
📌 Key Points
- ఏపీలోని 51 పట్టణ స్థానిక సంస్థల్లో ‘స్ట్రీట్ వెండింగ్ ప్లాన్స్’ అమలుకు నోటిఫికేషన్.
- వీధి వ్యాపారుల హక్కులకు చట్టపరమైన రక్షణ, ట్రాఫిక్ నియంత్రణ లక్ష్యంగా ఈ ప్లాన్.
- వ్యాపారులు తాత్కాలిక స్టాళ్లు మాత్రమే ఏర్పాటు చేయాలి, శాశ్వత నిర్మాణాలు నిషేధం.
- ప్రతి ఐదేళ్లకు ఒకసారి ‘టౌన్ వెండింగ్ కమిటీల’తో సంప్రదించి ప్లాన్‌ను సమీక్షిస్తారు.
ఆంధ్రప్రదేశ్‌లో వీధి వ్యాపారుల జీవనోపాధిని కాపాడటంతో పాటు పట్టణ ట్రాఫిక్ సమస్యలను పరిష్కరించేందుకు ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. 51 పురపాలక సంఘాల్లో ‘స్ట్రీట్ వెండింగ్ ప్లాన్స్’ అమలు చేస్తూ నోటిఫికేషన్ జారీ చేసింది. ఇది వ్యాపారులకు చట్టపరమైన రక్షణ కల్పిస్తుంది.
వీధి వ్యాపారుల జీవనోపాధికి రక్షణ
ఆంధ్రప్రదేశ్ వ్యాప్తంగా పట్టణ ప్రాంతాల్లో వీధి వ్యాపారుల జీవనోపాధిని కాపాడుతూనే.. మరోవైపు ట్రాఫిక్ సమస్యలకు చెక్ పెట్టేందుకు రాష్ట్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ఇందులో భాగంగా 51 పట్టణ స్థానిక సంస్థలలో(ULBs) ‘స్ట్రీట్ వెండింగ్ ప్లాన్స్’ (వీధి వ్యాపార ప్రణాళికలు) అమలు చేస్తూ ప్రభుత్వం నోటిఫికేషన్ విడుదల చేసింది. ఈ నిర్ణయం ద్వారా వీధి వ్యాపారుల హక్కులకు చట్టపరమైన రక్షణ లభించడంతో పాటు.. నగరాల్లో ట్రాఫిక్ నిర్వహణ, పాదచారుల భద్రత మెరుగుపడనున్నాయి.
‘వీధి వ్యాపారుల (జీవనోపాధి రక్షణ మరియు వీధి వ్యాపార నియంత్రణ) చట్టం-2014’ ప్రకారం.. మున్సిపల్ పరిపాలన, పట్టణాభివృద్ధి శాఖ జీవో జారీ చేసింది. ఈ నోటిఫికేషన్ పరిధిలోకి మూడు నగరపాలక సంస్థలు (కర్నూలు, నెల్లూరు, శ్రీకాకుళం), 48 మున్సిపాలిటీలు వస్తాయి. ఇందులో భీమవరం, హిందూపూర్, గుంతకల్, తాడిపత్రి, తాడేపల్లిగూడెం, నరసాపురం, పిఠాపురం , సామర్లకోట, నూజివీడు, వినుకొండ, పలాస-కాసిబుగ్గ, బొబ్బిలి, రాజంపేట, కదిరి, కనిగిరి, గూడూరు, గిద్దలూరు వంటి ప్రధాన పట్టణాలు ఉన్నాయి.
వీధి వ్యాపారుల జీవనోపాధిని కాపాడుతూనే, పట్టణాలను క్రమబద్ధంగా అభివృద్ధి చేయడమే ఈ ప్రాజెక్ట్ ముఖ్య ఉద్దేశమని మున్సిపల్ పరిపాలన, పట్టణాభివృద్ధి శాఖ మంత్రి పొంగూరు నారాయణ తెలిపారు. ఈ ప్లాన్ ద్వారా పట్టణాల్లో వెండింగ్ జోన్స్, నియంత్రిత వెండింగ జోన్స్, నో వెండింగ్ జోన్స్ స్పష్టంగా గుర్తిస్తారు. దీనివల్ల వీధి వ్యాపారులు అధికారులు లేదా ఇతరుల నుంచి ఎలాంటి ఆకస్మిక తొలగింపుల భయం లేకుండా ప్రశాంతంగా వ్యాపారం చేసుకోవచ్చు.
కొత్త ప్లాన్: ముఖ్యాంశాలు, నియమాలు
అదే సమయంలో రహదారులు, ఫుట్‌పాత్‌లు, ఇతర బహిరంగ ప్రదేశాలు ప్రజలందరికీ అందుబాటులో ఉంటాయి. వీధి వ్యాపారులు కేవలం తాత్కాలిక, సులభంగా తొలగించగలిగే స్టాళ్లను మాత్రమే ఏర్పాటు చేసుకోవాలి. ఎలాంటి శాశ్వత కట్టడాలు నిర్మించకూడదు.
వ్యాపారాల వల్ల ట్రాఫిక్ కు, పాదచారుల రాకపోకలకు, అత్యవసర సేవల (అంబులెన్స్, ఫైర్ ఇంజన్ వంటివి) వాహనాలకు ఎటువంటి అడ్డంకులు ఎదురుకాకూడదు. వ్యాపారం చేసుకునే పరిసర ప్రాంతాలను అత్యంత పరిశుభ్రంగా ఉంచుకోవాల్సిన బాధ్యత వ్యాపారులదే.
ట్రాఫిక్ సమస్యలకు చెక్, పట్టణాల అభివృద్ధి
మున్సిపల్ శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ ఎస్. సురేష్ కుమార్ మాట్లాడుతూ.. స్థానిక సంస్థలు అమలు చేయడానికి వీలుగా ఈ ఫ్రేమ్‌వర్క్‌ను సిద్ధం చేసినట్లు తెలిపారు. ఇకపై ప్రతి ఐదేళ్లకు ఒకసారి ‘టౌన్ వెండింగ్ కమిటీల’తో సంప్రదింపులు జరిపి ఈ ప్లాన్‌ను అప్‌డేట్ చేయాలని మున్సిపాలిటీలను ఆదేశించారు. ఈ వ్యాపార ప్రణాళికలను పట్టణాల మాస్టర్ ప్లాన్స్‌తో కూడా అనుసంధానించనున్నారు. రాష్ట్రంలోని మిగిలిన మున్సిపాలిటీలకు సంబంధించిన ప్లాన్స్ కూడా సిద్ధమవుతున్నాయని, వాటిని త్వరలోనే విడతల వారీగా నోటిఫై చేస్తామని ప్రభుత్వం వెల్లడించింది.
ఆనంద్ సాయి మాదాసు ప్రస్తుతం హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో డిప్యూటీ చీఫ్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. డిజిటల్ మీడియాలో 9 ఏళ్లకుపైగా అనుభవం ఉంది. హెచ్‌టీ తెలుగులో చేరడం కంటే ముందు ఏబీపీ దేశంలో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేశారు. మెుదట నవతెలంగాణ అనే దినపత్రికలో సబ్ఎడిటర్‌గా జర్నలిజం కెరీర్ మెుదలుపెట్టారు. ఆ తర్వాత కరీంనగర్‌లో ఈనాడు దినపత్రికలో కొంతకాలం సబ్‌ఎడిటర్‌గా బాధ్యతలు చూసుకున్నారు. కాకతీయ యూనివర్సిటీలో 2015-2017 పీజీ మాస్ కమ్యూనికేషన్ అండ్ జర్నలిజం చేశారు. ఈ సమయంలో మేడారం సమ్మక్క-సారలమ్మ జాతర కోసం ప్రత్యేకంగా క్యాంపస్ నుంచి పంపించిన టీమ్‌లో ఉన్నారు. పీజీ చదివే సమయంలోనే క్యాంపస్ రిక్రూట్‌మెంట్‌లో భాగంగా ఈటీవీ భారత్‌కు సెలక్ట్ అయ్యారు. అక్కడ ఆంధ్రప్రదేశ్ డెస్క్‌లో పని చేశారు. అంతేకాదు కొన్ని ప్రత్యేక స్టోరీలు కూడా ఈటీవీ భారత్ వెబ్‌సైట్ కోసం రాసేవారు. 2019 ఎన్నికల్లో ఎలక్షన్ డెస్క్ టీమ్‌లో ఉన్న నలుగురిలో ఆనంద్ సాయి ఒకరు. ఆ తర్వాత అక్కడ నుంచి ఏబీపీ దేశంలోకి వెళ్లి కొంతకాలం పని చేశారు. ఈ సమయంలో కూడా డిజిటల్ మీడియాకు తగినట్టుగా అనేక ప్రత్యేక కథనాలు రాశారు.
హిందూస్తాన్ టైమ్స్ తెలుగులో 2022లో చేరారు. ఇక్కడ గతంలో నేషనల్, బిజినెస్, లైఫ్‌స్టైల్, ఎంటర్‌టైన్‌మెంట్, స్పోర్ట్స్ సెక్షన్లకు పనిచేశారు. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్, తెలంగాణ సెక్షన్లకు వార్తలు రాస్తున్నారు. అన్ని సెక్షన్లకు డిజిటల్ కంటెంట్ రైటర్‌గా పని చేసిన అనుభవం ఆయనకు ఉంది. అంతేకాదు ఈటీవీ భారత్, ఏబీపీ దేశం, హిందుస్తాన్ టైమ్స్ వెబ్‌సైట్స్ లాంచ్ టీమ్‌లో ఈయన ఉన్నారు. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాజకీయ పరిణామాలు, విశ్లేషణలు, విద్య, ఉద్యోగ సమాచారంతో పాటు ఆసక్తికరమైన కథనాలను అందిస్తారు. ప్రభుత్వ పథకాలు, ఉద్యోగ నోటిఫికేషన్లు, ఇతర సమాచారం ప్రజలకు సులభంగా అర్థమయ్యే రీతిలో, వీలైనంత త్వరగా కథనాలను ఇవ్వటంలో ప్రత్యేక శైలి కలిగి ఉన్నారు. అనేకసార్లు హిందుస్తాన్ టైమ్స్ సంస్థ నుంచి ఇన్‌స్టా అవార్డులు అందుకున్నారు. డిజిటల్ మీడియాలో ఎక్కువకాలం పని చేసిన అనుభవం ఉంది. యూజర్లకు ఉపయోగపడే వార్తలను అందించడంలో ముందుంటారు. Read More
ఈ కొత్త ప్లాన్ ద్వారా వీధి వ్యాపారులు భయం లేకుండా వ్యాపారం చేసుకోవచ్చు, అదే సమయంలో పట్టణాలు క్రమబద్ధంగా అభివృద్ధి చెందుతాయి. ఇది వ్యాపారులకు, ప్రజలకు ఇద్దరికీ ప్రయోజనకరంగా ఉంటుందని ప్రభుత్వం ఆశిస్తోంది.


