|

Andhravilas.net – Breaking News & Movie Buzz Since 2002

మూసీ ముంపు బాధితులకు సీఎం రేవంత్ రెడ్డి భరోసా! 10 వేల కుటుంబాలకు డబుల్ బెడ్రూం ఇళ్లు!!

Published: 14-03-2026, 12:35 AM
మూసీ ముంపు బాధితులకు సీఎం రేవంత్ రెడ్డి భరోసా! 10 వేల కుటుంబాలకు డబుల్ బెడ్రూం ఇళ్లు!!
  • మూసీ పునరుజ్జీవన ప్రాజెక్టులో ఎవరికీ అన్యాయం జరగదని సీఎం రేవంత్ రెడ్డి హామీ.
  • మూసీ ప్రాజెక్టు పరిధిలోని 10 వేల కుటుంబాలకు డబుల్ బెడ్రూమ్ ఇళ్లు నిర్మిస్తామని ప్రకటన.
  • నిర్వాసితులు ఉపాధి కోల్పోకుండా సమీప ప్రాంతాల్లోనే ఇళ్ల నిర్మాణం చేపట్టనున్నట్లు వెల్లడి.
  • హైదరాబాద్ అభివృద్ధికి అందరూ సహకరించాలని సీఎం రేవంత్ రెడ్డి విజ్ఞప్తి.

మూసీ నది పునరుజ్జీవన ప్రాజెక్టులో భాగంగా ఎవరికీ అన్యాయం జరగదని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి స్పష్టం చేశారు. ప్రాజెక్టు వల్ల నిర్వాసితులయ్యే 10 వేల కుటుంబాలకు డబుల్ బెడ్రూమ్ ఇళ్లు నిర్మిస్తామని ఆయన హామీ ఇచ్చారు.

మూసీ పునరుజ్జీవనం: సీఎం రేవంత్ రెడ్డి ప్రకటన

భవిష్యత్తు తరాల కోసం చేపడుతున్న మూసీ పునరుజ్జీవం ప్రాజెక్టు విషయంలో ఎవరికీ అన్యాయం జరగనివ్వమని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి స్పష్టం చేశారు. ‘ఈ ప్రాజెక్టు ఎవరికీ వ్యతిరేకం కాదు. ఏ పేదవాడికి అన్యాయం జరగదు. ఎవరి ఆస్తులను గుంజుకోవడం లేదు. మన అందరి భవిష్యత్తు కోసం చేపట్టిన ప్రాజెక్టు. హైదరాబాద్‌ను గొప్ప అభివృద్ది చెందిన నగరంగా నిలబెట్టాలన్న ఆశయం. అందరూ సహకరిస్తేనే సాధ్యమవుతుంది. ముందుకు వెళ్లడానికి సూచనలు ఇవ్వండి.’ అని సీఎం రేవంత్ రెడ్డి కోరారు.

మూసీ నది పునరుజ్జీవం ఫేజ్ -1 పై ప్రభుత్వం ఏర్పాటు చేసిన మూసీ ఇన్వైట్స్ సదస్సులో ముఖ్యమంత్రి ప్రసంగించారు. మూసీ చారిత్రక పరిణామాలు, ప్రాజెక్టు లక్ష్యాలు, దాని ఆవశ్యకతను వివరిస్తూ ప్రాజెక్టును ముందుకు తీసుకెళ్లడంలో ప్రజాప్రతినిధులు, నిపుణులు, నిష్ణాతులు, పౌరులు తమ సూచనలు ఇవ్వాలని విజ్ఞప్తి చేశారు.

నిర్వాసితులకు డబుల్ బెడ్రూం ఇళ్లు: ప్రభుత్వం హామీ

ఈ ప్రాజెక్టు వల్ల ఎవరికీ అన్యాయం జరగదని, నిర్వాసితులకు నష్టపరిహారం ఇవ్వడంపై సలహాలు సూచనలు ఇవ్వాలని కోరారు. మూసీ ప్రతిపాదిత ప్రాజెక్టు వెంట మొత్తంగా 10 వేల పేద కుటుంబాలున్నాయని, ఇప్పటికే డేటా సేకరించామన్నారు. వారందరికీ డబుల్ బెడ్రూమ్ ఇళ్లను సిద్ధం చేశామని చెప్పారు.

అయితే, దూరప్రాంతాలకు వెళ్లడం వల్ల చిన్న చిన్న పనులు చేసుకునే వారు ఉపాధి కోల్పోతామని అంటున్నారని, అందుకని సమీప ప్రాంతాల్లోనే ఇండ్లు కట్టించే ఏర్పాటు చేస్తున్నామని సీఎం వెళ్లడించారు. ఎవరికీ నష్టం చేయమని, వారితో నాకు శత్రుత్వం ఏముంటుందని వ్యాఖ్యానించారు.

హైదరాబాద్ అభివృద్ధికి సహకరించాలని సీఎం విజ్ఞప్తి

‘నదులు, సముద్రం, నీటి ప్రవాహాలు ఉన్న ప్రాంతాలే అధికంగా అభివృద్ధి చెందాయి. థేమ్స్, హడ్సన్ నదులు, సింగపూర్, సియోల్, దుబాయ్, అహ్మదాబాద్ సబర్మతీ రివర్ ఫ్రంట్ ప్రాజెక్టులు… ఎన్నింటినో గమనించిన తర్వాత తెలంగాణ కూడా ఆర్థిక ప్రగతిని సాధించాలని, అభివృద్ధి నిరోధకులుగా ఉంటే భావి తరాలు క్షమించవని మూసీ రివర్ ఫ్రంట్ కార్యక్రమాన్ని చేపట్టాం. 1908లో మూసీకి ఉప్పెన వచ్చి వేలాది మంది మరణించిన సందర్భంలో ఆనాటి నిజాం వరద నివారణ, జంట నగర ప్రజల దాహార్తిని తీర్చడానికి వందేళ్ల కిందట ఒక గొప్ప విజన్‌తో ఉస్మాన్‌సాగర్, నిజాంసాగర్‌లను నిర్మించిన చరిత్రను విస్మరించరాదు.’ అని రేవంత్ రెడ్డి గుర్తుచేశారు.

అలాంటి నగరాన్ని ఇలాగే వదిలేద్దామా అని ముఖ్యమంత్రి అడిగారు. ప్రపంచంలో వస్తున్న మార్పులు, పర్యావరణంలో వస్తున్న మార్పులకు అనుగుణంగా ముందుకు వెళదామా. మన రాజకీయ అవకాశాల కోసం చరిత్రను కాలగర్భంలో కలిపేద్దామా అని ప్రశ్నించారు.

మూసీ నది అభివృద్ధికి ప్రభుత్వం చేస్తున్న ప్రయత్నాలను ప్రజలు స్వాగతించాలని సీఎం కోరారు. ప్రాజెక్టు ద్వారా హైదరాబాద్ రూపురేఖలు మారుతాయని, భవిష్యత్తు తరాలకు ఇది ఉపయోగపడుతుందని ఆయన అన్నారు.

Related News

Plugin developed by ProSEOBlogger
Plugin developed by ProSEOBlogger. Get free Ypl themes.