
అక్రమ ఆన్‌లైన్ బెట్టింగ్‌కు సంబంధించి 29 మంది సినీ ప్రముఖులపై ఈడీ కేసు నమోదు చేసింది. విజయ్ దేవరకొండ, రానా, శ్రీముఖి వంటి ప్రముఖుల పేర్లు ఈ కేసులో ఉన్నాయి. వీరు బెట్టింగ్ యాప్‌లను ప్రచారం చేసి భారీగా డబ్బులు సంపాదించారని ఆరోపణలు ఉన్నాయి.
Key Points
ఈడీ 29 మంది సినీ ప్రముఖులపై ఆన్‌లైన్ బెట్టింగ్ కేసు నమోదు చేసింది.
విజయ్ దేవరకొండ, రానా, శ్రీముఖి, శ్యామలతో సహా పలువురు నటీనటులు, యూట్యూబర్లు ఈ కేసులో ఉన్నారు.
బెట్టింగ్ యాప్‌ల ప్రచారం ద్వారా భారీగా రెమ్యునరేషన్ పొందారనే ఆరోపణలు.
మనీ లాండరింగ్ చట్టం కింద ఈడీ దర్యాప్తు చేపట్టింది.
29 మంది సినీ ప్రముఖులపై ఈడీ కేసు
అక్రమ ఆన్‌లైన్ బెట్టింగ్ ప్లాట్‌ఫామ్‌లను ప్రచారం చేస్తున్నారనే ఆరోపణలపై ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) గురువారం 29 మంది ప్రముఖ నటీనటులపై ఎన్‌ఫోర్స్‌మెంట్ కేస్ ఇన్ఫర్మేషన్ రిపోర్ట్ (ECIR) నమోదు చేసింది.
వీరిలో హీరోలు విజయ్ దేవరకొండ , రానా దగ్గుబాటి, నటుడు ప్రకాష్ రాజ్, హీరోయిన్స్ నిధి అగర్వాల్ , ప్రణీత సుభాష్, మంచు లక్ష్మి, అనన్య నాగళ్ల, టీవీ యాంకర్స్ శ్రీముఖి, శ్యామల (వైకాపా అధికార ప్రతినిధి), యూట్యూబర్స్ హర్షసాయి , సన్నీ యాదవ్, లోకల్ బాయ్ నాని, సుప్రీతతోపాటు పలువురు సోషల్ మీడియా ఇన్‌ఫ్లుయెన్సర్‌లు ఉన్నట్లు సమాచారం.
వీరితోపాటు వర్షిణి సౌందరరాజన్, బిగ్ బాస్ ముద్దుగుమ్మలు వాసంతి కృష్ణన్, శోభా శెట్టి, సిరి హన్మంతు , నయని పావని , అమృతా చౌదరి, నేహా పఠాన్, పద్మావతి, పండు, ఇమ్రాన్ ఖాన్, విష్ణుప్రియ , టేస్టీ తేజ, రీతూ చౌదరి , బండారు సుప్రీత తదితురుల పేర్లను కూడా ఎఫ్ఐఆర్‌లో చేర్చినట్లు తెలుస్తోంది.
బెట్టింగ్ యాప్ ప్రచారం ఆరోపణలు
బీఎన్ఎస్‌లోని 318 (4), 112, రెడ్‌విత్ 49, తెలంగాణ గేమింగ్ యాక్ట్‌లోని 3, 3 (ఎ), 4 సెక్షన్స్, ఐటీ చట్టం 2000, 2008లోని 66డీ సెక్షన్ల కింద ఈ కేసు నమోదు అయింది. హైదరాబాద్ పోలీసులు నమోదు చేసిన ఎఫ్ఐఆర్ ఆధారంగా ఈడీ దర్యాప్తు చేయనుంది.
ఈ నటీనటులు, యూట్యూబర్స్, సోషల్ మీడియా ఇన్‌ఫ్ల్యూయెన్సర్స్ అంతా జంగ్లీ రమ్మీ, జీత్ విన్, లోటస్365 వంటి ఆన్‌లైన్ బెట్టింగ్ యాప్‌లను ప్రచారం చేయడం ద్వారా భారీగా రెమ్యునరేషన్, ఎండార్స్‌మెంట్ ఫీజులు పొందారని ఈడీ అనుమానిస్తోంది. మనీ లాండరింగ చట్టం కింద ఈడీ చర్యలు చేపట్టింది.
అయితే, 32 ఏళ్ల వ్యాపారవేత్త పీఎం ఫణీంద్ర హైదరాబాద్‌లోని మియాపూర్ పోలీస్ స్టేషన్‌లో మార్చిలో ఫిర్యాదు ఇచ్చిన విషయం తెలిసిందే. యువతలో బెట్టింగ్ యాప్‌ల పట్ల పెరుగుతున్న ఆసక్తిపై ఆందోళన వ్యక్తం చేస్తూ, సోషల్ మీడియా ప్రముఖుల ద్వారా ఈ యాప్‌లు విస్తృతంగా ప్రచారం అవుతున్నాయని ఆయన ఆరోపించారు.
మనీ లాండరింగ్ చట్టం కింద దర్యాప్తు
మార్చి 16న తన కమ్యూనిటీలోని యువకులతో చర్చించినప్పుడు, చాలామంది బెట్టింగ్ ప్లాట్‌ఫామ్‌లలో ఇన్‌ఫ్ల్యూయెన్స్ అయి డబ్బులు పెట్టుబడి పెట్టినట్లు తనకు తెలిసిందని ఫణీంద్ర శర్మ పేర్కొన్నారు.
ఈ నటీనటులంతా భారీ మొత్తంలో పారితోషికాలు తీసుకుని ప్రజలను తమ డబ్బును పందెం వేయడానికి ప్రోత్సహించే బెట్టింగ్ యాప్‌లకు మద్దతు ఇచ్చారని ఫిర్యాదులో ఆరోపించారు.
ఫిర్యాదుదారుడు ఫణీంద్ర కూడా స్వయంగా ఒక యాప్‌లో పెట్టుబడి పెట్టాలని భావించినట్లు.. కానీ, తన కుటుంబ సభ్యులు ఆర్థిక నష్టాల గురించి హెచ్చరించడంతో ఆ నిర్ణయాన్ని విరమించుకున్నట్లు తెలిపారు.
ఈ కేసులో ఎంతమంది నటీనటులు నిర్దోషులుగా నిరూపించుకుంటారో, ఎంతమందికి శిక్ష పడుతుందో చూడాలి. ఈ ఘటన సినీ పరిశ్రమపై తీవ్ర ప్రభావం చూపుతుంది.


