
📌 Key Points
- మావోయిస్టుల ఏరివేతకు కేంద్ర హోంశాఖ గడువు విధించింది, టెన్షన్ వాతావరణం నెలకొంది.
- చత్తీస్‌గఢ్, తెలంగాణ సహా పలు రాష్ట్రాల్లో 90% లక్ష్యం పూర్తయినా, కొందరు నేతలు లొంగడం లేదు.
- వచ్చే వారం రోజుల్లో మిగిలిన మావోయిస్టులను అంతం చేయాలని భద్రతా బలగాలకు ఆదేశాలు జారీ.
- లొంగుబాట్లు, ఎన్‌కౌంటర్ల అనంతరం దేశంలో ఇంకా కొందరు మావోయిస్టులు మిగిలి ఉన్నట్లు హోంశాఖ అంచనా.
మావోయిస్ట్ ముక్త్ భారత్ లక్ష్యంతో కేంద్ర హోంశాఖ వేగంగా అడుగులు వేస్తోంది. ఈ నెల 31వ తేదీ వరకు గడువు విధించడంతో దేశంలో టెన్షన్ వాతావరణం నెలకొంది. ఇప్పటికే పలు రాష్ట్రాల్లో భద్రతా బలగాలు ముమ్మరంగా గాలింపు చర్యలు చేపట్టాయి.
మావోయిస్టుల ఏరివేతకు కేంద్రం గడువు
మావోయిస్ట్ ముక్త్ భారత్ లక్ష్యసాధనకు ఇంకా కేవలం ఎనిమిది రోజులే మిగిలిఉండగా, కేంద్ర హోంశాఖ వర్గాల్లో టెన్షన్ మొదలైంది. ఈనెల 31కల్లా దేశంలో సాయుధ మావోయిస్టులందరినీ లొంగదీసుకోవడమో, అంతమొందించడమో చేస్తామని కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా ప్రకటించిన విషయం తెలిసిందే. ఇప్పటివరకు ఛత్తీస్‌గఢ్, తెలంగాణ, మహారాష్ట్ర, ఏఓబీ-ఒడిషా, ఏపీ, మధ్యప్రదేశ్ రాష్ట్రాల్లో 90శాతానికి పైగా లక్ష్యాన్ని సాధించినప్పటికీ, కొందరు మావోయిస్టు నేతలు కొరకరాని కొయ్యలుగా మారారని, లొంగిపోయేందుకు ససేమిరా అంటూ రహస్యంగా తలదాచుకుంటున్నారని హోంశాఖ భావిస్తోంది. ఇలా మిగిలిన వారిని సైతం వచ్చే వారం రోజుల్లో అంతం చేయాలని భద్రతా బలగాలకు ఆదేశాలు జారీ చేసింది. ఇందుకోసం అన్ని రాష్ట్రాల్లో పోలీసు కూంబింగులు కొనసాగుతున్నాయి. మరోవైపు, లొంగుబాట్లకు కూడా ప్రయత్నాలు నడుస్తున్నాయి.
కొరకరాని కొయ్యలుగా మావోయిస్టు నేతలు
ఎన్‌కౌంటర్ మరణాలు, లొంగుబాట్ల తర్వాత ప్రస్తుతం ఛత్తీస్‌గఢ్‌లో 60-70 మంది, జార్ఖండ్-బిహార్‌లలో కలిసి సుమారు వంద మంది, ఒడిషాలో 14 మంది, మహారాష్ట్రలో ఆరుగురు, తెలంగాణలో ఐదుగురు మిగిలారని హోంశాఖ లెక్కలు తేల్చింది. బస్తర్‌లో స్పెషల్ జోనల్ కమిటీ సభ్యుడు పాపారావు తన చిన్న బృందంతో ఇంద్రావతి ప్రాంతంలో సంచరిస్తుండగా, పొలిట్‌బ్యూరో సభ్యుడు గణపతి అలియాస్ ముప్పాళ్ల లక్ష్మణ్ రావు బయట ఏదో నగరంలోనో, చిన్న పట్టణంలోనో తలదాచుకున్నారని భావిస్తోంది. ఇక జార్ఖండ్-బిహార్‌లో మరో పొలిట్‌బ్యూరో సభ్యుడు మిసిర్ బెస్రా అలియాస్ సాగర్ సహా రాష్ట్ర, జిల్లా, ఏరియా స్థాయి నేతలు పలువురు ఇంకా యాక్టివ్‌గానే ఉన్నారని అభిప్రాయపడుతోంది. తమ రాష్ట్రానికి చెందిన ఏడుగురు ఇంకా పార్టీలోనే ఉన్నారని, అయితే వారు ఇక్కడ లేరని తెలంగాణ డీజీపీ ఇటీవల ప్రకటించారు. కనుక వాళ్లు కూడా బహుశా జార్ఖండ్‌లోనో, బయట డెన్ కీపర్లుగానో ఉండివుంటారని కేంద్ర వర్గాలు భావిస్తున్నాయి.
కూంబింగులు, లొంగుబాట్లకు ప్రయత్నాలు
హోంశాఖ ఆదేశాలు అందుకున్న భద్రతా బలగాలు అన్ని రాష్ట్రాల్లో తమ కూంబింగులను తీవ్రతరం చేశాయి. బస్తర్‌లో ఆపరేషన్ ఫోర్, ఎండ్‌గేమ్ వంటి పేర్లతో మావోయిస్టులను మూలమూలలా గాలిస్తుండగా, జార్ఖండ్, ఏఓబీ అడవుల్లో సైతం గాలింపులు కొనసాగుతున్నాయి. ఎట్టి పరిస్థితుల్లోనూ మిగిలివున్న మావోయిస్టులను 31కల్లా న్యూట్రలైజ్ చేయాలని, ఆ తేదీన విజయ ప్రకటన చేయాలని అమిత్ షా భావిస్తున్నట్లు సమాచారం. ఆ తర్వాత తగిన సమయం చూసి అన్ని రాష్ట్రాల్లో లొంగిపోయిన మావోయిస్టులను, ఆయుధాలను ఒకచోట చేర్చి మావోయిస్ట్ ముక్త్ భారత్ సభ నిర్వహించాలనే తలంపుతో ఆయన ఉన్నారని తెలుస్తోంది.
దేశంలో మావోయిస్టు ప్రభావిత ప్రాంతాలను పూర్తిస్థాయిలో నిర్మూలించేందుకు కేంద్ర ప్రభుత్వం మరింత వేగంగా చర్యలు తీసుకుంటోంది. ఈనెల 31 వరకు వేచి చూడాల్సిందే.


