|

Andhravilas.net – Breaking News & Movie Buzz Since 2002

బొగ్గు కుంభకోణంలో ఈడీ దెబ్బ: లాలా ప్యాడ్ మాయతో రూ.159 కోట్ల అక్రమాస్తులు జప్తు!

Published: 15-04-2026, 9:05 AM
బొగ్గు కుంభకోణంలో ఈడీ దెబ్బ: లాలా ప్యాడ్ మాయతో రూ.159 కోట్ల అక్రమాస్తులు జప్తు!
  • రూ.159.51 కోట్ల విలువైన ఆస్తులను ఈడీ సీజ్ చేసింది.
  • అనుప్ మాజీ అలియాస్ ‘లాలా’ సిండికేట్ అక్రమ మైనింగ్‌ను నడిపినట్లు ఈడీ గుర్తించింది.
  • ‘లాలా ప్యాడ్’ పేరుతో నకిలీ రవాణా చలాన్లను సృష్టించి బొగ్గును తరలించారు.
  • నిందితులు హవాలా నెట్‌వర్క్‌ ద్వారా నగదు బదిలీలు చేసినట్లు ఈడీ గుర్తించింది.

పశ్చిమ బెంగాల్‌లో జరిగిన బొగ్గు కుంభకోణంలో ఈడీ కీలక చర్యలు చేపట్టింది. మనీలాండరింగ్ నిరోధక చట్టం కింద రూ.159 కోట్ల ఆస్తులను జప్తు చేసింది. ఈ కేసులో లాలా ప్యాడ్ పేరుతో జరిగిన మోసం బయటపడింది.

ఈడీ దాడుల్లో వెలుగులోకి కొత్త విషయాలు

పశ్చిమ బెంగాల్‌ (West Bengal)లోని ఈస్ట్రన్ కోల్‌ఫీల్డ్స్ లిమిటెడ్ (ECL) పరిధిలో జరిగిన భారీ అక్రమ బొగ్గు తవ్వకాల కేసులో అత్యంతక కీలక పరిణామం చోటుచేసుకుంది. మనీలాండరింగ్ నిరోధక చట్టం (PMLA) కింద తాజాగా ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ రూ.159.51 కోట్ల విలువైన ఆస్తులను తాత్కాలికంగా సీజ్ చేసింది. దీంతో ఈ కేసులో ఇప్పటివరకు జప్తు చేసిన మొత్తం ఆస్తుల విలువ రూ.482.22 కోట్లకు చేరింది. అయితే, అనుప్ మాజీ అలియాస్ ‘లాలా’ నేతృత్వంలోని ఓ సిండికేట్ ఈ అక్రమ మైనింగ్ కార్యకలాపాలను నడిపినట్లుగా ఈడీ దర్యాప్తులో తేలింది. పశ్చిమ బెంగాల్‌లోని కొన్ని లబ్ధిదారులైన కంపెనీలు అక్రమంగా తవ్విన బొగ్గును నగదు రూపంలో కొనుగోలు చేసి, ఆ బ్లాక్ మనీని వైట్ మనీగా చూపేందుకు ప్రయత్నించాయి. ఈ క్రమంలో శ్యామ్ సెల్ అండ్ పవర్ లిమిటెడ్, శ్యామ్ ఫెర్రో అలాయ్స్ వంటి కంపెనీల పేరిట ఉన్న బాండ్లు, పెట్టుబడులను ఈడీ జప్తు చేసింది.

‘లాలా ప్యాడ్’తో అక్రమ రవాణా

ఈ కేసులో నేరగాళ్లు అనుసరించిన వింతైన పనితీరు ఈడీ అధికారులను కూడా విస్మయానికి గురిచేసింది. అక్రమ బొగ్గును తరలించడానికి ‘లాలా ప్యాడ్’ (Lala Pad) పేరుతో నకిలీ రవాణా చలాన్లను సృష్టించేవారు. ట్రాన్స్‌పోర్టర్లకు నకిలీ చలాన్‌తో పాటు రూ.10 లేదా రూ.20 కరెన్సీ నోటును ఇచ్చేవారు. అనంతరం లారీ నంబర్ ప్లేట్ పక్కన ఆ నోటును పట్టుకుని ఫోటో తీసి సిండికేట్ ఆపరేటర్‌కు పంపేవారు. ఆ ఫోటోను ఆపరేటర్ వాట్సాప్ ద్వారా దారిలో ఉండే పోలీసులకు, అధికారులకు పంపేవారు. ఆ గుర్తును చూడగానే పోలీసులు ఆ లారీని ఆపకుండా వదిలేసేవారు, ఒకవేళ ఆపినా వెంటనే విడిచిపెట్టేవారు.

హవాలా నెట్‌వర్క్‌ను ఉపయోగించిన నిందితులు

బ్యాంకింగ్ ఛానళ్లను తప్పించుకోవడానికి నిందితులు భూగర్భ హవాలా నెట్‌వర్క్‌ (Hawala Network)ను ఉపయోగించినట్లుగా ఈడీ అధికారులు గుర్తించారు. నగదు బదిలీల సమయంలో కరెన్సీ నోటు సీరియల్ నంబర్‌ను ఒక రహస్య కోడ్‌గా వాడుతూ లావాదేవీలు నిర్వహించేవారని దర్యాప్తులో వెల్లడైంది. స్థానిక అధికారుల అండదండలతోనే ఈ భారీ బొగ్గు దోపిడీ జరిగిందని ఈడీ అధికారులు వెల్లడించారు.

ఈ కుంభకోణంలో స్థానిక అధికారుల హస్తం ఉందని ఈడీ అనుమానిస్తోంది. ఈ దిశగా మరిన్ని లోతైన దర్యాప్తు చేస్తామని అధికారులు తెలిపారు. దీనికి సంబంధించిన పూర్తి వివరాలు త్వరలో వెల్లడి కానున్నాయి.

Related News

Plugin developed by ProSEOBlogger
Plugin developed by ProSEOBlogger. Get free Ypl themes.