
📌 Key Points
- 2026 జనాభా లెక్కల ప్రకారమే డీలిమిటేషన్ జరగాలని సీఎం రేవంత్ రెడ్డి డిమాండ్.
- దక్షిణాది రాష్ట్రాలకు అన్యాయం చేసేందుకు కేంద్రం కుట్ర చేస్తోందని రేవంత్ రెడ్డి ఆరోపణ.
- మహిళా రిజర్వేషన్ బిల్లుకు కాంగ్రెస్ పార్టీ సంపూర్ణ మద్దతు తెలుపుతోందని ప్రకటన.
- డీలిమిటేషన్ తర్వాత దక్షిణాదిలో లోక్‌సభ స్థానాలు తగ్గిపోయే ప్రమాదం ఉందని సీఎం ఆందోళన.
ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి 2026 జనాభా లెక్కల ప్రకారమే నియోజకవర్గాల పునర్విభజన జరగాలని డిమాండ్ చేశారు. కేంద్ర ప్రభుత్వం దక్షిణాది రాష్ట్రాలకు అన్యాయం చేసేందుకు కుట్ర చేస్తోందని ఆయన ఆరోపించారు. మహిళా రిజర్వేషన్ బిల్లుకు కాంగ్రెస్ పార్టీ మద్దతు తెలుపుతోంది.
2026 జనాభా లెక్కల ప్రకారమే డీలిమిటేషన్: సీఎం రేవంత్ రెడ్డి డిమాండ్
రాజకీయాల్లో మహిళలకు రిజర్వేషన్లు కల్పించిన తొలి పార్టీ కాంగ్రెస్సేనని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అన్నారు. విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. 2011 జనాభా లెక్కల ప్రకారం నియోజకవర్గాల పునర్విభజన ప్రక్రియను చేపట్టాలని ఎన్డీఏ ప్రభుత్వం యోచిస్తోందని అన్నారు. అయితే 2026 జనాభా లెక్కల ప్రకారం నియోజకవర్గాల పునర్విభజన, మహిళా రిజర్వేషన్లను అమలు చేయాలని కాంగ్రెస్ డిమాండ్ చేసింది.
ఆ రెండింటినీ కలిపి, పాత జనాభా లెక్కల ఆధారంగా ప్రక్రియను ముందుకు తీసుకెళ్లడం కుట్ర తప్ప మరేమీ కాదని సీఎం రేవంత్ రెడ్డి అన్నారు. మహిళలకు 33 శాతం రిజర్వేషన్‌కు కాంగ్రెస్ మద్దతు ఇస్తోందని పేర్కొంటూ, ఆరు నెలల్లో ఈ రిజర్వేషన్లను కేంద్రం అమలు చేయాలని డిమాండ్ చేశారు.
‘నియోజకవర్గాల పునర్విభజన ప్రక్రియ చాలా ప్రమాదకరమైన దిశగా సాగుతోంది. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ చిన్న రాష్ట్రాలకు, దక్షిణాదికి అన్యాయం చేయడానికి ప్రయత్నిస్తున్నారు. దక్షిణాది రాష్ట్రాలు కుటుంబ నియంత్రణను సమర్థవంతంగా అమలు చేశాయి. ఉత్తరాదిలో సరైన అమలు లేకపోవడం వల్ల జనాభా పెరిగింది. జనాభా ఆధారంగా సీట్ల సంఖ్యను పెంచకూడదని దక్షిణాది రాష్ట్రాలు స్పష్టంగా తెలియజేశాయి.’ అని రేవంత్ రెడ్డి అన్నారు.
దక్షిణాది రాష్ట్రాలకు కేంద్రం అన్యాయం చేస్తోందన్న సీఎం
దక్షిణ రాష్ట్రాల నుంచి తీవ్ర వ్యతిరేకత ఎదురవడంతో రాష్ట్రాల్లో సీట్లను 50 శాతం పెంచుతామని హామీ ఇస్తూ కేంద్రం మరో ప్రతిపాదనతో ముందుకు వచ్చిందని రేవంత్ రెడ్డి అన్నారు. సీట్లను పెంచాలనుకుంటే కేంద్రం అఖిలపక్ష సమావేశాన్ని ఏర్పాటు చేయాలన్నారు. నియోజకవర్గాల పునర్విభజనకు సంబంధించిన ఏ బిల్లునైనా రాష్ట్రాల అభిప్రాయం తీసుకున్న తర్వాతే ప్రవేశపెట్టాలని రేవంత్ రెడ్డి అన్నారు.
పార్లమెంటు లో బిల్లును ప్రవేశపెట్టే విషయంలో కేంద్రం తొందరపడకూడదని రేవంత్ రెడ్డి సూచించారు. సీట్ల సంఖ్య విషయంలో దక్షిణ, ఉత్తర ప్రాంతాల మధ్య అంతరం సరిగా లేదని పేర్కొంటూ, నియోజకవర్గాల పునర్విభజనను రాజకీయ ప్రయోజనాల కోసం వాడుకుంటున్నారని అన్నారు. మహిళా రిజర్వేషన్ల బిల్లు విషయంలో ప్రభుత్వానికి పూర్తి మద్దతు ఇస్తామని ఆయన తెలిపారు.
మహిళా రిజర్వేషన్ బిల్లుకు సంపూర్ణ మద్దతు తెలిపిన కాంగ్రెస్
‘డీలిమిటేషన్ తర్వాత దక్షిణాదిలో 195 లోక్‌సభ స్థానాలకు చేరుకుంటాయి. ఉత్తర భారతదేశంలో సీట్లు 620కి అవుతాయి. దీంతో ఉత్తర, దక్షిణాది మధ్య ప్రస్తుతం ఉన్న 210 సీట్ల అంతరం 412కి అవుతుంది. బీజేపీ ప్రభుత్వంలో దక్షిణాది రాష్ట్రాలకు అస్సలు ప్రాధాన్యం దక్కడం లేదు. సీట్లు పెంచాలనుకుంటే.. అఖిలపక్షాన్ని పిలిచి మాట్లాడాలి. ఏ ప్రాదిపదికన 50 శాతం సీట్లు పెంచుతారు? అలా పెంచితే.. దక్షిణాది మధ్య తీవ్ర అంతరం ఏర్పడుతుంది. దక్షిణాది రాష్ట్రాల పట్ల వివక్షను మరింత పెంచేలా బీజేపీ వ్యవహరిస్తోంది.’ అని సీఎం రేవంత్ రెడ్డి అన్నారు.
ఆనంద్ సాయి మాదాసు ప్రస్తుతం హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో డిప్యూటీ చీఫ్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. డిజిటల్ మీడియాలో 9 ఏళ్లకుపైగా అనుభవం ఉంది. హెచ్‌టీ తెలుగులో చేరడం కంటే ముందు ఏబీపీ దేశంలో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేశారు. మెుదట నవతెలంగాణ అనే దినపత్రికలో సబ్ఎడిటర్‌గా జర్నలిజం కెరీర్ మెుదలుపెట్టారు. ఆ తర్వాత కరీంనగర్‌లో ఈనాడు దినపత్రికలో కొంతకాలం సబ్‌ఎడిటర్‌గా బాధ్యతలు చూసుకున్నారు. కాకతీయ యూనివర్సిటీలో 2015-2017 పీజీ మాస్ కమ్యూనికేషన్ అండ్ జర్నలిజం చేశారు. ఈ సమయంలో మేడారం సమ్మక్క-సారలమ్మ జాతర కోసం ప్రత్యేకంగా క్యాంపస్ నుంచి పంపించిన టీమ్‌లో ఉన్నారు. పీజీ చదివే సమయంలోనే క్యాంపస్ రిక్రూట్‌మెంట్‌లో భాగంగా ఈటీవీ భారత్‌కు సెలక్ట్ అయ్యారు. అక్కడ ఆంధ్రప్రదేశ్ డెస్క్‌లో పని చేశారు. అంతేకాదు కొన్ని ప్రత్యేక స్టోరీలు కూడా ఈటీవీ భారత్ వెబ్‌సైట్ కోసం రాసేవారు. 2019 ఎన్నికల్లో ఎలక్షన్ డెస్క్ టీమ్‌లో ఉన్న నలుగురిలో ఆనంద్ సాయి ఒకరు. ఆ తర్వాత అక్కడ నుంచి ఏబీపీ దేశంలోకి వెళ్లి కొంతకాలం పని చేశారు. ఈ సమయంలో కూడా డిజిటల్ మీడియాకు తగినట్టుగా అనేక ప్రత్యేక కథనాలు రాశారు.
హిందూస్తాన్ టైమ్స్ తెలుగులో 2022లో చేరారు. ఇక్కడ గతంలో నేషనల్, బిజినెస్, లైఫ్‌స్టైల్, ఎంటర్‌టైన్‌మెంట్, స్పోర్ట్స్ సెక్షన్లకు పనిచేశారు. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్, తెలంగాణ సెక్షన్లకు వార్తలు రాస్తున్నారు. అన్ని సెక్షన్లకు డిజిటల్ కంటెంట్ రైటర్‌గా పని చేసిన అనుభవం ఆయనకు ఉంది. అంతేకాదు ఈటీవీ భారత్, ఏబీపీ దేశం, హిందుస్తాన్ టైమ్స్ వెబ్‌సైట్స్ లాంచ్ టీమ్‌లో ఈయన ఉన్నారు. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాజకీయ పరిణామాలు, విశ్లేషణలు, విద్య, ఉద్యోగ సమాచారంతో పాటు ఆసక్తికరమైన కథనాలను అందిస్తారు. ప్రభుత్వ పథకాలు, ఉద్యోగ నోటిఫికేషన్లు, ఇతర సమాచారం ప్రజలకు సులభంగా అర్థమయ్యే రీతిలో, వీలైనంత త్వరగా కథనాలను ఇవ్వటంలో ప్రత్యేక శైలి కలిగి ఉన్నారు. అనేకసార్లు హిందుస్తాన్ టైమ్స్ సంస్థ నుంచి ఇన్‌స్టా అవార్డులు అందుకున్నారు. డిజిటల్ మీడియాలో ఎక్కువకాలం పని చేసిన అనుభవం ఉంది. యూజర్లకు ఉపయోగపడే వార్తలను అందించడంలో ముందుంటారు. Read More
డీలిమిటేషన్ విషయంలో కేంద్రం తొందరపాటు నిర్ణయాలు తీసుకోవద్దని, అన్ని రాష్ట్రాల అభిప్రాయాలను పరిగణనలోకి తీసుకోవాలని రేవంత్ రెడ్డి సూచించారు. దక్షిణాది రాష్ట్రాలకు జరుగుతున్న అన్యాయాన్ని అడ్డుకుంటామని ఆయన స్పష్టం చేశారు.


