|

Andhravilas.net – Breaking News & Movie Buzz Since 2002

చమురు సంక్షోభం: భవిష్యత్తుకు ముప్పు! పరిష్కార మార్గాలేమి?

Published: 16-03-2026, 9:35 PM
చమురు సంక్షోభం: భవిష్యత్తుకు ముప్పు! పరిష్కార మార్గాలేమి?
  • హోర్ముజ్ జలసంధి దిగ్బంధనం ప్రపంచ ఆర్థిక మాంద్యానికి దారితీయవచ్చు.
  • భారత్ చమురు అవసరాల్లో 85% దిగుమతులపై ఆధారపడుతుంది.
  • చమురు ధరల పెరుగుదల ద్రవ్యోల్బణానికి దారితీస్తుంది.
  • భూగర్భ చమురు నిల్వలను పెంచడం ద్వారా మార్కెట్ హెచ్చుతగ్గుల నుండి రక్షణ పొందవచ్చు.

ప్రపంచ ఆర్థిక వ్యవస్థకు చమురు సరఫరా ఎంత కీలకమో అందరికీ తెలిసిందే. పశ్చిమాసియాలో యుద్ధ మేఘాలు కమ్ముకుంటున్న నేపథ్యంలో, చమురు ధరలు ఆకాశాన్నంటుతున్నాయి. ఇది ఆర్థిక సంక్షోభానికి దారితీసే ప్రమాదం ఉంది.

చమురు సంక్షోభం – ప్రపంచ ప్రభావం

ప్రపంచ ఆర్థిక వ్యవస్థ నాడిని శాసించే శక్తి చమురుది. ఆ సరఫరా వ్యవ‌స్థలో చిన్నపాటి అలజడి రేగినా, దాని ప్రభావం ఖండాతరాలను దాటి సామాన్యుడి వంట గ‌ది వరకు చేరు తుంది. ప్రస్తుతం పశ్చిమాసియాలో ముదురుతున్న యుద్ధ మేఘాలు, ప్రపంచ వాణిజ్యానికి కీలకమైన ‘హోర్మూజ్‌ జల సంధి’ దిగ్బంధన భయాలు ఇంధన మార్కెట్‌ను కుదిపేస్తున్నా యి. కేవలం నెల రోజుల్లోనే బ్రెంట్‌ క్రూడ్ ధర 70 డాలర్ల నుం డి 110 డాలర్ల మార్కును దాటడం రాబోయే ఆర్థిక సునామీకి సంకేతం. యుద్ధ జ్వాలలు చల్లారకపోతే ఇది 150 డాలర్లకు చేరినా ఆశ్చర్యపోనక్కర్లేదని విశ్లేషకులు హెచ్చరిస్తున్నారు..

చమురును ఆయుధంగా మార్చుకోవడం ప్రపంచానికి కొత్తేమీ కాదు. 1973 అరబ్-ఇజ్రాయెల్ యుద్ధం సమయంలో ‘ఒపెక్’ (OPEC) దేశాలు విధించిన ఆంక్షలు ఇంధన ధరలను రాత్రికి రాత్రే 300 శాతం పెంచి, ప్రపంచాన్ని అతలాకుతలం చేశాయి. ఆ తర్వాత ఇరాన్ విప్లవం, గల్ఫ్ యుద్ధం, నేటి రష్యా-ఉక్రెయిన్ సంక్షోభం వరకు.. భౌగోళిక రాజకీయ ఉద్రిక్తత‌లు ప్రతిసారి చమురు సంక్షోభానికే దారితీశాయి. ప్రపంచ వినియోగంలో సుమారు 20 శాతం వాటా కలిగిన హోర్మూజ్‌ జలసంధి గుండా సాగే రవాణా నిలిచిపోతే, అది కేవలం కొరతకు మాత్రమే కాదు, గ్లోబల్ రిసెషన్ (ఆర్థిక మాంద్యం)కు దారితీసే ప్రమాదముంది. భారతదేశం తన చమురు అవసరాల్లో దాదాపు 85 శాతం దిగుమతులపైనే ఆధార‌పడుతోంది. అంతర్జాతీయ మార్కెట్‌లో ఒక్క డాలర్ ధర పెరిగినా మన దేశ విదేశీ మారక నిల్వలపై (Foreign Exchange Reserves) తీవ్ర ఒత్తిడి పడుతుంది. పెట్రోల్, డీజిల్ ధరల పెరుగుదల రవాణా భారానికి, తద్వారా నిత్యావసరాల ధరల పెరుగుదలకు (ద్రవ్యోల్బణం) దారి తీస్తుంది. ఇది సామాన్యుడి కొనుగోలు శక్తిని హరించివేస్తుంది.

భారతదేశంపై చమురు ధరల ప్రభావం

అందుకే ఇంధన వినియోగ నియంత్రణ ఒక సామాజిక బాధ్యత. ఇంధన పొదుపు కేవలం ప్రభుత్వం చేయాల్సిన పని కాదు.. అనవసర వినియోగం తగ్గించడం, ‘కార్ పూలింగ్’ను ప్రోత్సహించడం, సమర్థవంతమైన ప్రజారవాణా వ్యవస్థను ప్రజలు ఆశ్రయించేలా అవగాహన కల్పించాలి. సంక్షోభ సమయాల్లో ఆదుకోవడానికి భూగర్భ చమురు నిల్వలను భారత్ ఇప్పటికే నిర్మించింది. వీటి సామర్థ్యాన్ని పెంచి, కనీసం 90 రోజులకు సరిపడా నిల్వలను సిద్ధం చేసుకోవాలి. తద్వారా అంతర్జాతీయ మార్కెట్ హెచ్చు తగ్గుల నుండి తక్షణ రక్షణ పొందవచ్చు.. అలాగే శిలాజ ఇంధనాలపై ఆధారపడటం తగ్గించడమే శాశ్వత పరిష్కారం. ‘గ్రీన్ హైడ్రోజన్’ మిషన్, ఎలక్ట్రిక్ వాహనాల ప్రోత్సాహకాలు, ఇథనాల్ బ్లెండింగ్ (పెట్రోల్‌లో ఇథనాల్ కలిపే ప్రక్రియ)ను వేగవంతం చేయాలి. సౌర, పవన శక్తి వంటి పునరుత్పాదక ఇంధన వనరులలో భారత్ ఇప్పటికే అగ్రగామిగా ఎదుగుతోంది, దీన్ని మరింత విస్తరించాలి.

ఇంధన భద్రతకు పరిష్కార మార్గాలు

ఇక మన దేశంలోనే ఉన్న చమురు, గ్యాస్ నిక్షేపాలను వెలికితీసేందుకు అత్యాధునిక సాంకేతికతను వాడాలి. అన్వేషణ రంగంలో ప్రైవేటు పెట్టుబడులను ఆకర్షించడం ద్వారా దిగుమతులపై ఆధారపడటాన్ని కొంతవరకు తగ్గించవచ్చు. 1973 నాటి సంక్షోభం ప్రపంచానికి ఒక హెచ్చరిక అయితే, ప్రస్తుత పరిస్థితులు ఒక కార్యాచరణకు పిలుపు.. ఇంధన రంగంలో ‘ఆత్మనిర్భరత’ సాధించడం అంటే కేవలం ఆర్థిక విజయం మాత్రమే కాదు, అది దేశ సార్వభౌమత్వానికి రక్షణ. యుద్ధాలు, రాజకీయ విభేదాలు మన నియంత్రణలో లేకపోవచ్చు, కానీ మన ఇంధన వినియోగం, ప్రత్యామ్నాయ వనరుల అభివృద్ధి ఖచ్చితంగా మన చేతుల్లోనే ఉన్నాయి. ఇప్పుడు మేల్కొంటేనే రేపటి తరానికి సుస్థిరమైన, సురక్షితమైన ఆర్థిక భవిష్యత్తును అందించగలం.

కాబట్టి, శిలాజ ఇంధనాలపై ఆధారపడటం తగ్గించి, ప్రత్యామ్నాయ ఇంధన వనరులను ప్రోత్సహించడం ద్వారానే దేశానికి, ప్రజలకు భవిష్యత్తులో రక్షణ కల్పించవచ్చు.

Related News

Plugin developed by ProSEOBlogger
Plugin developed by ProSEOBlogger. Get free Ypl themes.