం పడకుండా విద్యుత్ సంస్థల రుణాలు తీర్చేందుకు కార్యాచరణ చేపట్టాలని సీఎం చంద్రబాబు ఆదేశించారు.

విద్యుత్ కొనుగోళ్లపై సీఎం సమీక్ష

విద్యుత్ కొనుగోలు ఛార్జీలను తగ్గించే అంశంపై అధికారులు పూర్తి స్థాయిలో దృష్టి పెట్టాలని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఆదేశించారు. ఇప్పటికే ఈ దిశగా చేపడుతున్న చర్యలను మరింత ముమ్మరం చేయాలన్నారు. ప్రభుత్వం చేపట్టే విద్యుత్ కొనుగోలు ధరను యూనిట్‌కు రూ.4కు తగ్గించటంతో పాటు ప్రజలపై భారం వేయకుండా విద్యుత్ సంస్థల రుణాలు తీర్చేందుకు కార్యాచరణ చేపట్టాలని సూచించారు. సచివాలయంలో జరిగిన విద్యుత్ శాఖ సమీక్షలో సీఎం కీలక సూచనలు చేశారు.

2028-29 నాటికి విద్యుత్ కొనుగోళ్ల ఖర్చును తగ్గించేందుకు చేపట్టిన ప్రణాళికలను విద్యుత్ శాఖ అధికారులు సీఎం చంద్రబాబు ముందుంచారు. విద్యుత్ రంగంలోని వివిధ విభాగాల ద్వారా సంస్కరణలు చేపడితే మొత్తంగా యూనిట్ కు రూ.1.32 చొప్పున విద్యుత్ కొనుగోలు భారాన్ని తగ్గించవచ్చని ముఖ్యమంత్రి కి వివరించారు. 2028-29 నాటికి యూనిట్ కొనుగోలు ధరను రూ.4.10కు తెచ్చేలా చర్యలు తీసుకుంటున్నట్టు అధికారులు వివరించారు.

రూ.4కు ఈ కొనుగోలు ధరను తగ్గించేలా చూడాలని సీఎం ఆదేశించారు. నూతన టెక్నాలజీని, ఇన్నోవేషన్లను వినియోగించుకుని విద్యుత్ పొదుపు చర్యలు చేపట్టాలని సీఎం సూచించారు. విద్యుత్ సంస్థల సమర్థ నిర్వహణతో 2025-26 ఆర్థిక సంవత్సరానికి సుమారు రూ.339 కోట్ల మేర ఆదా చేశామని.. ఈ తరహా పొదుపు చర్యలను మరింతగా తీసుకోవాలని అధికారులకు ముఖ్యమంత్రి చెప్పారు.

రూ.4కే యూనిట్ విద్యుత్ అందించేలా చర్యలు

‘ఉమ్మడి రాష్ట్రంలో విద్యుత్ సంస్కరణలను తెచ్చాం. దీని ఫలితాలు ప్రజలకు అందుతున్నాయి. ప్రజలకు మేలు చేయడానికి రిస్క్ తీసుకుని మరీ విద్యుత్ సంస్కరణలు అమలు చేశాం. ఎనర్జీ ఆడిటింగ్ అనే విధానాన్ని ఉమ్మడి రాష్ట్రంలోనే దేశంలో తొలిసారిగా చేపట్టాం. ఇప్పుడు విద్యుత్ రంగంలో అనేక మార్పులు వస్తున్నాయి. ప్రపంచ వ్యాప్తంగా గ్రీన్ ఎనర్జీ వైపు అడుగులు పడుతున్నాయి. రాబోయే రోజుల్లో ఎనర్జీ రంగం గేమ్ ఛేంజర్ కానుంది. తక్కువ ఖర్చుతో విద్యుత్ ఉత్పత్తి, పర్యావరణ హిత విద్యుత్ ఉత్పత్తి వంటి అంశాలపై ప్రపంచ దేశాలు మొగ్గు చూపుతున్నాయి.’ అని చంద్రబాబు అన్నారు.

పీఎం సూర్యఘర్ పథకాన్ని ప్రజలకు మరింత చేరువ చేయాలని చంద్రబాబు అన్నారు. వ్యవసాయ పంపు సెట్లకు పీఎం కుసుమ్ పథకం వినియోగించుకునేలా రైతుల్లో అవగాహన కల్పించాలన్నారు. సోలార్ విద్యుత్ ఉత్పత్తి విషయంలో దక్షిణ భారత దేశంలో ఏపీనే ముందు వరుసలో ఉందన్నారు.

గ్రీన్ ఎనర్జీకి ప్రాధాన్యత ఇవ్వాలని సూచన

‘ఎనర్జీ రంగంలో వస్తున్న మార్పులను ఎప్పటికప్పుడు గమనిస్తూ ఉండండి. ఇతర దేశాల్లో విద్యుత్ రంగంలో జరుగుతున్న పరిణామాల్ని అధ్యయనం చేయండి. టెక్నాలజీని అందిపుచ్చుకునేలా ఏర్పాటు చేసిన సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ ఫర్ ఎనర్జీ ట్రాన్సిషన్ ను మరింత బలోపేతం చేయాల్సిన అవసరం ఉంది. విద్యుత్ రంగంలోని టెక్నాలజీలను.. ఇన్నోవేషన్లను ప్రొత్సహించేలా ఎనర్జీ యూనివర్శిటీని ఏర్పాటు చేయాలి. విద్యుత్ రంగంలో ఆవిష్కరణలను ప్రొత్సహించాలి.’ అని చంద్రబాబు చెప్పారు.

స్టార్టప్ కంపెనీలకు అవసరమైన మేరకు మార్జిన్ మనీ సమకూర్చేలా విద్యుత్ సంస్థలు చర్యలు తీసుకోవాలని చంద్రబాబు ఆదేశించారు. దీని కోసం ప్రత్యేకంగా ఇంక్యుబేషన్ ఫండ్ ఏర్పాటు చేసి స్టార్టప్ కంపెనీలకు ఆర్థికంగా చేయూత అందించాలన్నారు. ఇతర రాష్ట్రాల సంస్థలకు కన్సల్టెన్సీ సేవలు అందించేలా ఏపీ విద్యుత్ సంస్థలు ఎదగాలన్నారు.

ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు విద్యుత్ రంగంలో సమూల మార్పులు తీసుకురావడానికి కృతనిశ్చయంతో ఉన్నారు. ప్రజలకు తక్కువ ధరకే నాణ్యమైన విద్యుత్ అందించాలనే లక్ష్యంతో ఆయన ముందుకు సాగుతున్నారు.

Related News

Plugin developed by ProSEOBlogger
Plugin developed by ProSEOBlogger. Get free Ypl themes.