|

Andhravilas.net – Breaking News & Movie Buzz Since 2002

పిల్లల భవిష్యత్తుకు ముప్పు: భారత్‌లో పెరుగుతున్న డయాబెటిస్!

Published: 08-07-2026, 6:14 AM
పిల్లల భవిష్యత్తుకు ముప్పు: భారత్‌లో పెరుగుతున్న డయాబెటిస్!

ఒకప్పుడు పెద్దవారిలో మాత్రమే కనిపించిన డయాబెటిస్, ఇప్పుడు భారత దేశ పిల్లలను తీవ్రంగా ప్రభావితం చేస్తోంది. అనారోగ్యకరమైన ఆహారపు అలవాట్లు, జంక్ ఫుడ్ వినియోగం దీనికి ప్రధాన కారణం. సరైన జాగ్రత్తలు తీసుకోకపోతే పిల్లల భవిష్యత్తు ఆరోగ్యం ప్రమాదంలో పడుతుందని నిపుణులు హెచ్చరిస్తున్నారు.

Key Points

1

భారతదేశంలో చిన్న పిల్లల్లో టైప్ 2 డయాబెటిస్ వేగంగా పెరుగుతోంది.

2

జంక్ ఫుడ్, ప్యాకేజ్డ్ స్నాక్స్ వంటివి పిల్లల ఆరోగ్యానికి హానికరం.

4

జీవనశైలి మార్పుల ద్వారా డయాబెటిస్‌ను నివారించవచ్చని నిపుణులు చెబుతున్నారు.

పిల్లల్లో డయాబెటిస్ పెరుగుదలకు కారణాలు

Healthy Diet For Children : ఒకప్పుడు డయాబెటిస్ (మధుమేహం) అనేది కేవలం వయసు పైబడిన వారిలోనే కనిపించేది. కానీ ప్రస్తుతం భారతదేశంలో పరిస్థితి వేగంగా మారుతోంది! మునుపెన్నడూ లేని విధంగా చిన్న పిల్లలు కూడా టైప్ 2 డయాబెటిస్ బారిన పడుతున్నారు. ఇది నిజంగా ప్రమాదకరమైన విషయం. ఈ రోజుల్లో పోషకాల కంటే కూడా త్వరగా, సులభంగా దొరికే జంక్ ఫుడ్స్‌కు తల్లిదండ్రులు ప్రాధాన్యత ఇస్తుండటమే పిల్లల ఆరోగ్యానికి శాపంగా మారుతోంది.

తీపి ఎక్కువగా ఉండే బ్రేక్‌ఫాస్ట్ సెరల్స్, ప్యాకేజ్డ్ స్నాక్స్, చిప్స్, బిస్కెట్లు, ఇతర అల్ట్రా-ప్రాసెస్డ్ ఫుడ్స్ నేటి తరం పిల్లల రోజువారీ ఆహారంలో భాగమైపోయాయి. శరీరానికి ఎంతో అవసరమైన ప్రోటీన్, ఫైబర్ (పీచు పదార్థం), సహజసిద్ధమైన ఆహారం పూర్తిగా కరువవుతోంది. ఇవి సమయాన్ని ఆదా చేసే సులభమైన ఆహారాలుగా అనిపించినప్పటికీ, వీటిని అలవాటుగా మార్చడం వల్ల చిన్న వయసులోనే పిల్లల జీవక్రియ దెబ్బతింటుంది. ఇది భవిష్యత్తులో తీవ్రమైన ఆరోగ్య సమస్యలకు పునాది వేస్తుంది.

అయితే, జీవనశైలి, ఆహారపు అలవాట్లలో కొన్ని మార్పులు చేసుకోవడం ద్వారా ఈ వ్యాధి రాకుండా ముందే అడ్డుకోవచ్చని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు.

దిల్లీలోని ఆష్లోక్ హాస్పిటల్ వ్యవస్థాపక డైరెక్టర్, 40 ఏళ్లకు పైగా అనుభవం ఉన్న ప్రముఖ కార్డియాలజిస్ట్ డాక్టర్ ఆలోక్ చోప్రా భారతదేశంలో పెరుగుతున్న ఈ ప్రమాదకరమైన ధోరణిపై ఆందోళన వ్యక్తం చేశారు. పిల్లల్లో టైప్ 2 డయాబెటిస్ పెరగడానికి దారితీస్తున్న జీవనశైలి లోపాలను వివరించడంతో పాటు భవిష్యత్తులో వారి ఆరోగ్యాన్ని కాపాడుకోవడానికి తీసుకోవాల్సిన ముందస్తు జాగ్రత్తలను ఇన్​స్టాగ్రామ్ వేదికగా పంచుకున్నారు.

A post shared by Alok Chopra (@dralokchopra)

అనారోగ్యకరమైన ఆహారం, జీవనశైలి ప్రభావం

టైప్ 1 డయాబెటిస్ అనేది ఎక్కువగా జన్యుపరమైన కారణాల వల్ల వస్తుందని, కానీ టైప్ 2 డయాబెటిస్ మాత్రం పూర్తిగా మన జీవనశైలి, ఆహారపు అలవాట్ల వల్లే వస్తుందని డాక్టర్ చోప్రా స్పష్టం చేశారు. కేవలం నేరుగా చక్కెర (తీపి) తినడం వల్లే డయాబెటిస్ వస్తుందనేది చాలా మందిలో ఉన్న ఒక పెద్ద అపోహ మాత్రమేనని, దీని వెనుక అసలు నిజం చాలా భిన్నంగా ఉంటుందని ఆయన పేర్కొన్నారు. పిల్లలు రోజంతా తినే ఆహారంలో రిఫైన్డ్ కార్బోహైడ్రేట్లు ఎక్కువగా ఉండి, ఫైబర్, ప్రోటీన్ తక్కువగా ఉంటే.. ఆ పిండి పదార్థాలు శరీరం లోకి వెళ్లిన వెంటనే వేగంగా గ్లూకోజ్‌గా మారిపోతాయి. దీనివల్ల రక్తంలో చక్కెర స్థాయిలు అకస్మాత్తుగా పెరిగిపోతాయి.

“చాలా మంది నేరుగా తీపి తింటేనే షుగర్ వ్యాధి వస్తుందని అనుకుంటారు, కానీ అది నిజం కాదు. మీ పిల్లలు రోజంతా ఎక్కువ కార్బోహైడ్రేట్లు, తక్కువ ఫైబర్, తక్కువ ప్రోటీన్ ఉన్న ఆహారాన్ని తీసుకుంటే.. అది శరీరంలోకి వెళ్లాక చక్కెరగా మారుతుంది. ఉదయం బ్రేక్‌ఫాస్ట్‌లో సెరల్స్, బ్రెడ్ లేదా ఆలూ పరాటా, మధ్యాహ్నం అన్నం, చపాతీ, సాయంత్రం ప్యాకెట్ చిప్స్, ప్రాసెస్డ్ స్నాక్స్ ఇస్తుంటారు. వీటిలో ప్రోటీన్, ఫైబర్ అస్సలు ఉండవు. ఇవన్నీ చివరికి గ్లూకోజ్‌గా విడిపోతాయి. ఉదాహరణకు ఒక బ్రెడ్ స్లైస్‌లో దాదాపు 15 గ్రాముల కార్బోహైడ్రేట్లు ఉంటాయి. అంటే అది శరీరంలో నాలుగు చెంచాల చక్కెరతో సమానం. ఇప్పుడు ఉదయాన్నే పిల్లలు రెండు లేదా మూడు బ్రెడ్ స్లైస్‌లు తింటే, వారి శరీరం తట్టుకోలేనంత చక్కెర లోడ్ అప్పుడే అందిపోతుంది,” అని డాక్టర్ ఆలోక్ చోప్రా వివరించారు.

పిల్లలు సాధారణంగా ఫ్లేవర్డ్ పెరుగు, టొమాటో కెచప్, బ్రేక్‌ఫాస్ట్ సెరల్స్, ప్యాకేజ్డ్ మిల్క్‌షేక్స్, బిస్కెట్లను ఎంతో ఇష్టంగా తింటారు. కంపెనీలు వీటిని హెల్తీ ఫుడ్స్‌గా మార్కెటింగ్ చేసినప్పటికీ, వీటిలో కంటికి హిడెన్ షుగర్ విపరీతంగా ఉంటుంది. ఇటువంటి అల్ట్రా-ప్రాసెస్డ్ ఆహారాల వినియోగం పెరగడం వల్ల, పిల్లలు తమ శరీరం తట్టుకోగలిగే శక్తి కంటే ఎక్కువ గ్లూకోజ్‌ను తీసుకుంటున్నారని డాక్టర్ చోప్రా హెచ్చరించారు. ఈ అలవాటు కేవలం వారి శారీరక ఆరోగ్యాన్నే కాకుండా మానసిక స్థితి, ప్రవర్తన, భావోద్వేగాలు, ఏకాగ్రతపై కూడా తీవ్ర ప్రభావం చూపుతుంది.

“ప్రస్తుత కాలంలో పిల్లలు తమ శరీరానికి అవసరమైన దానికంటే ఎక్కువ గ్లూకోజ్ తీసుకుంటున్నారు. నిరంతరం ప్రాసెస్డ్ ఫుడ్స్, షుగర్ ఇవ్వడం వల్ల వారి ప్రవర్తన మారిపోతుంది. నేటి పిల్లల్లో చాలా మంది బ్లడ్ షుగర్ హెచ్చుతగ్గుల సమస్యను ఎదుర్కొంటున్నారు. ఒక నిమిషం చాలా హైపర్‌యాక్టివ్‌గా ఉంటే, మరుసటి నిమిషంలోనే విసుగు చెందడం, అసహనానికి గురికావడం, దేనిపైనా దృష్టి పెట్టలేకపోవడం వంటివి జరుగుతాయి. తల్లిదండ్రులేమో తమ పిల్లలు మొండిగా తయారయ్యాడని భావిస్తారు. కానీ నిజానికి అక్కడ ఆ పిల్లల శరీర జీవక్రియ నియంత్రణ కోల్పోయి ఉంటుంది,” అని కార్డియాలజిస్ట్ తెలిపారు.

ఈ సమస్య తీవ్రత దేశంలో ఎంతలా పెరిగిపోయిందంటే, చిన్న వయసులోనే పిల్లలకు డయాబెటిస్ స్క్రీనింగ్ పరీక్షలు చేయడానికి భారతదేశం ప్రత్యేక జాతీయ మార్గదర్శకాలను ప్రవేశపెట్టిందని డాక్టర్ చోప్రా గుర్తుచేశారు.

డయాబెటిస్ నివారణకు నిపుణుల సూచనలు

“జపాన్, సింగపూర్ వంటి దేశాలు చిన్నతనం నుంచే పిల్లల పోషకాహారానికి అత్యంత ప్రాధాన్యత ఇస్తున్నాయి. అక్కడ జంక్ ఫుడ్స్‌పై కఠినమైన నిబంధనలు ఉండటమే కాకుండా, పాఠశాలల్లో సమతుల్య ఆహారాన్ని అందిస్తారు. అలాగే ఎక్కువ చక్కెర, ప్రాసెస్డ్ ఫుడ్స్ తినడం వల్ల వచ్చే ఆరోగ్య నష్టాల గురించి ఆయా దేశాల్లో చిన్న వయసు నుంచే పిల్లలకు అవగాహన కల్పిస్తారు. మన దేశంలో కూడా భవిష్యత్తు తరాల ఆరోగ్యాన్ని కాపాడటానికి ఇటువంటి కఠినమైన నిబంధనలు, నివారణ వ్యూహాలు అత్యంత అవసరం,” అని ఆయన స్పష్టం చేశారు.

ఈ నేపథ్యంలో పిల్లల్లో డయాబెటిస్ రాకుండా ఉండేందుకు తల్లిదండ్రులు ఏం చేయవచ్చో డాక్టర్ చోప్రా కొన్ని సలహాలు ఇచ్చారు.

“ముందుగా, పిల్లలకు ఇచ్చే షుగర్ డ్రింక్స్, ప్రాసెస్డ్ స్నాక్స్‌ను సాధారణ అలవాటుగా మార్చడం ఆపాలి. ప్రతి భోజనంలోనూ ప్రోటీన్, ఫైబర్, ఆరోగ్యకరమైన కొవ్వులు ఉండేలా చూసుకోవాలి, అలాగే కార్బోహైడ్రేట్లను అదుపులో ఉంచాలి. చిన్నతనం నుంచే సహజమైన ఆహారాన్ని తినడం అలవాటు చేయాలి. పండ్లు, డ్రై ఫ్రూట్స్, గుడ్లు, ఇంట్లో వండిన భోజనం, ప్రోటీన్ ఎక్కువగా ఉండే అల్పాహారాన్ని ఇవ్వాలి. ఆహారం చూసి భయపడటం కాదు, ఎక్కువ ప్రోటీన్, ఫైబర్, సహజ ఆహారంతో ప్లేట్‌ను సరిగ్గా బ్యాలెన్స్ చేయడం నేర్పించడమే మన లక్ష్యం కావాలి, అని ఆయన వివరించారు.

పిల్లల ఆరోగ్యం పట్ల తల్లిదండ్రులు మరింత శ్రద్ధ వహించాలి. ఆరోగ్యకరమైన ఆహారం, చురుకైన జీవనశైలిని ప్రోత్సహించడం ద్వారా డయాబెటిస్ వంటి దీర్ఘకాలిక వ్యాధుల నుండి వారిని రక్షించవచ్చు. భవిష్యత్తు తరాలను ఆరోగ్యంగా ఉంచడం మన బాధ్యత.

Related News

Plugin developed by ProSEOBlogger
Plugin developed by ProSEOBlogger. Get free Ypl themes.