|

Andhravilas.net – Breaking News & Movie Buzz Since 2002

పొలంలో నల్లమందు కలకలం! బౌన్సర్ల కాపలా, ఎమ్మెల్యేల సస్పెన్షన్.. ఏం జరిగిందో తెలుసా?

Published: 10-03-2026, 7:05 AM
పొలంలో నల్లమందు కలకలం! బౌన్సర్ల కాపలా, ఎమ్మెల్యేల సస్పెన్షన్.. ఏం జరిగిందో తెలుసా?
  • దుర్గ్ జిల్లాలో 5 ఎకరాల్లో నల్లమందు సాగును పోలీసులు గుర్తించారు.
  • నల్లమందు సాగుకు బౌన్సర్లను కాపలాగా ఉంచిన వైనం.
  • బీజేపీ నాయకుడు వినాయక్ తామ్రాకర్ ఈ అక్రమ సాగుకు సూత్రధారిగా గుర్తించబడ్డారు.
  • కాంగ్రెస్ సభ్యుల ఆందోళనలతో 29 మంది ఎమ్మెల్యేలను సస్పెండ్ చేసిన ప్రభుత్వం.

చత్తీస్‌గఢ్‌లో ఓ రైతు తన పొలానికి బౌన్సర్లను కాపలాగా ఉంచడం సంచలనంగా మారింది. పోలీసులు ఆ పొలంలో నల్లమందు సాగును గుర్తించడంతో ఈ వ్యవహారం రాజకీయ దుమారానికి దారితీసింది. అసెంబ్లీలో దీనిపై చర్చ జరగడంతో 29 మంది ఎమ్మెల్యేలను సస్పెండ్ చేశారు.

దుర్గ్ జిల్లాలో నల్లమందు సాగు గుట్టు రట్టు

సాధారణంగా సెలబ్రిటీలు బౌన్సర్లను నియమించుకోవడం మనందరికీ తెలిసిందే. కానీ ఓ రైతు మాత్రం ఏకంగా తన పంట పొలానికి బౌన్సర్ల చేత కాపల పెట్టించుకున్నాడు. జెడ్‌ప్లస్ కేట‌గిరీ త‌ర‌హాలో భద్రతను ఏర్పాటు చేసుకుని అక్కడికి ఎవరూ రాకుండా పకడ్బందీగా భద్రత ఏర్పరుచుకున్నాడు. ఇంత జాగ్రత్త వహిస్తున్నాడంటే ఆ పొలంలో అంత అరుదైన, విలువైన పంట ఏముందని తెలుసుకుందామని పోలీసులు, మాజీ ముఖ్యమంత్రి వెళ్లి చూడగా అక్కడున్నది చూసి అంతా షాక్ తిన్నారు. ఎవరిని లోపలకి రానివ్వకుండా సదరు పొలంలో సాగుచేస్తున్నది నల్లమందు అని తేలడంతో అంతా షాక్ కు గురయ్యారు. అయితే నల్లమందు అక్రమ సాగు వెనుక ఉన్నది ఓ బీజేపీ నాయకుడని తెలియడంతో ఇప్పుడీ వ్యవహారం చత్తీస్ గఢ్ (Chhattisgarh) రాజకీయాల్లో దుమారం రేపుతోంది.

బీజేపీ నాయకుడి హస్తం.. రాజకీయ దుమారం

ఛత్తీస్‌గఢ్‌లోని దుర్గ్ జిల్లాలో 5 ఎకరాల పొలంలో ఈ నల్లమందు సాగు చేస్తున్నారు. పోలీసులతో పాటు అపరిచితులు ఎవరూ లోపలికి రాకుండా ఉండేందుకు పొలం చుట్టూ భారీ ఆకారంలో ఉన్న బౌన్సర్లను కాపలగా ఉంచారు. విషయం తెలుసుకున్న పోలీసులు, నార్కోటిక్స్ కంట్రోల్ బ్యూరో (NCB), ఫోరెన్సిక్ సైన్స్ లాబొరేటరీ (FSL), ఎక్సైజ్ మరియు రెవెన్యూ శాఖల అధికారులతో కూడిన సంయుక్త బృందం ఈ నెల 6వ తేదీన రెయిడ్స్ చేసింది. అక్కడ నల్లమందు సాగు చూడి ఆశ్చర్యపోయారు. పెద్ద ఎత్తున నల్లమందు సాగు చేస్తున్నట్లు గుర్తించారు. ఈ నల్లమందు విలువ దాదాపు రూ.8 కోట్లు ఉంటుందని అంచనా వేశారు. నిందితుడికి చెందిన 300 ఎకరాల భారీ పొలంలో మధ్యలో మొక్కజొన్న, అరటి తోటలు సాగు చేస్తూ, ఎవరికీ అనుమానం రాకుండా తోట మధ్యలో ఈ నల్లమందు సాగు చేస్తున్నట్లు గుర్తించారు. ఈ అక్రమ సాగు వెనుక స్థానిక బీజేపీ నాయకుడు, రైస్ మిల్లు ప్రాసెసింగ్ పనుల రాష్ట్ర సమన్వయకర్త వినాయక్ తామ్రాకర్‌గా గుర్తించారు. పోలీసులు అరెస్ట్ చేయగా, పార్టీ అధిష్టానం ఆ వెంటనే తామ్రాకర్‌ను బీజేపీ నుంచి బహిష్కరించింది.

అసెంబ్లీలో గందరగోళం.. ఎమ్మెల్యేల సస్పెన్షన్

ఛత్తీస్‌గఢ్ మాజీ ముఖ్యమంత్రి, కాంగ్రెస్ నాయకుడు భూపేశ్ బాఘేల్ (Bhupesh Baghel) శనివారం పొలానికి చేరుకుని నల్లమందు తోటల ఫోటోలు, వీడియోలను సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. సోమవారం ఈ అంశంపై చర్చించాలని అసెంబ్లీలో కాంగ్రెస్ సభ్యులు వాయిదా తీర్మానం ఇచ్చారు. ఈ సందర్భంగా ప్రభుత్వం ఇచ్చిన సమాధానంతో శాంతిచని కాంగ్రెస్ సభ్యులు నినాదాలు చేయడంతో 29 మంది కాంగ్రెస్ సభ్యులను సస్పెండ్ చేశారు. అనంతర సభా కార్యకలాపాలు తిరిగి ప్రారంభమైన తర్వాత సస్పెండ్ అయిన వారిపై స్పీకర్ తన నిర్ణయం ఉపసంహరించుకున్నారు. ఈ వ్యవహారం తాజాగా దేశవ్యాప్తంగా వైరల్‍గా మారింది.

ఈ ఘటన చత్తీస్‌గఢ్ రాజకీయాల్లో పెను ప్రకంపనలు సృష్టించింది. నల్లమందు సాగు వెనుక ఉన్న అసలు సూత్రధారులను వెలికి తీయాలని ప్రతిపక్షాలు డిమాండ్ చేస్తున్నాయి.

Related News

Plugin developed by ProSEOBlogger
Plugin developed by ProSEOBlogger. Get free Ypl themes.