
తెలంగాణలో వాట్సాప్ బాస్ ఫ్రాడ్ కేసు వెలుగులోకి వచ్చింది. నకిలీ ప్రొఫైల్ సృష్టించి కంపెనీ ఎండీలా నటించి రూ.4.70 కోట్లు కాజేసిన సైబర్ ముఠా గుట్టును TGCSB రట్టు చేసింది.
Key Points
తెలంగాణ సైబర్ సెక్యూరిటీ బ్యూరో వాట్సాప్ బాస్ ఫ్రాడ్ కేసులో ఇద్దరు నిందితులను అరెస్ట్ చేసింది.
నిందితులు నకిలీ వాట్సాప్ ప్రొఫైల్ సృష్టించి కంపెనీ ఎండీలా నటించి రూ.4.70 కోట్లు కాజేశారు.
అరెస్ట్ అయిన వారు ఖమ్మం జిల్లా సత్తుపల్లికి చెందిన దోసపాటి కృష్ణ సాయి, మండవల్లి శివ నాగరాజు.
ఈ కేసులో రూ.1.80 కోట్లు నేరుగా శివ నాగరాజు ఖాతాకు బదిలీ అయ్యాయి.
నకిలీ వాట్సాప్ ప్రొఫైల్ తో రూ.4.70 కోట్ల మోసం
కార్పొరేట్ కంపెనీల యాజమాన్యాల పేరిట వాట్సాప్ ప్రొఫైల్స్ సృష్టించి కోట్లాది రూపాయలు కొల్లగొడుతున్న అంతర్రాష్ట్ర సైబర్ ముఠా గుట్టును తెలంగాణ సైబర్ సెక్యూరిటీ బ్యూరో (TGCSB) రట్టు చేసింది. కంపెనీ మేనేజింగ్ డైరెక్టర్ లాగా నటిస్తూ.. సంస్థ ఉద్యోగిని నమ్మించి రూ. 4.70 కోట్లు కాజేసిన భారీ వాట్సాప్ బాస్(WhatsApp Boss Fraud) స్కామ్‌లో మ్యూల్ బ్యాంక్ ఖాతాలను సరఫరా చేసిన ఇద్దరు నిందితులను పోలీసులు అరెస్ట్ చేశారు.
అరెస్ట్ అయిన వారిని ఖమ్మం జిల్లా సత్తుపల్లికి చెందిన దోసపాటి కృష్ణ సాయి, ప్రస్తుతం హైదరాబాద్ కొత్తపేటలో ఉంటున్న (స్వస్థలం సత్తుపల్లి) మండవల్లి శివ నాగరాజుగా అధికారులు గుర్తించారు.
సైబర్ నేరగాళ్లు ఒక ప్రముఖ కంపెనీ మేనేజింగ్ డైరెక్టర్ పేరు, ఆయన ఫోటోను ఉపయోగించి నకిలీ వాట్సాప్ అకౌంట్‌ను సృష్టించారు. అనంతరం ఆ కంపెనీలో పనిచేసే ఒక ఉన్నతాధికారి లేదా ఆర్థిక వ్యవహారాలు చూసే ఉద్యోగికి మెసేజ్ చేశారు. తానే కంపెనీ ఎండీని అంటూ నమ్మబలికారు. అత్యవసరంగా కొన్ని ఖాతాలకు డబ్బులు బదిలీ చేయాలని ఆదేశించారు. ఆ మెసేజ్‌లు నిజంగానే తమ బాస్ పంపించారని నమ్మిన బాధితుడు.. కేటుగాళ్లు పంపిన వివిధ బ్యాంక్ ఖాతాలకు విడతల వారీగా రూ. 4.70 కోట్లు ట్రాన్స్‌ఫర్ చేశాడు. ఆ తర్వాత అది మోసమని గ్రహించి పోలీసులను ఆశ్రయించాడు.
మ్యూల్ ఖాతాలు సరఫరా చేసిన ఇద్దరు నిందితుల అరెస్ట్
సాంకేతిక విశ్లేషణ, బ్యాంకింగ్ లావాదేవీల ఆధారంగా రంగంలోకి దిగిన తెలంగాణ సైబర్ సెక్యూరిటీ బ్యూరో నిందితులను పట్టుకుంది. ప్రధాన సైబర్ నేరగాళ్లకు కమీషన్ల ఆశ చూపి, కరెంట్ అకౌంట్లను సరఫరా చేయడమే ఈ ఇద్దరి నిందితుల పని అని పోలీసులు తేల్చారు. ఈ మ్యూల్ అకౌంట్ల ఆపరేషన్ ద్వారా వీరు సుమారు రూ.4 లక్షల కమీషన్ సంపాదించి, ఇద్దరూ పంచుకున్నట్లు విచారణలో తేలింది.
విచారణలో పోలీసులు షాకింగ్ నిజాలను కనుగొన్నారు. బాధితుడి నుంచి కాజేసిన రూ. 4.70 కోట్లలో.. రూ. 1.80 కోట్లు నేరుగా శివ నాగరాజు పేరుతో ఉన్న బ్యాంక్ ఖాతాకే బదిలీ అయ్యాయి. ఈ ఖాతాను కృష్ణ సాయి ఏర్పాటు చేసి సైబర్ దొంగలకు అందించాడు. కేవలం ఈ ఒక్క అకౌంట్లోనే రూ. 2.49 కోట్లకు పైగా అనుమానాస్పద లావాదేవీలు జరిగినట్లు పోలీసులు గుర్తించారు.
ఈ నిర్దిష్ట బ్యాంక్ ఖాతా కేవలం తెలంగాణ లోనే కాకుండా మహారాష్ట్ర, రాజస్థాన్, తమిళనాడు రాష్ట్రాల్లో నమోదైన పలు సైబర్ నేరాలతో కూడా ముడిపడి ఉందని ఇన్వెస్టిగేషన్ లో తేలింది. దీన్ని బట్టి ఇదొక పెద్ద అంతర్రాష్ట్ర నెట్‌వర్క్ అని స్పష్టమవుతోంది.
అంతర్రాష్ట్ర సైబర్ నెట్‌వర్క్ లింక్‌లు వెల్లడి
అరెస్ట్ చేసిన ఇద్దరు నిందితులను కోర్టులో హాజరుపరిచి, జ్యుడీషియల్ కస్టడీకి తరలించారు. ఈ కేసులో ప్రధాన సూత్రధారులైన మిగిలిన సైబర్ నేరగాళ్లను పట్టుకోవడానికి, పోయిన డబ్బును రికవరీ చేయడానికి తెలంగాణ సైబర్ సెక్యూరిటీ బ్యూరో ముమ్మరంగా గాలింపు చర్యలు చేపట్టింది.
వాట్సాప్ లేదా టెలిగ్రామ్‌లలో కంపెనీ బాస్‌లు, పైఅధికారుల ఫోటోలతో వచ్చే మెసేజ్‌లను చూసి బ్లైండ్‌గా నమ్మేయవద్దని, డబ్బులు బదిలీ చేసే ముందు సదరు అధికారితో ఫోన్ ద్వారా మాట్లాడి కన్ఫర్మ్ చేసుకోవాలని సైబర్ నిపుణులు సూచిస్తున్నారు.
ఆనంద్ సాయి మాదాసు ప్రస్తుతం హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో డిప్యూటీ చీఫ్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. డిజిటల్ మీడియాలో 9 ఏళ్లకుపైగా అనుభవం ఉంది. హెచ్‌టీ తెలుగులో చేరడం కంటే ముందు ఏబీపీ దేశంలో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేశారు. మెుదట నవతెలంగాణ అనే దినపత్రికలో సబ్ఎడిటర్‌గా జర్నలిజం కెరీర్ మెుదలుపెట్టారు. ఆ తర్వాత కరీంనగర్‌లో ఈనాడు దినపత్రికలో కొంతకాలం సబ్‌ఎడిటర్‌గా బాధ్యతలు చూసుకున్నారు. కాకతీయ యూనివర్సిటీలో 2015-2017 పీజీ మాస్ కమ్యూనికేషన్ అండ్ జర్నలిజం చేశారు. ఈ సమయంలో మేడారం సమ్మక్క-సారలమ్మ జాతర కోసం ప్రత్యేకంగా క్యాంపస్ నుంచి పంపించిన టీమ్‌లో ఉన్నారు. పీజీ చదివే సమయంలోనే క్యాంపస్ రిక్రూట్‌మెంట్‌లో భాగంగా ఈటీవీ భారత్‌కు సెలక్ట్ అయ్యారు. అక్కడ ఆంధ్రప్రదేశ్ డెస్క్‌లో పని చేశారు. అంతేకాదు కొన్ని ప్రత్యేక స్టోరీలు కూడా ఈటీవీ భారత్ వెబ్‌సైట్ కోసం రాసేవారు. 2019 ఎన్నికల్లో ఎలక్షన్ డెస్క్ టీమ్‌లో ఉన్న నలుగురిలో ఆనంద్ సాయి ఒకరు. ఆ తర్వాత అక్కడ నుంచి ఏబీపీ దేశంలోకి వెళ్లి కొంతకాలం పని చేశారు. ఈ సమయంలో కూడా డిజిటల్ మీడియాకు తగినట్టుగా అనేక ప్రత్యేక కథనాలు రాశారు.
ఈ ఘటన సైబర్ నేరగాళ్లు ఎంత క్రియేటివ్‌గా మోసాలు చేస్తున్నారో తెలియజేస్తుంది. ప్రతి ఒక్కరూ అప్రమత్తంగా ఉండాలి. అనుమానాస్పద వాట్సాప్ మెసేజ్‌లను విశ్వసించకూడదు.


