
📌 Key Points
- రంగారెడ్డి జిల్లా కోహెడలో రూ.2,300 కోట్లతో అంతర్జాతీయ పండ్ల మార్కెట్‌కు సీఎం శంకుస్థాపన.
- 240 ఎకరాల విస్తీర్ణంలో నిర్మితమవుతున్న ఈ మార్కెట్ హైదరాబాద్ ప్రజల అవసరాలు తీర్చనుంది.
- రియల్ ఎస్టేట్ విస్తరణతో తగ్గిన సాగు భూములు, ఇతర రాష్ట్రాలపై ఆధారపడటంపై సీఎం ఆవేదన.
- రైతులు లాభసాటి వాణిజ్య పంటలు పండించాలని, తోటల పెంపకం చేపట్టాలని సీఎం పిలుపు.
తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి రంగారెడ్డి జిల్లా కోహెడలో రూ.2,300 కోట్ల వ్యయంతో నిర్మించనున్న అంతర్జాతీయ పండ్ల మార్కెట్‌కు శంకుస్థాపన చేశారు. హైదరాబాద్ ప్రజల అవసరాలు తీర్చడంతో పాటు, రాష్ట్రానికి అంతర్జాతీయ గుర్తింపు తీసుకురావడమే ఈ ప్రాజెక్టు లక్ష్యమని ఆయన ప్రకటించారు. ఇది వ్యవసాయ రంగంలో నూతన శకానికి నాంది పలకనుంది.
కోహెడ మార్కెట్: హైదరాబాద్ ప్రజల ఆకలి తీర్చే ప్రణాళిక
హైదరాబాద్ ఔటర్ రింగ్ రోడ్డు (ఓఆర్ఆర్) లోపలి ప్రాంతం 1.34 కోట్ల జనాభాతో అత్యంత వేగంగా విస్తరిస్తోంది. ఈ భారీ మహానగర ప్రజల అవసరాలకు అనుగుణంగా అంతర్జాతీయ స్థాయిలో ఒక సమీకృత పండ్ల మార్కెట్‌ను నిర్మిస్తున్నట్లు ముఖ్యమంత్రి ఎనుముల రేవంత్ రెడ్డి ప్రకటించారు.
రంగారెడ్డి జిల్లా అబ్దుల్లాపూర్‌మెట్ మండలం కోహెడలో వ్యవసాయ శాఖ ఆధ్వర్యంలో నిర్మించతలపెట్టిన ఈ అంతర్జాతీయ సమీకృత పండ్ల మార్కెట్ నిర్మాణ పనులకు ముఖ్యమంత్రి శంకుస్థాపన చేశారు. ఈ అధికారిక కార్యక్రమంలో రాష్ట్ర మంత్రులు తుమ్మల నాగేశ్వరరావు, దుద్దిళ్ల శ్రీధర్ బాబు, పొంగులేటి శ్రీనివాస్ రెడ్డితో పాటు పలువురు ప్రజాప్రతినిధులు, ఉన్నతాధికారులు పాల్గొన్నారు. పండ్ల మార్కెట్‌తో పాటే అదే ప్రాంగణంలో అత్యాధునిక వసతులతో నిర్మించనున్న సమీకృత సబ్-రిజిస్ట్రార్ కార్యాలయాల భవన సముదాయానికి కూడా ముఖ్యమంత్రి భూమిపూజ చేశారు.
ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన బహిరంగ సభలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మాట్లాడుతూ….. తెలంగాణ రాష్ట్రం నలుమూలల నుంచి వచ్చే ప్రజలకు అవసరమైన అన్ని రకాల పండ్లు ఒకే చోట అందుబాటులో ఉండేలా 240 ఎకరాల విస్తీర్ణంలో, రూ.2,300 కోట్ల అంచనా వ్యయంతో ఈ అత్యాధునిక మార్కెట్‌ను రూపుదిద్దుతున్నట్లు వివరించారు. శంషాబాద్ అంతర్జాతీయ విమానాశ్రయం తర్వాత హైదరాబాద్ నగరానికి ఈ కోహెడ మార్కెట్ ద్వారానే అంతర్జాతీయ స్థాయిలో గుర్తింపు లభిస్తుందని ఆయన ధీమా వ్యక్తం చేశారు.
రూ.2,300 కోట్ల పెట్టుబడి: అంతర్జాతీయ గుర్తింపు లక్ష్యం
గత 30, 40 ఏళ్ల క్రితం రంగారెడ్డి జిల్లా పండ్లు, కూరగాయల సాగుతో ఎంతో కళకళలాడేదని ముఖ్యమంత్రి గుర్తు చేసుకున్నారు. అప్పట్లో రంగారెడ్డి జిల్లా రైతులు రాత్రింబగళ్లు కష్టపడి హైదరాబాద్ ప్రజలకు అవసరమైన పండ్లు, కూరగాయలు, పాలను నిరంతరం సరఫరా చేసేవారని చెప్పారు. అయితే కాలక్రమేణా నగరంలో రియల్ ఎస్టేట్ రంగం విపరీతంగా విస్తరించడంతో ఇక్కడ వ్యవసాయ సాగు భూములు తగ్గిపోయి, సాగు కుంటుపడిందని ఆవేదన వ్యక్తం చేశారు. దీనివల్ల ప్రస్తుతం నగర ప్రజలు ఏది కొనాలన్నా పక్క రాష్ట్రాలపై ఆధారపడి దిగుమతి చేసుకోవాల్సిన దుస్థితి ఏర్పడిందన్నారు.
ప్రస్తుతం కూరగాయల ధరలు ఆకాశాన్ని అంటుతున్నాయని, ఈ పరిస్థితి మారాలంటే రైతులకు లాభసాటిగా ఉండేలా…. ప్రజలందరికీ ఉపయోగపడేలా ప్రత్యామ్నాయ వాణిజ్య పంటలు, తోటల పెంపకాన్ని చేపట్టాలని ముఖ్యమంత్రి పిలుపునిచ్చారు. స్థానిక రైతులు, ప్రజల సహకారంతోనే ప్రభుత్వం ఎంతో ధైర్యంగా ఈ అంతర్జాతీయ పండ్ల మార్కెట్ నిర్మాణాన్ని ప్రారంభించిందని చెప్పారు. వచ్చే రెండేళ్ల కాలంలో ఈ ప్రాజెక్టును సంపూర్ణంగా అభివృద్ధి చేస్తామని హామీ ఇచ్చారు. ఈ మార్కెట్ నిర్మాణ పనులకు నిధుల కొరత లేకుండా చూసేందుకు గ్రీన్ చానెల్ ద్వారా నిధులను విడుదల చేస్తామని స్పష్టం చేశారు. వచ్చే డిసెంబర్ నాటికి క్షేత్రస్థాయిలో పనులు ప్రారంభమయ్యేలా అధికారులు, మంత్రులు ప్రత్యేక శ్రద్ధతో శ్రమించాలని ఆదేశించారు.
రైతుల సంక్షేమం, వాణిజ్య పంటల ప్రోత్సాహం
రాష్ట్ర రిజిస్ట్రేషన్ల శాఖ ప్రభుత్వానికి ఏటా దాదాపు 15 వేల కోట్ల నుంచి 16 వేల కోట్ల రూపాయల భారీ ఆదాయాన్ని సమకూరుస్తోందని ముఖ్యమంత్రి తెలిపారు. ఇంత పెద్ద మొత్తంలో ఆదాయం వస్తున్నప్పటికీ, సామాన్య ప్రజలు రిజిస్ట్రేషన్ కార్యాలయాలకు వెళ్తే కూర్చోవడానికి కనీసం ఒక కుర్చీ కూడా లేని దుస్థితి ఉందన్నారు. ఇలాంటి దారుణమైన పరిస్థితులు ఉండకూడదనే ఉద్దేశంతోనే, అంతర్జాతీయ ప్రమాణాలు, అత్యాధునిక వసతులతో కూడిన సమీకృత సబ్-రిజిస్ట్రార్ కార్యాలయాల భవన సముదాయానికి ఇక్కడే శంకుస్థాపన చేసినట్లు వెల్లడించారు. హైదరాబాద్ నగరవ్యాప్తంగా ప్రస్తుతం ఉన్న 39 సబ్-రిజిస్ట్రార్ కార్యాలయాలను 12 ప్రత్యేక క్లస్టర్లుగా విభజించి, అత్యంత ఆధునిక సదుపాయాలతో కార్పొరేట్ స్థాయిలో నిర్మించనున్నట్లు ప్రకటించారు.
మహేంద్ర చారి మహేశ్వరం ప్రస్తుతం హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో డిప్యూటీ చీఫ్ కంటెంట్ ప్రొడ్యూసర్ గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. డిజిటల్ జర్నలిజంలో 9 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. ఇక్కడ ఏపీ, తెలంగాణకు సంబంధించిన ప్రాంతీయ వార్తలను రాస్తారు. ముఖ్యంగా రాజకీయ పరిణామాలు, విశ్లేషణలు, విద్య, ఉద్యోగ సమాచారంతో పాటు ఆసక్తికరమైన కథనాలను అందిస్తారు. ఏపీ, తెలంగాణ ప్రభుత్వ పథకాలకు సంబంధించి ప్రజలకు సులభంగా అర్థమయ్యే రీతిలో కథనాలను ఇవ్వటంలో ప్రత్యేక శైలి కలిగి ఉన్నారు. యూజర్లకు ఉపయోగపడే వార్తలను అందించడంలో ముందుంటారు.జర్నలిజంలో పీజీ చేసే సమయంలో క్యాంపస్ రిక్రూట్ మెంట్ లో భాగంగా 2017లో ఈటీవీ భారత్ లో చేరారు. 2018 అసెంబ్లీ ఎన్నికల సమయంలో ఈటీవీ డెస్క్ లోనూ కొన్ని నెలలపాటు పని చేశారు. 2019 ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించిన ఈటీవీ భారత్ ఏర్పాటు ఏర్పాటు చేసిన స్పెషల్ డెస్క్ లో కూడా పని చేశారు. ఈనాడు జర్నలిజం స్కూల్ లో కొద్దిరోజుల పాటు ట్రైనీ జర్నలిస్టులకు పాఠాలు కూడా బోధించిన అనుభవం ఉంది.2022లో హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో చేరారు. అద్భుతమైన పనితీరుతో ప్రస్తుతం పని చేస్తున్న సంస్థలో 2023 – 2024 ఏడాదికానూ ప్రతిష్టాత్మకమైన ‘లాంగ్వేజేస్ జర్నో’ అవార్డును అందుకున్నారు. పలుమార్లు హెచ్‌టీ ఇన్‌స్టా అవార్డులు దక్కించుకున్నారు. ఇది డిజిటల్ జర్నలిజంలో ఆయన చూపిస్తున్న నిబద్ధతకు, వార్తా సేకరణలో ఆయన పాటించే ఖచ్చితత్వానికి నిదర్శనం.హైదరాబాద్ లోని నిజాం కాలేజీ నుంచి బీఎస్సీలో డిగ్రీ పట్టా పొందారు. తెలుగు విశ్వవిద్యాలయం నుంచి జర్నలిజం అండ్ మాస్ కమ్యూనికేషన్ లో పీజీ పూర్తి చేశారు. అకడమిక్స్ లో మంచి ప్రతిభకు గానూ యూనివర్శిటీ నుంచి గోల్డ్ మెడల్ ను పొందారు. ఆ తర్వాత ఉస్మానియా యూనివర్శిటీ క్యాంపస్ నుంచి లా డిగ్రీ పట్టా పొందారు. Read More
ఈ అంతర్జాతీయ పండ్ల మార్కెట్ హైదరాబాద్ ప్రజలకు తాజా పండ్లను అందుబాటులోకి తేవడంతో పాటు, స్థానిక రైతుల ఆర్థికాభివృద్ధికి దోహదపడుతుంది. సీఎం రేవంత్ రెడ్డి విజన్ తెలంగాణ వ్యవసాయ రంగంలో విప్లవాత్మక మార్పులు తీసుకువస్తుందని ఆశిద్దాం.


