
📌 Key Points
- కేంద్రం ‘పీయూసీసీ 3.0’ పేరుతో వాహన కాలుష్య నియంత్రణ సర్టిఫికెట్లలో మార్పులు.
- ఆరేళ్ల లోపు బీఎస్6 ప్రైవేట్ వాహనాలకు పీయూసీసీ గడువు 3 ఏళ్లకు పెంపు.
- బీఎస్4 వాహనాలకు ప్రతి 6 నెలలకు, బీఎస్1-బీఎస్3 వాహనాలకు ప్రతి 3 నెలలకు రెన్యువల్ తప్పనిసరి.
- కాలుష్య నియంత్రణ, పర్యావరణ పరిరక్షణ లక్ష్యంగా ఈ కీలక నిర్ణయం.
దేశంలో కాలుష్యం పెరుగుతున్న నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం వాహన కాలుష్య నియంత్రణ (PUCC) సర్టిఫికెట్ల జారీ విధానంలో కీలక మార్పులు తీసుకురానుంది. ‘పీయూసీసీ 3.0’ పేరుతో కొత్త విధానాన్ని ప్రవేశపెట్టేందుకు రవాణా శాఖ కసరత్తు చేస్తోంది. ఇది కొన్ని వాహనదారులకు ఊరటనిస్తే, మరికొందరికి కఠిన నిబంధనలను విధించనుంది.
కొత్త పీయూసీసీ 3.0 విధానం
దేశంలో వాహనాల సంఖ్య రోజు రోజుకు గణనీయంగా పెరిగిపోతుంటే అంతే వేగంగా కాలుష్యం కోరలు చాస్తోంది. దీనికి గడువు తీరిన వాహనాలు ఒక కారణమైతే.. కాలుష్య ధ్రువీకరణ చేసుకోకుండా యథేచ్ఛగా తిరిగే వాహనాలు మరో ప్రధాన కారణం. ఈ నేపథ్యంలో దేశంలో వాహనాల కాలుష్య నియంత్రణ (PUCC) సర్టిఫికెట్ల జారీ విధానంలో కేంద్ర ప్రభుత్వం కీలక మార్పులు తీసుకురావడానికి సిద్ధమవుతున్నట్లు తెలుస్తోంది. ‘పీయూసీసీ 3.0’ (PUCC 3.0) పేరుతో కొత్త విధానాన్ని ప్రవేశపెట్టేందుకు రవాణా శాఖ కసరత్తు చేస్తోందని ఇందులో భాగంగా బీఎస్ 6 వాహనాదారులకు భారీ ఊరట కల్పిస్తూ బీఎస్ 4 వాహనదారులకు బిగ్ షాక్ ఇవ్వబోతున్నట్లు తెలుస్తోంది. ఈ మేరకు పీయూసీసీ మార్పులపై తాజాగా జాతీయ మీడియాలో వస్తున్న కథనాలు చర్చగా మారాయి.
బీఎస్6 వాహనాలకు ఊరట
ప్రస్తుతం ఏదైనా వాహనం రోడ్లపై ప్రయాణం చేయాలంటే పొల్యూషన్ అండర్ కంట్రోల్(పీయూసీ) సర్టిఫికెట్ తప్పనిసరి. అయితే ఇప్పటి వరకు పీయూసీ సర్టిఫికెట్ రెన్యువల్ ప్రతి యేడాది చేసుకోవాలనే నిబంధనలో కీలక మార్పులు చేయబోతున్నట్లు తెలుస్తోంది. ఈ మార్పుల్లో భాగంగా ఇకపై ఆరు సంవత్సరాల లోపు వయసు కలిగి ఉన్న బీఎస్ 6 ప్రైవేట్ వాహనాలకు పీయూసీసీ సర్టిఫికేట్ రెన్యువల్ ను 3 మూడేళ్లకు పెంచే యోచనలో ఉన్నట్లు తెలుస్తోంది. బీఎస్-6 (BS-VI) వాహనాలు పర్యావరణానికి తక్కువ హాని కలిగిస్తాయి. ఎస్-4 వాహనాలతో పోలిస్తే బీఎస్-6 వాహనాలు 82 శాతం తక్కువ పర్టిక్యులేట్ మ్యాటర్ (PM), 25 శాతం తక్కువ నైట్రోజన్ ఆక్సైడ్లను (NOx) విడుదల చేస్తాయి. ఈ నేపథ్యంలో ఆరేళ్ల లోపు వయసున్న బీఎస్-6 ప్రైవేట్ వాహనాలకు పొల్యూషన్ సర్టిఫికెట్ చెల్లుబాటు కాలాన్ని 3 సంవత్సరాలకు పొడిగించాలని అదే సమయంలో ఆరేళ్ల కంటే పై వయసు ఉన్న వాహనాలకు ఏడాదికి ఒకసారి పీయూసీసీ రెన్యువల్ చేసుకునేలా మార్పులు తీసుకురాబోతున్నట్లు తెలుస్తోంది.
పాత వాహనాలకు కఠిన నిబంధనలు
ఇక మార్చి 2020 కంటే ముందు తయారైన పాత బీఎస్-4 ప్రైవేట్ వాహనాలకు ప్రస్తుతం ఏడాదికి ఒకసారి ఉన్న నిబంధనను మార్చివేసి ప్రతి 6 నెలలకు ఒకసారి రెన్యువల్ చేసుకునేలా ప్రతిపాదనలు సిద్ధం చేసినట్లు తెలుస్తోంది. చాలా పాతవైన I నుండి BS-III వాహనాలకు ప్రస్తుతం ఉన్న ఆరు నెలల గడువును తగ్గించి ప్రతి 3 నెలలకు ఒకసారి పొల్యూషన్ సర్టిఫికెట్ తీసుకోవడాన్ని తప్పనిసరి చేయబోతున్నట్లు సమాచారం.
ఈ కొత్త నిబంధనలు కాలుష్య నియంత్రణకు దోహదపడతాయని ప్రభుత్వం ఆశిస్తోంది. అయితే, పాత వాహనదారులపై ఆర్థిక భారం పెరిగే అవకాశం ఉంది. ఈ మార్పులు దేశవ్యాప్తంగా వాహన రంగంపై గణనీయమైన ప్రభావాన్ని చూపనున్నాయి.


