|

Andhravilas.net – Breaking News & Movie Buzz Since 2002

షాకింగ్: ‘ధురంధర్ 2’ టీమ్‌కు డ్రోన్ తలనొప్పి! ముంబైలో ఏం జరిగింది?

Published: 03-02-2026, 7:35 AM
షాకింగ్: 'ధురంధర్ 2' టీమ్‌కు డ్రోన్ తలనొప్పి! ముంబైలో ఏం జరిగింది?
  • బాలీవుడ్‌కు ఊపిరిలూదిన ‘ధురంధర్’ చిత్రం, సీక్వెల్ షూటింగ్‌లో వివాదం.
  • ముంబైలోని హై-సెక్యూరిటీ జోన్‌లో డ్రోన్ వాడకంపై చిత్ర యూనిట్‌పై కేసు నమోదు.
  • ముందస్తు అనుమతులు తీసుకోకుండానే డ్రోన్ ఎగరవేయడంతో పోలీసుల చర్యలు.
  • లోకేషన్ మేనేజర్ రింకూ రాజ్‌పాల్ వాల్మీకిపై ఎఫ్ఐఆర్ నమోదు చేసిన పోలీసులు.

‘ధురంధర్ 2’ సినిమా షూటింగ్‌లో ఊహించని చిక్కులు ఎదురయ్యాయి. ముంబైలోని హై-సెక్యూరిటీ ప్రాంతంలో అనుమతి లేకుండా డ్రోన్ ఉపయోగించడంతో చిత్ర బృందంపై కేసు నమోదైంది. దీనికి సంబంధించిన పూర్తి వివరాలు ఇప్పుడు తెలుసుకుందాం.

‘ధురంధర్ 2’ షూటింగ్‌లో డ్రోన్ కలకలం

Dhurandhar 2: ఇటీవల వచ్చిన ‘ధురంధర్’ (Dhurandhar) చిత్రం బాలీవుడ్‌కు ఊపిరిపోసిన విషయం తెలిసిందే. ఫ్లాపులతో అల్లాడుతున్న బాలీవుడ్ ఇండస్ట్రీకి, రికార్డు స్థాయిలో కలెక్షన్స్ రాబట్టి.. కొత్త ఊపిరినిచ్చిందీ చిత్రం. రణవీర్ సింగ్, సంజయ్ దత్, అక్షయ్ ఖన్నా, సారా అర్జున్ వంటి వారు అసాధారణమైన నటనతో ప్రేక్షకులను ఆకట్టుకుని, సరికొత్త రికార్డులకు నిలయంగా మారింది. మొదటి పార్ట్ ఘన విజయం సాధించడంతో, రెండో పార్ట్ (Dhurandhar 2) కోసం రెట్టింపు ఉత్సాహంతో టీమ్ పని చేస్తోంది. ఈ క్రమంలో ముంబైలోని హై-సెక్యూరిటీ జోన్‌లో షూటింగ్ చేయడంతో, ఈ చిత్ర బృందం ఇప్పుడు చిక్కుల్లో పడింది. ముంబైలోని హై సెక్యూరిటీ ప్రాంతమైన ఫోర్ట్ (Fort) ప్రాంతంలో ముందస్తు అనుమతి లేకుండా డ్రోన్‌ను ఉపయోగించినందుకు గానూ చిత్ర యూనిట్‌పై ముంబై పోలీసులు (Mumbai Police) చట్టపరమైన చర్యలకు సిద్ధమయ్యారు. ఈ మేరకు చిత్ర లోకేషన్ మేనేజర్‌పై ఎఫ్ఐఆర్ నమోదైనట్లుగా తెలుస్తోంది.

హై-సెక్యూరిటీ జోన్‌లో అనుమతి లేని డ్రోన్

సౌత్ ముంబైలోని ఫోర్ట్ ప్రాంతం.. ప్రభుత్వ కార్యాలయాలు, ఆర్థిక సంస్థలతో కూడిన హై-సెక్యూరిటీ జోన్. ఫిబ్రవరి 1వ తేదీన ఈ ప్రాంతంలో ‘ధురందర్ 2’ షూటింగ్ జరుగుతుండగా, చిత్ర బృందం ఏరియల్ షాట్స్ కోసం డ్రోన్‌ను గాలిలోకి ఎగురవేసింది. ఈ డ్రోన్ వాడటానికి సంబంధించి ఎలాంటి అధికారిక అనుమతులు చిత్రబృందం తీసుకోలేదని తేలడంతో ఎంఆర్ఏ మార్గ్ (MRA Marg) పోలీసులు రంగంలోకి దిగారు. పోలీసుల చెబుతున్న కథనం ప్రకారం.. నిబంధనలను ఉల్లంఘించినందుకు గానూ లోకేషన్ మేనేజర్ రింకూ రాజ్‌పాల్ వాల్మీకి (Rinku Rajpal Valmiki)పై భారతీయ న్యాయ సంహిత (BNS) సెక్షన్ 223 కింద కేసు నమోదు చేశారు. అధికార యంత్రాంగం జారీ చేసిన ఆదేశాలను ఉద్దేశపూర్వకంగా ధిక్కరించారనే ఆరోపణల‌తో పోలీసులు ఈ FIR ను ఫైల్ చేశారు.

చిత్ర యూనిట్‌పై కేసు నమోదు చేసిన పోలీసులు

ఈ సినిమా కోసం జనవరి 30 నుంచి ఫోర్ట్ కాంప్లెక్స్‌లోని కొన్ని భాగాలను పాకిస్థాన్‌లోని పాత వీధులను తలపించేలా భారీ సెట్టింగ్‌లతో మార్చేశారు. ఈ మార్పులు అటు స్థానికులను, ఇటు భద్రతా సిబ్బందిని ఆకర్షించాయి. షూటింగ్ మూడవ రోజైన ఫిబ్రవరి 1న సంజయ్ దత్‌తో సహా చిత్ర బృందం మొత్తం సెట్స్‌లో ఉండగా, డ్రోన్ వాడకం భద్రతా పరమైన ఆందోళనలకు దారితీసింది. డ్రోన్ వినియోగాన్ని గుర్తించిన వెంటనే పోలీసులు లోకేషన్ మేనేజర్‌కు నోటీసులు జారీ చేశారు. ప్రస్తుతం దీనిపై విచారణ కొనసాగుతోంది. ముంబై వంటి నగరాల్లో, ముఖ్యంగా రక్షణ పరంగా సున్నితమైన ప్రాంతాల్లో డ్రోన్లను ఎగురవేయాలంటే కచ్చితమైన ప్రోటోకాల్ పాటించాలని పోలీసులు స్పష్టం చేశారు. అనుమతి లేకుండా రికార్డింగ్ పరికరాలు వాడితే ఎంతటి వారైనా ఉపేక్షించేది లేదని హెచ్చరించారు. ప్రస్తుతానికైతే ఈ కేసులో ఎలాంటి అరెస్టులు జరగలేదని తెలుస్తోంది. కానీ, షూటింగ్ నిమిత్తం భారీ సెట్లు వేసినప్పుడు, ఆధునిక పరికరాలు వాడేటప్పుడు చిత్ర నిర్మాణ సంస్థలు మరింత బాధ్యతగా వ్యవహరించాలని ఈ ఘటన తెలియజేస్తోంది.

మొత్తానికి ‘ధురంధర్ 2’ చిత్ర బృందం డ్రోన్ వివాదంలో చిక్కుకుంది. అనుమతులు లేకుండా షూటింగ్ చేయడం వల్ల సమస్యలు ఎదుర్కొంటున్నారు. ఈ వ్యవహారం ఎంతవరకు వెళ్తుందో చూడాలి.

Related News

Plugin developed by ProSEOBlogger
Plugin developed by ProSEOBlogger. Get free Ypl themes.