
📌 Key Points
- ‘బరాబర్ ప్రేమిస్తా’ సినిమా చూసిన తర్వాత చంద్రహాస్ ఎమోషనల్ అయ్యారు.
- సినిమాపై నెగెటివ్ పబ్లిసిటీ ప్రభావం చూపిందని చంద్రహాస్ ఆవేదన వ్యక్తం చేశారు.
- చంద్రహాస్ ప్రవర్తనపై నెటిజన్లు తీవ్రంగా స్పందించారు.
- హైదరాబాద్ ఏఎమ్‌బి సినిమాస్‌లో సినిమా చూసేందుకు వెళ్లిన చిత్ర యూనిట్.
హీరో చంద్రహాస్ నటించిన ‘బరాబర్ ప్రేమిస్తా’ చిత్రం విడుదల అయింది. అయితే, సినిమా చూసిన అనంతరం చంద్రహాస్ ఎమోషనల్ అయ్యారు. ప్రేక్షకులు లేకపోవడంతో తన పాట వల్లనే ఇలా జరిగిందా అని కన్నీళ్లు పెట్టుకున్నారు. ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.
చంద్రహాస్ ఎమోషనల్ వీడియో వైరల్
Chandrahass: ‘నేను కొంతమందికి నచ్చుతుందేమోనని అలా పాట పాడాను. అది సినిమాపై ఎఫెక్ట్ పడుతుందేమోనని నాకు చాలా భయం వేస్తుంది సార్’ అంటూ చంద్రహాస్ (Chandrahass) ఎమోషనల్ అవుతున్న వీడియో ఒకటి సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. చంద్రహాస్ హీరోగా ‘బరాబర్ ప్రేమిస్తా’ (Barabar Premistha) చిత్రం ఫిబ్రవరి 6వ తేదీన విడుదలైన విషయం తెలిసిందే. ఈ సినిమాను చూసిన అనంతరం మీడియాతో మాట్లాడుతూ.. చంద్రహాస్ ఎమోషనల్ అయ్యారు. ఈ వీడియో చూసిన వాళ్లంతా చేసిందంతా చేసి ఇప్పుడు ఏడిస్తే ఏం లాభం అంటూ కామెంట్స్ చేస్తుండటం విశేషం. నిజమే, సినిమాపై అంత నమ్మకం ఉన్నప్పుడు అలాంటి నెగిటివ్ పబ్లిసిటీ జోలికి పోకుండా, ఉన్న కంటెంట్‌నే ఇంకా ప్రమోట్ చేసుకోవాల్సింది. అలా చేయకుండా, సినిమాకు సంబంధమే లేని ఓ బూతు పాటని పబ్లిగ్గా పాడి, అల్లరల్లరి అవుతున్నాడు చంద్రహాస్. అదేమని అంటే, లాయర్లు అనే స్టేజ్‌కి వెళ్లిపోయాడు.
సినిమాపై నెటిజన్ల కామెంట్స్
ఇప్పుడు తీరా సినిమా విడుదలైన తర్వాత భోరున విలపిస్తే ఎవరు నమ్ముతారు. ఎవరు ఓదార్చుతారు. కొత్తగా ఇండస్ట్రీలోకి వచ్చిన వారెవరైనా సరే, క్రమశిక్షణతో ఉండాలి. నీ క్రమశిక్షణ ఇప్పుడు కాకపోతే ఇంకోసారైనా ప్రేక్షకులను ఆకర్షిస్తుంది. మంచి సక్సెస్‌ని ఇస్తుంది. నువ్వు ఎన్ని పాటలు పాడినా, ఎంత డ్యాన్స్ చేసినా, ఎంతగా నటించినా, చివరికి నీకు పేరు తెచ్చేది మాత్రం క్రమశిక్షణే అనే విషయం ఇకనైనా చంద్రహాస్ గమనిస్తే మంచిది. అలా కాకుండా.. ఇంకా ఇంకా ఇలానే యాటిట్యూడ్ చూపించుకుంటూ వెళితే మాత్రం ఎవరి కర్మకు ఎవరు బాధ్యులు అనే డైలాగ్స్ వినాల్సి వస్తుంది. ఇకనైనా చంద్రహాస్ కాస్త జాగ్రత్తలు వహిస్తే, అతని కెరీర్‌కే బెటర్ అనేలా సినీ విమర్శకులు, నెటిజన్లు ఈ కుర్రహీరోకి సలహాలు ఇస్తున్నారు.
థియేటర్లో సినిమా చూసిన చంద్రహాస్
ఇక చంద్రహాస్ ఏడుపు విషయానికి వస్తే.. శనివారం ఈ సినిమాను హైదరాబాద్‌లోని ఏఎమ్‌బి సినిమాస్‌లో చూసేందుకు చిత్ర టీమ్ వెళ్లింది. అక్కడ థియేటర్‌లో తన సినిమాను చూసేందుకు ప్రేక్షకులు ఎవరూ లేకపోవడంతో, తను పాడిన పాటే కారణమైందా? అది ఈ సినిమాపై ఎఫెక్ట్ చూపిస్తుందా? అనేలా చంద్రహాస్ ఎమోషనల్ అయ్యాడు. పక్కనున్న చిత్రయూనిట్ అతడిని ఓదారుస్తున్నారు. ఏదైనా చేసే ముందు కాస్త వెనుకా, ముందు ఆలోచించుకుంటే బెటర్. సరే, అయిపోయిందేదో అయిపోయిందని, కనీసం సారీ చెప్పకుండా.. మళ్లీ ఎదురుగా యాటిట్యుడ్ ప్రదర్శిస్తూ వీడియోలు. ప్రేక్షకులేం పిచ్చోళ్లు కాదు.. ఎవరిని ఎక్కడ ఉంచాలో వారికి తెలుసు.. అనేలా నెటిజన్లు ఈ వీడియోకు కామెంట్స్ చేస్తున్నారు. ఇంకా దారుణంగానే ఉన్నాయి కామెంట్స్. కానీ ఇక్కడ రాస్తే బాగోదు.
సినిమా విడుదల తర్వాత చంద్రహాస్ ఎమోషనల్ అవ్వడం, నెటిజన్లు అతనిపై విమర్శలు చేయడం చర్చనీయాంశంగా మారింది. ఇకనైనా చంద్రహాస్ జాగ్రత్తగా ఉండాలని పలువురు సూచిస్తున్నారు.


