
📌 Key Points
- హైదరాబాద్‌లో ఐటీ విస్తరణతో కో-లివింగ్ హాస్టళ్లకు భారీ డిమాండ్ ఏర్పడింది.
- రూ.750 కోట్ల మార్కెట్‌తో 400కు పైగా హాస్టళ్లలో 70 వేల మంది యువత నివసిస్తున్నారు.
- ఆధునికత పేరుతో విచ్చలవిడితనం, డ్రగ్స్, బ్లాక్‌మెయిలింగ్ వంటి ఆందోళనలు పెరుగుతున్నాయి.
- యువతలో లివిన్ రిలేషన్‌షిప్స్, బ్రేకప్‌లు సాధారణమయ్యాయని నివేదికలు చెబుతున్నాయి.
హైదరాబాద్‌లో కో-లివింగ్ హాస్టళ్లు ఆధునిక జీవనశైలికి ప్రతీకగా మారినా, సామాజికంగా తీవ్ర ఆందోళనలు రేకెత్తిస్తున్నాయి. రూ.750 కోట్ల మార్కెట్‌గా విస్తరిస్తున్న ఈ కో-లివింగ్ సంస్కృతి యువతపై, సమాజంపై ఎలాంటి ప్రభావం చూపుతుందో రాజకీయ వర్గాల్లోనూ చర్చనీయాంశంగా మారింది.
కో-లివింగ్: ఆధునికత నుండి విచ్చలవిడితనం వైపు?
హైదరాబాద్‌లో ఐటీ రంగం విస్తరిస్తున్న కొద్దీ యువత జీవనశైలిలో అనూహ్య మార్పులు చోటుచేసుకుంటున్నాయి. ఒకప్పుడు ఖర్చులు తగ్గించుకునేందుకు స్నేహితులతో కలిసి గదులను పంచుకునే రూమ్ షేరింగ్ పద్ధతి.. నేడు పెళ్లి కాకుండానే యువతీ యువకులు ఒకే గదిలో కలిసి ఉండే లివిన్ రిలేషన్‌షిప్ సంస్కృతికి దారితీస్తోంది. నగరంలో చాపకింద నీరులా విస్తరిస్తున్న కో లివింగ్ హాస్టళ్లు ఈ సరికొత్త పాశ్చాత్య ట్రెండ్‌కు ప్రధాన వేదికలుగా మారుతున్నాయి. ఆధునికత, స్వేచ్ఛ ముసుగులో మొదలవుతున్న ఈ బంధాలు చివరకు విచ్చలవిడితనం, డ్రగ్స్, బ్లాక్‌మెయిలింగ్, పోలీస్ కేసులకు దారితీస్తుండటం సమాజంలో తీవ్ర ఆందోళన రేకెత్తిస్తోంది.
కొవిడ్ తదనంతర పరిస్థితులు, కార్పొరేట్ సంస్థలు ప్రవేశపెట్టిన హైబ్రిడ్ పని విధానం నగరంలో కో లివింగ్ స్పేస్‌ల డిమాండ్‌ను అమాంతం పెంచేశాయి. ప్రస్తుతం దేశవ్యాప్తంగా దాదాపు రూ.4 వేల కోట్లుగా ఉన్న ఈ వ్యవస్థీకృత మార్కెట్‌లో, ఒక్క హైదరాబాద్ వాటానే సుమారు రూ.750 కోట్లుగా ఉండటం గమనార్హం. నగరంలోని ఐటీ కారిడార్, కూకట్‌పల్లి వంటి ప్రధాన ప్రాంతాల్లో ఏకంగా 400కు పైగా కో లివింగ్ హాస్టళ్లు వెలిశాయి. వీటిలో ప్రస్తుతం 70 వేల మందికి పైగా యువతీ యువకులు నివసిస్తున్నారు. డబుల్, ట్రిపుల్ బెడ్‌రూమ్ ఫ్లాట్ల తరహాలో ఉండే ఈ స్పేస్‌లలో.. బెడ్‌రూమ్‌లు ఎవరికి వారు ప్రత్యేకంగా ఉన్నప్పటికీ, లివింగ్ రూమ్, కిచెన్, డైనింగ్, జిమ్, గేమింగ్ ఏరియా వంటివాటిని అందరూ ఉమ్మడిగా వాడుకుంటారు. ఈ విలాసవంతమైన వసతులు, ప్రైవసీ కోసం ఒక్కొక్కరు నెలకు రూ.12 వేల నుంచి రూ.25 వేల వరకు చెల్లించడానికి వెనుకాడటం లేదు.
హైదరాబాద్‌లో రూ.750 కోట్ల కో-లివింగ్ మార్కెట్
ఈ కో లివింగ్ హాస్టళ్లలో నివసిస్తున్న వారిలో అత్యధికంగా 60 నుంచి 70 శాతం మంది ఇతర రాష్ట్రాల నుంచి వచ్చిన వారే కాగా, మిగిలిన 30 నుంచి 40 శాతం మంది తెలుగు రాష్ట్రాలకు చెందిన యువత ఉంటున్నారు. సీసీటీవీ నిఘా, ప్రొఫెషనల్ క్లీనింగ్ సేవలతో ఇవి భద్రంగా ఉంటున్నాయని, ఒంటరితనానికి దూరంగా, ఒత్తిడి లేని జీవితాన్ని గడపడానికి తోడ్పడుతున్నాయని యువత భావిస్తోంది. అయితే, ఈ ఆరోగ్యకరమైన కో లివింగ్ కాస్తా క్రమంగా హద్దులు దాటుతోంది. ఒకరినొకరు అర్థం చేసుకోవడానికి సహజీవనం చేయడంలో తప్పేముందని ఆధునిక యువత వాదిస్తోంది. పెళ్లయిన వారు విడాకులు తీసుకున్నట్లే, తాము కూడా బ్రేకప్ చెప్పుకుని విడిపోతామని చాలా తేలికగా చెబుతుండటం వారి ఆలోచనా ధోరణికి అద్దం పడుతోంది.
తాము సాధారణ రూమ్‌మేట్స్‌తో కలిసి ఉంటున్నామని స్వగ్రామాల్లోని తల్లిదండ్రులను నమ్మిస్తూ, తెరవెనుక సహజీవనం సాగిస్తున్న ఉదంతాలు అనేకం వెలుగుచూస్తున్నాయి. మన సంస్కృతి, సంప్రదాయాలు, కుటుంబ వ్యవస్థల ఉనికికే ముప్పుగా పరిణమిస్తున్న ఈ ధోరణి.. తీవ్రమైన సామాజిక సమస్యలకు దారితీస్తోంది. కొన్నిచోట్ల ఈ కో లివింగ్ ఫ్లాట్లు ఆల్కాహాల్, డ్రగ్స్‌కు కేంద్రాలుగా మారుతున్నాయనే విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. మరికొన్ని సందర్భాల్లో బ్రేకప్ తర్వాత వ్యక్తిగత ఫొటోలు, వీడియోలను సాకుగా చూపి బ్లాక్‌మెయిలింగ్‌కు పాల్పడటం, నమ్మించి మోసం చేయడం వంటి నేరాలు చోటుచేసుకుంటున్నాయి.
యువత జీవనశైలిపై కో-లివింగ్ ప్రభావం
సహజీవన సంబంధాలు విఫలమైనప్పుడు, ఇగో సమస్యలు లేదా విభేదాలు తలెత్తినప్పుడు ఒకరిపై ఒకరు పోలీసు కేసులు పెట్టుకోవడం ఐటీ కారిడార్ పరిధిలో పరిపాటిగా మారింది. సైబరాబాద్ పరిధిలో ఇటీవల కాలంలో నమోదవుతున్న ఫిర్యాదుల్లో ఇటువంటి లివిన్ రిలేషన్‌షిప్ గొడవలే ఎక్కువగా ఉంటున్నాయని నివేదికలు స్పష్టం చేస్తున్నాయి. కేవలం సిద్ధాంతాలు, వ్యక్తిగత స్వేచ్ఛ పేరుతో యువత ఎంచుకుంటున్న ఈ విధానం ఇలాగే కొనసాగితే భవిష్యత్తులో తీవ్రమైన నైతిక, సామాజిక సంక్షోభానికి దారితీసే అవకాశముంది.
కో-లివింగ్ హాస్టళ్ల విస్తరణతో పాటు పెరుగుతున్న సామాజిక సమస్యలు ప్రభుత్వానికి, పౌర సమాజానికి పెద్ద సవాలుగా మారాయి. యువత భవిష్యత్తు, నగర సంస్కృతిపై దీని దీర్ఘకాలిక ప్రభావంపై లోతైన చర్చ అవసరం.


