|

Andhravilas.net – Breaking News & Movie Buzz Since 2002

రేవంత్ రెడ్డి మనసులో ఆ ఒక్క హీరో ఎవరు? సంచలన విషయాలు వెల్లడి!

Published: 12-03-2026, 1:35 PM
రేవంత్ రెడ్డి మనసులో ఆ ఒక్క హీరో ఎవరు? సంచలన విషయాలు వెల్లడి!
  • కోకాపేటలో అల్లు సినిమాస్‌ను ప్రారంభించిన సీఎం రేవంత్ రెడ్డి.
  • సూపర్ స్టార్ కృష్ణ అంటే తనకు ఎంతో అభిమానమని తెలిపిన రేవంత్ రెడ్డి.
  • తన చిన్నతనంలో కృష్ణ సినిమాలు చూసేందుకు లారీల్లో వెళ్లేవాడినని గుర్తు చేసుకున్న సీఎం.
  • అల్లు రామలింగయ్య వారసత్వాన్ని అల్లు అరవింద్ కొనసాగిస్తున్నారని ప్రశంసించారు.

తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కోకాపేటలో అల్లు సినిమాస్‌ను ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ సూపర్ స్టార్ కృష్ణకు తాను వీరాభిమానినని, చిన్నతనంలో ఆయన సినిమాల కోసం ఎన్నో కిలోమీటర్లు ప్రయాణించేవాడినని గుర్తు చేసుకున్నారు.

అల్లు సినిమాస్‌ను ప్రారంభించిన సీఎం రేవంత్ రెడ్డి

CM Revanth Reddy: సినిమా రంగంలో అల్లు ఫ్యామిలీ మరో అడుగు వేసింది. అల్లు సినిమాస్ (Allu Cinemas) అంటూ.. కోకాపేటలో అధునాతన టెక్నాలజీ‌తో రూపొందించిన అల్లు సినిమాస్ గురువారం (మార్చి 12) తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి (Telangana CM Revanth Reddy) చేతుల మీదుగా గ్రాండ్‌గా ప్రారంభమైంది. ఈ వేడుకకు అల్లు ఫ్యామిలీ మొత్తం హాజరైంది. వారితో పాటు పలువురు ప్రముఖులు ఈ వేడుకకు హాజరయ్యారు. అల్లు సినిమాస్ లాంచ్ అనంతరం సీఎం రేవంత్ రెడ్డి మాట్లాడుతూ.. సూపర్ స్టార్ కృష్ణకు వీరాభిమానిని అని తెలియజేశారు. ఆ రోజుల్లో ఆయన సినిమాలను చూసేందుకు దాదాపు 100 కి.మీ. లారీల్లో ప్రయాణించి సినిమాలు చూసి వచ్చేవాడినని తెలిపారు.

సూపర్ స్టార్ కృష్ణకు వీరాభిమాని రేవంత్

ఈ కార్యక్రమంలో సీఎం రేవంత్ రెడ్డి మాట్లాడుతూ.. తాను ప్రాథమికంగా ఒక సినిమా అభిమానినని, బ్లాక్ అండ్ వైట్ నుంచి నేటి విజువల్ ఎఫెక్ట్స్ వరకు సినిమా రంగంలో వచ్చిన మార్పులను గమనిస్తున్నానని చెప్పారు. వనపర్తిలో చదువుకునే రోజుల్లో, మొదటి రోజు సినిమా చూడటం కోసం స్నేహితులతో కలిసి 100 కిలోమీటర్ల దూరంలోని కర్నూలుకు లారీల్లో ప్రయాణించి వెళ్లేవాడినని గుర్తుచేసుకున్నారు. తాను నటశేఖర కృష్ణకు పెద్ద అభిమానినని, ఆయన ఒక ఏడాదిలో 15-16 సినిమాలు చేసిన రోజులను, ఆయన చేసిన ప్రయోగాల గురించి గొప్పగా చెప్పుకునేవాళ్లమని అన్నారు.

అల్లు ఫ్యామిలీని కొనియాడిన సీఎం

అల్లు రామలింగయ్య వారసత్వాన్ని అల్లు అరవింద్ (Allu Aravind) అద్భుతంగా కొనసాగిస్తున్నారని మెచ్చుకున్నారు. అల్లు ఫ్యామిలీ సక్సెస్‌ని చూసి స్వర్గంలో ఉన్న రామలింగయ్య కూడా ఎంతో సంతోషిస్తారని అన్నారు. ఒక కొడుకు ప్రయోజకుడు అయితే తండ్రికి కలిగే సంతోషం మాటల్లో చెప్పలేమని, అల్లు అర్జున్ సక్సెస్ చూసి అల్లు అరవింద్ ఎంతో సంతోషిస్తున్నారని తెలిపారు. అల్లు రామలింగయ్య నుంచి అల్లు అర్జున్ (Allu Arjun) వరకు.. వాళ్ల సక్సెస్ స్టోరీ చాలా మందిని ఇన్‌స్ఫైర్ చేస్తుందని చెప్పుకొచ్చారు. ఆ సక్సెస్ వెనుక ఉన్న హార్డ్ వర్క్ వారికి గౌరవాన్ని తెలుస్తుందని అన్నారు. సినిమా కేవలం వినోదం మాత్రమే కాదని, అది మధ్యతరగతి ప్రజల జీవితాలను, ఆలోచనలను ప్రభావితం చేసే ఒక గొప్ప సాధనమని సీఎం అభిప్రాయపడ్డారు. తెలంగాణ ప్రభుత్వం ఐటీ, ఫార్మా రంగాలతో సమానంగా సినిమా ఇండస్ట్రీని కూడా ఒక గొప్ప పరిశ్రమగా గుర్తించిందని, పరిశ్రమ అభివృద్ధికి 100 శాతం సహకారం అందిస్తామని హామీ ఇచ్చారు. ఇంకా తెలుగు సినిమా పరిశ్రమ ఇప్పుడు కేవలం బాలీవుడ్ తోనే కాకుండా, హాలీవుడ్ సినిమాలతో (అవతార్, జురాసిక్ పార్క్ వంటివి) సాంకేతికంగా పోటీ పడాలని, అల్లు అర్జున్ వంటి నటులు గ్లోబల్ స్థాయిలో రాణించాలని ఆకాంక్షించారు.

సినిమా అనేది వినోదంతో పాటు మధ్యతరగతి ప్రజల జీవితాలను ప్రభావితం చేసే గొప్ప సాధనమని సీఎం రేవంత్ రెడ్డి అన్నారు. అల్లు ఫ్యామిలీ సక్సెస్ అందరికీ స్ఫూర్తిదాయకమని ఆయన కొనియాడారు.

Related News

Plugin developed by ProSEOBlogger
Plugin developed by ProSEOBlogger. Get free Ypl themes.