
📌 Key Points
- భారత్, చైనాలు స్నేహ సంబంధాలు కాపాడుకోవాలని చైనా విదేశాంగ మంత్రి వాంగ్ యీ అన్నారు.
- సరిహద్దు ప్రాంతాల్లో శాంతి, ఇరు దేశాల అభివృద్ధిపై దృష్టి సారించాలని సూచన.
- భారత్, చైనాలు ఒకరికొకరు ముప్పుగా కాకుండా అవకాశంగా చూడాలని వెల్లడి.
- అమెరికా తన వైఖరిని మార్చుకొని చర్చల ద్వారా సమస్యలు పరిష్కరించుకోవాలని హితవు.
భారత్ మరియు చైనా దేశాల మధ్య సత్సంబంధాలు కొనసాగించాలని చైనా విదేశాంగ మంత్రి వాంగ్ యీ అభిప్రాయపడ్డారు. సరిహద్దు ప్రాంతాల్లో శాంతి నెలకొనాలని, ఇరు దేశాలు అభివృద్ధిపై దృష్టి సారించాలని ఆయన పేర్కొన్నారు. ఇరు దేశాల సంబంధాలపై ఆయన కీలక వ్యాఖ్యలు చేశారు.
భారత్-చైనా మైత్రిపై వాంగ్ యీ వ్యాఖ్యలు
భారత్, చైనాలు సత్సంబంధాలు, మైత్రీని కాపాడుకోవాలని చైనా చైనా అగ్రశ్రేణి దౌత్యవేత్త, విదేశాంగ మంత్రి వాంగ్ యీ (Wang Yi) తెలిపారు. సరిహద్దు ప్రాంతాల్లో శాంతి, అలాగే ఇరు దేశాల అభివృద్ధిపై దృష్టి సారించాలని అన్నారు. ఆదివారం బీజింగ్‌లో జరిగిన వార్షిక రాజకీయ సమావేశాల (‘టూ సెషన్స్’) సందర్భంగా ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. భారత్, చైనా దేశాలు పత్యర్థుల్లా కాకుండా కలిసి ఉండాలని మంత్రి కీలక వ్యాఖ్యలు చేశారు. ఒకరికొకరు ముప్పు అని భావించకుండా, అభివృద్ధికి తోడ్పడే అవకాశంగా చూడాలని వెల్లడించారు. 2024 నుంచే కజాన్ వేదికగా మోడీ, అధ్యక్షుడు జిన్‌పింగ్‌ల సమావేశం అనంతరం రెండు దేశాల మధ్య సంబంధాల్లో కొత్త అధ్యాయం మొదలైందని వివరించారు.
సరిహద్దుల్లో శాంతి, అభివృద్ధికి పిలుపు
పశ్చిమాసియాలో నెలకొన్న యుద్ధ వాతావరణంపై స్పందించారు. ‘పిడికిలి బలంగా ఉన్నంత మాత్రాన అది న్యాయం అనిపించుకోదు.. ప్రపంచం మళ్లీ అడవి చట్టం (Law of the Jungle) వైపు వెళ్లకూడదు’ అని ఆయన స్పష్టం చేశారు. ఇరాన్‌పై అమెరికా, ఇజ్రాయెల్ జరిపిన దాడుల వల్ల మొదలైన ఈ యుద్ధం అసలు జరిగి ఉండకూడదని వాంగ్ యీ అభిప్రాయపడ్డారు. ముఖ్యంగా ఇరాన్ అత్యున్నత నేత ఆయతుల్లా అలీ ఖమేనీ మృతికి దారి తీసిన పరిణామాలను చైనా ఇదివరకే తీవ్రంగా ఖండించిన విషయాన్ని ఆయన గుర్తు చేశారు. అమెరికా తన మొండి వైఖరిని వీడి, బీజింగ్‌తో ఉన్న విభేదాలను చర్చల ద్వారా పరిష్కరించుకోవాలని ఆయన సూచించారు.
అమెరికా మొండి వైఖరిని వీడాలన్న చైనా
అమెరికా అధ్యక్షుడిగా డొనాల్డ్ ట్రంప్ తిరిగి బాధ్యతలు చేపట్టిన తర్వాత ఇరు దేశాల మధ్య సంబంధాలు మరింత క్షీణించాయని వాంగ్ యీ పేర్కొన్నారు. వాణిజ్య యుద్ధం, పరస్పరం సుంకాల విధింపు వంటి చర్యలు ఉద్రిక్తతలను పెంచాయని విమర్శించారు. ‘ఈ ఏడాది చైనా-అమెరికా సంబంధాలకు అత్యంత కీలకం. ఇరు దేశాలు పరస్పర విభేదాలను పక్కనపెట్టి, సరైన వాతావరణంలో సంబంధాలను మెరుగు పరుచుకోవాలి’ అని ఆయన పిలుపునిచ్చారు.
భారత్, చైనా సంబంధాలు మెరుగుపడాలని చైనా కోరుకుంటుంది. సరిహద్దు వివాదాలను పరిష్కరించుకుంటే రెండు దేశాలకు మంచిదని విశ్లేషకులు భావిస్తున్నారు. ఈ దిశగా ఇరు దేశాలు ఎలా అడుగులు వేస్తాయో చూడాలి.


